మోదీతో వైరం లేదు

మోదీతో వైరం లేదు - Sakshi


► అమిత్‌ షానే మాతో కెలుక్కుండు: సీఎం కేసీఆర్‌

► కేంద్రంతో దురుసుగా వ్యవహరించం.. మాకు అభివృద్ధి ముఖ్యం

► ఈసారి బీజేపీ ఒక్క సీటు కూడా గెలవదు

► గత ఎన్నికల్లో గాయ్‌ గత్తరలో ఐదు సీట్లు గెలిచింది

► ధర్నాచౌక్‌ను రియల్‌ ఎస్టేట్‌కు ఇస్తామన్న వారు మూర్ఖులని వ్యాఖ్య




సాక్షి, హైదరాబాద్‌: ‘‘ప్రధాని మోదీతో, కేంద్రంతో మాకు వైరం, ఘర్షణ లేదు. దురుసుగా వ్యవహరించం. మాకు అభివృద్ధి కావాలి. అమిత్‌ షా మాతో కెలుక్కుండు. సార్వత్రిక ఎన్నికల సమయంలో గాయ్‌ గత్తరలో బీజేపీ ఐదు సీట్లు గెలిచింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒక్క కార్పొరేటర్‌ సీటన్నా గెలిచిండ్రా? కేంద్రంతో మంచి సంబంధాలనే కోరుకుంటం. అలాగనీ బంగారు కత్తని మెడ కోసుకోం కదా..?’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. తాజాగా సర్వే చేయించానని, మదింపు జరుగుతోందని చెప్పారు. ఈసారి బీజేపీ ఒక్క సీటు కూడా గెలవదని అభిప్రాయపడ్డారు.



బుధవారం ప్రగతిభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సీఎం జవాబిచ్చారు. మత రిజర్వేషన్లకు వ్యతిరేకమని అమిత్‌ షా అంటున్నారని, కానీ ఒడిశాలో జరిగిన ఆ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ ముస్లింల వెనకబాటుతనాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, జాతీయ బీసీ కమిషన్‌ అధ్యయనం చేయాలని కోరిన సంగతిని గుర్తుచేశారు. రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్ల పెంపుపై ప్రధానికి చెప్పానని, పరిశీలిస్తమన్నారని, ఇది రాష్ట్రపతి ఆమోదానికి కూడా వెళ్తుందన్నారు.



హైదరాబాద్‌లో హిందూ–ముస్లింలు కలిసి బతుకుతున్నారని, కొందరు రజాకార్ల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘ఉత్తర భారతం హైదరాబాద్‌ నుంచి నేర్చుకోవాల్సి ఉందని 1927లోనే మహాత్మాగాంధీ అన్నారు.. అలాంటి చరిత్ర ఉన్న భూమి ఇది. పంచాయితీలు పెడతామంటే నడవదు.. ఈడ గొర్రెలు ఎవరూ లేరు..’’ అని స్పష్టంచేశారు.



నా ఆరోగ్యం భేషుగ్గా ఉంది

తన ఆరోగ్యంపై అడిగిన ఓ ప్రశ్నకు సీఎం స్పందిస్తూ.. ‘‘నా ఆరోగ్యం భేషుగ్గా ఉంది. మూడేళ్లుగా అమెరికా పోతూనే ఉన్న.. ఆపరేషన్లు చేయించుకుంటూనే ఉన్న..’’ అని అన్నారు. మూడేళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో శాంపిళ్లతో సర్వే చేయించానని, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చెప్పబోతున్నానని పేర్కొన్నారు. కేంద్రానికి అనుకూలంగా, బీజేపీకి వ్యతిరేకంగా కనిపిస్తున్నారన్న ప్రశ్నకు.. ‘‘అవుననే అనుకోవాలి.. కేంద్రంలో ఈ మూడేళ్లలో ఒక్క కుంభకోణం కూడా లేదు. ఇక్కడా లేవు. ఉంటే ఎవరైనా రుజువు చేసుకోవచ్చు’’ అని అన్నారు. ఈడీ నోటీసులు అందాయా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘ఈడీ లేదు.. బోడీ లేదు..’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, 27వ తేదీన జరిగే శాసన సభాపక్ష సమావేశంలో దీనిపై నిర్ణయిస్తామని వివరించారు.



అధికారం నాకో లెక్క కాదు..

‘‘అధికారం, ప్రభుత్వం నాకో లెక్కనా? నా అంగి లాగి, లాగు గుంజితే గల్ల పడతనంటున్నా.. ప్రధాని మోదీతో సంబంధాలకూ ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నా..’’ అని సీఎం అన్నారు. సెక్రటేరియట్‌ నిర్మాణానికి అడిగింది పరేడ్‌ గ్రౌండ్‌ కాదని, బైసన్‌ పోలో గ్రౌండ్‌ అని, పరేడ్‌ గ్రౌండ్‌కు ఎలాంటి ఢోకా లేదని స్పష్టంచేశారు. బైసన్‌ పోలో గ్రౌండ్‌లో అసెంబ్లీ, శాసన మండలి, సచివాలయం, తెలంగాణ కళాభారతి నిర్మిస్తామని చెప్పారు. ఇందిరా పార్కు ధర్నా చౌక్, సచివాలయ స్థలాన్ని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని జేఏసీ చైర్మన్‌ కోదండరాం చేసిన విమర్శలను సీఎం దృష్టికి తీసుకుపోగా.. ‘‘మూర్ఖులే అలా మాట్లాడతారు. ఏ పార్కులు అప్పజెప్పినం..’’ అని ప్రశ్నించారు.



అది మిలీనియం జోక్‌..

టీఆర్‌ఎస్‌లో 30 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారట కదా అని కొందరు విలేకరులు ప్రశ్నించగా.. ‘ఇది మిలీనియం జోక్‌ ’ అని సీఎం అన్నారు. కేంద్ర పథకాల కంటే తామే మెరుగ్గా ఉన్నామని, వ్యవసాయ రంగంలో ముందున్నామని, 55.46 లక్షల మంది రైతులకు రూ.8 వేల సాయం చేయనున్నామంటూ గ్రామ రైతు సంఘాల గురించి వివరిం చారు. కేంద్రం ఒక్క జాతీయ ప్రాజెక్టు ఇవ్వలేదని, నీతి ఆయోగ్‌ సిఫారసు చేసినా మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయలకు రూ.24 వేల కోట్లు ఇవ్వలేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విలేకరుల సమావేశంలో మంత్రులు నాయిని, హరీశ్‌రావు, పద్మారావు, లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top