తెలుగు అమలు చేయకపోతే గుర్తింపు రద్దు!

Telugu mandatory clause in school - Sakshi

పాఠశాలలో తెలుగు తప్పనిసరి నిబంధన

సాక్షి, హైదరాబాద్‌: తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయని పాఠశాలల గుర్తింపును రద్దు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు మార్గదర్శకాల్లో నిబంధనను పొందుపరిచేందుకు కసరత్తు మొదలైంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేసేందుకు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ చట్టానికి అనుగుణంగా ప్రస్తుతం నిబంధనలను, మార్గదర్శకాల రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 

తెలుగు అమలు కమిటీకి బాధ్యతలు.. 
ఈ మార్గదర్శకాల రూపకల్పన బాధ్యతలను గతంలోనే ఏర్పాటు చేసిన తెలుగు అమలు కమిటీకి అప్పగించింది. అలాగే 1వ తరగతి, 6వ తరగతి నుంచి ప్రవేశపెట్టనున్న తెలుగు సబ్జెక్టులో ఉండాల్సిన అంశాల రూపకల్పన బాధ్యతలను కూడా ఆ కమిటీకే కట్టబెట్టింది. వాస్తవానికి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) ఆ బాధ్యతలను చేపట్టాల్సి ఉన్నా మొదటి నుంచి తప్పనిసరిగా తెలుగు అమలుకు సంబంధించిన వ్యవహారాలను తెలుగు వర్సిటీ ప్రొఫెసర్‌ సత్యనారాయణ నేతృత్వంలోని కమిటీనే చూస్తోంది. ఆ కమిటీలో ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ శేషుకుమారి, తెలుగు అకా డమీ డైరెక్టర్‌ సత్యనారాయణరెడ్డి సభ్యులుగా ఉండటంతో పుస్తకాల రూపకల్పన బాధ్యతలను దానికే అప్పగించింది. 

చట్టానికి అనుగుణంగానే నిబంధనలు.. 
చట్టానికి అనుగుణంగా నిబంధనలను రూపొందించేందుకు కమిటీ కసరత్తు చేస్తోంది. తప్పనిసరిగా తెలుగును అమలు చేయని పాఠశాలలపై ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశం చట్టంలో లేనందునా.. జరిమానాలు వంటి అంశాల జోలికి వెళ్లే అవకాశం లేదు. అయితే చట్టాలను అమలు చేసే బాధ్యత విద్యా శాఖదే. రాష్ట్రంలోని విద్యా సంస్థలు చట్టాలను అమలు చేయకపోతే ఆయా పాఠశాలల గుర్తింపును రద్దు చేసే అధికారం పాఠశాల విద్యాశాఖకు ఉంది. ఈ నేపథ్యంలో తప్పనిసరి తెలుగును అమలు చేయని పాఠశాలలపై గుర్తింపు రద్దు అస్త్రం ప్రయోగించేలా నిబంధనలను సిద్ధం చేసేందుకు చర్యలు చేపడుతోంది.

అయితే రాష్ట్ర సిలబస్‌ స్కూళ్ల వరకు ఈ నిబంధనను పక్కాగా అమలు చేసే వీలున్నా.. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ సిలబస్‌ స్కూళ్లలో అమలు చేయకపోతే పరిస్థితి ఏంటన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఆయా స్కూళ్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌వోసీ (నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌) ఇస్తుంది. మరోవైపు రాష్ట్రంలోని సీబీఎస్‌ఈ స్కూళ్లపైనా రాష్ట్ర ప్రభుత్వానికి అజమాయిషీ ఉంటుందని ఇదివరకే సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆయా పాఠశాలలపై ఎన్‌వోసీ రద్దుతోపాటు మరిన్ని చర్యలు చేపట్టేలా నిబంధనలను రూపొందించాలని అధికారులు భావిస్తున్నారు. 

కమిటీ కన్వీనర్‌గా కిషన్‌ 
రాష్ట్రంలో 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలని మొదట్లో నిర్ణయించిన సమయంలో ఇంటర్మీడియెట్‌ విద్య కమిషనర్‌ను ప్రభుత్వం నియమించిన కమిటీకి కన్వీనర్‌గా వేశారు. ప్రస్తుతం ఇంటర్మీడియెట్‌ను మినహాయించి పదో తరగతి వరకే తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలని ప్రభుత్వం చట్టం చేసింది. ఈ నేపథ్యంలో నిబంధనల రూపకల్పన కమిటీకి పాఠశాల విద్యా కమిషనర్‌ కిషన్‌ను కన్వీనర్‌గా నియమించనుంది. ఈ మేరకు త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top