ప్రత్యేక హోదా కల్పించాలి! | Telangana political parties to appeal to the 14th Finance Commission | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా కల్పించాలి!

Sep 20 2014 1:34 AM | Updated on Mar 23 2019 9:10 PM

ప్రత్యేక హోదా కల్పించాలి! - Sakshi

ప్రత్యేక హోదా కల్పించాలి!

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని రాష్ట్ర రాజకీయ పార్టీలు 14వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశాయి.

14వ ఆర్థిక సంఘానికి తెలంగాణ రాజకీయ పార్టీల విజ్ఞప్తి
     
విద్యుత్, వ్యవసాయ సంక్షోభాలను అధిగమించేందుకు నిధులివ్వండి
ఫ్లోరోసిస్ సమస్యను పరిష్కరించండి.. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వాలి
కొత్త రాష్ట్రంపై సానుభూతితో ఉన్నామన్న ఆర్థిక సంఘం

 
హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని రాష్ట్ర రాజకీయ పార్టీలు 14వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశాయి. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర విద్యుత్, వ్యవసాయ సంక్షోభాలను అధిగమించేందుకు ఇతోధిక ఆర్థిక సహాయం అందించాలని కోరాయి. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాని విన్నవించాయి. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, మజ్లిస్ పార్టీల ప్రతినిధులు శుక్రవారం సాయంత్రం 14వ ఆర్థిక సంఘం ప్రతినిధులను కలసి వేర్వేరుగా వినతి పత్రాలు సమర్పించారు.

పలు డిమాండ్లు చేశారు. కాగా.. ఆయా నేతల విజ్ఞప్తులు విన్న ఆర్థిక సంఘం చైర్మన్ వైవీ రెడ్డి కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం పట్ల తాము సానుకూల దృష్టితో ఆలోచిస్తున్నామన్నారు. అయితే కొన్ని అంశాలు తమ పరిధిలో లేవని, అందుకు అనుగుణంగా తాము వ్యవహరించాల్సి ఉందని చెప్పారు. ఏదేమైనా తెలంగాణ అభివృద్ధి కోసం తగిన సిఫారసులు చేస్తామని పేర్కొన్నారు. కాగా.. సమావేశానంతరం ఆయా పార్టీల ప్రతినిధులు ఆర్థిక సంఘానికి తాము చేసిన విజ్ఞప్తులను మీడియాకు వెల్లడించారు.
 
50 శాతం నిధులివ్వాలి

స్థానిక సంస్థల బలోపేతంలో భాగంగా పంచాయతీలకు 50 శాతం నిధులు కేటాయించాలి. గతంలో తీసుకున్న ప్రణాళిక, ప్రణాళికేతర రుణాలను రద్దు చేయాలి. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఫ్లోరోసిస్ సమస్యను అధిగ మించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలి.
 - కె.శ్రీనివాస్‌రెడ్డి, రవీంద్రకుమార్(సీపీఐ)
 
విద్య, వైద్య, నీటికి ప్రాధాన్యం

తెలంగాణలో భూగర్భ జలాలపై ఆధారపడి 85 శాతం మంది రైతులు వ్యవసాయం చేస్తున్నందున చిన్న నీటి పారుదల రంగానికి అత్యధిక నిధులు కేటాయించాలి. రాష్ట్రంలో ఫ్లోరోసిస్ సమస్య ఎక్కువగా ఉన్నందున తాగునీటి కోసం విరివిగా నిధులివ్వాలి.
 - సారంపల్లి మల్లారెడ్డి, ప్రసాదరావు (సీపీఎం)
 
మానవాభివృద్ధి సూచికగా నిధులివ్వాలి


స్థూల జాతీయోత్పత్తి ఆధారంగా కాకుండా ఇకపై మానవాభివృద్ధి సూచిక ఆధారంగా రాష్ట్రాలకు నిధులు కేటాయించాలి. కేంద్ర పన్నుల వసూళ్లలో రాష్ట్ర వాటాను 50 శాతం వరకు పెంచాలి. స్థానిక సంస్థలకు ఈసారి అధిక నిధులివ్వాలి. సామాన్యుల విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి.
 - కమలాకరరావు, కొనగాల మహేష్ (కాంగ్రెస్)
 
‘సెస్’లో వాటా ఇవ్వాలి

 రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లులో పొందుపర్చిన సిఫారసులన్నీ అమలయ్యేలా నిధులు కేటాయించాలి. హేతుబద్ధత లోపించిన పన్నుల వాటాను సరిచేయాలి. సెస్ పేరిట వసూలు చేస్తున్న నిధుల్లో తెలంగాణకు తగిన వాటా ఇవ్వాలి. వ్యవసాయాభివృద్ధికి విరివిగా నిధులివ్వాలి.    
 - ఎల్.రమణ, చంద్రశేఖర్‌రెడ్డి (టీడీపీ)
 
‘పాలమూరు’కూ జాతీయహోదా

 ప్రాణహిత-చేవెళ్లతో పాటు పాలమూరు ఎత్తిపోతల పథకానికి కూడా జాతీయ హోదా కల్పించాలి. తెలంగాణలో 20 ఏళ్లపాటు టాక్స్ హాలిడేను ప్రకటించాలి.  నేరుగా పంచాయతీలకే నిధులివ్వడంతో పాటు వాటికి సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ కమిషన్ల మాదిరిగానే బీసీ కమిషన్‌కు జాతీయ హోదా కల్పించి అధిక నిధులు కేటాయించాలి.    - బండారు దత్తాత్రేయ, కె.లక్ష్మణ్ (బీజేపీ)
 
4 వేల మెగావాట్ల కరెంటివ్వండి

20 లక్షల వ్యవసాయ పంపుసెట్లున్న తెలంగాణలో విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు ఎన్టీపీసీ ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్ అదనంగా ఇవ్వాలి. తెలంగాణ మిగులు ఆదా యం కలిగిన రాష్ట్రం కాదు. ఏపీ ప్రభుత్వ కార్యాలయాలు అక్కడికి తరలిపోతే తెలంగాణ ఆర్థిక పరిస్థితులు వెల్లడవుతాయి. తెలంగాణలో జరిగే నష్టాన్ని అధిగమించేందుకు తగిన ఆర్థిక సాయం చేయాలి.
 - జనక్‌ప్రసాద్, సూర్యప్రకాష్ (వైఎస్సార్‌సీపీ)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement