కృష్ణాకూ రివర్స్‌!

Telangana Govt Plans To Reverse Pumping Krishna Water To Jurala - Sakshi

జూరాలకు నీటి లభ్యత పెంచేలా చర్యలు.. 

పాలమూరు–రంగారెడ్డి నుంచి తరలింపు

కర్వెన రిజర్వాయర్‌ నుంచి పంపేలా ప్రణాళిక

నెలకు ఒక టీఎంసీ కోయిల్‌సాగర్, సంగంబండకు

మరో 1.5 టీఎంసీ జూరాలకు..

సీఎంతో చర్చించాక తుది ప్రతిపాదనలు

సాక్షి, హైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను రివర్స్‌ పంపింగ్‌ చేస్తున్నట్లే కృష్ణా నదీ జలాలనూ పాలమూరు–రంగారెడ్డి ద్వారా జూరా లకు తరలించే ప్రాథమిక ప్రతిపాదనలు సిద్ధమ య్యాయి. సాధారణంగా కృష్ణానది సహజ ప్రవా హాలు జూరాల నుంచి శ్రీశైలానికి వెళ్తుంటాయి. అయితే వర్షాకాలం తర్వాత ఎగువ నుంచి వరద ప్రవాహం ముగిశాక జూరాలలో నీటి లభ్యత పడిపోతుండటం, అవసరాలు భారీగా ఉన్న నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రివర్స్‌లో జూరాలకు నీటిని తరలించాలని సాగునీటి శాఖ ప్రణాళిక రచించారు. 

ఇందుకోసం శ్రీశైలంపై ఆధారపడి చేపట్టిన పాలమూరు ప్రాజెక్టులోని కర్వెన రిజర్వాయర్‌ ద్వారా నీటిని జూరాలకు తరలించేందుకు యోచిస్తున్నారు. దీంతో వేసవిలో కూడా జూరాల ద్వారా తాగునీరు, యాసంగి ఆయకట్టుకు సాగు నీరిచ్చే వీలుకలుగుతుంది. ఇందుకోసం దాదాపు రూ.400 కోట్లతో ప్రాథమిక అంచనాలు వేశారు. ఈ ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్‌ పరిశీలించి ఆమోదం తెలిపిన అనంతరం ఈ ప్రతిపాదనలకు తుది రూపం రానుంది.

సామర్థ్యం తక్కువ, అవసరాలు ఎక్కువ
జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, నికర నిల్వ సామర్థ్యం 6.79 టీఎంసీలుగా ఉంది. దీని కింద ఆయకట్టు 1.04 లక్షల ఎకరాలు కాగా, దీనికే 17.84 టీఎం సీల అవసరం ఉంటుంది. దీనికి తోడు జూరాలపై ఆధారపడి నెట్టెంపాడు (21.42 టీఎంసీ–2 లక్షల ఎకరాలు),బీమా(20టీఎంసీ– 2.03లక్షల ఎకరాలు), కోయిల్‌సాగర్‌ (3.9 టీఎంసీ– 50,250 ఎకరాలు) ఎత్తిపోతల పథకాలు చేపట్టారు. దీంతో పాటే మిషన్‌ భగీరథ కింద మరో 7.43 టీఎంసీల అవసరాలకు జూరాలపై ఆధారపడి ఉన్నాయి. 

జూరాల కింది తాగు, సాగునీటి అవసరాలకు నీటిని అందించాలంటే రోజూ 10 వేల క్యూసెక్కుల మేర నీటి అవసరం ఉంటుంది. అయితే జూరాలలోని నికర నిల్వ సామర్థాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ నిల్వ నీటితో 8 రోజులకు మించి నీరు సరిపోదు. అదీగాక నవంబర్‌ తర్వాత ఎగువ నుంచి వరద ఆగాక జూరాలకు వచ్చే ప్రవాహాలు 2001–2018 వరకు చూస్తే రోజుకు 2,678 క్యూసెక్కులకు మించి లేదు. ఈ నీటితో జూరాలపై ఉన్న నీటి అవసరా లను, యాసంగిలో సాగునీటి అవసరాలకు నీరివ్వడం సాధ్యం కాదు. 

దీన్ని దృష్టిలో పెట్టుకొని 215 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలంపై ఆధారపడి చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి జూరాలకు రివర్స్‌లో నీటిని తరలించి, వేసవిలోనూ జూరాలలో నీటిలభ్యత పెంచే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. పాలమూరు ప్రాజెక్టులోని నాలుగో రిజర్వాయర్‌ అయిన 17.34 టీఎంసీ సామర్థ్యం ఉన్న కర్వెన రిజర్వాయర్‌ నుంచి కోయిల్‌సాగర్, సంగం బండలకు నెలకు ఒక టీఎంసీ, అటునుంచి జూరాలకు నెలకు 1.5 టీఎంసీల నీటిని తరలించే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. దీనిపై ప్రాజెక్టు ఇంజనీర్లు ప్రాథమిక ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

తరలింపు ఇలా..
కర్వెన రిజర్వాయర్‌ కింద హై లెవల్‌ కెనాల్‌ (హెచ్‌ఎల్‌సీ)108 కిలోమీటర్లు ఉండగా, దాని ప్రవాహ సామర్థ్యం 2,213 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం కోయిల్‌సాగర్, సంగంబండ మీదుగా జూరాల వరకు నీటిని తరలించాలంటే దాని సామర్థ్యాన్ని 3,564 క్యూసెక్కులకు పెంచాల్సి ఉంటుంది. హెచ్‌ఎల్‌సీ 32వ కిలోమీటర్‌ నుంచి ఒక తూము (ఓటీ) నిర్మించి దాని నుంచి 386 క్యూసెక్కుల నీరు (నెలకు ఒక టీఎంసీ) తరలించేలా కాల్వలను నిర్మించి దాన్ని కోయిల్‌సాగర్‌ రిజర్వాయర్‌లో కలిసే హన్వాడ మండలంలోని చిన్నవాగులో కలపాలి. ఇలా కోయిల్‌సాగర్‌కు నీటిని తరలించేందుకు రూ.65 కోట్లు ఖర్చు కానుంది. 

ఇక కర్వెన రిజర్వాయర్‌ కింది హెచ్‌ఎల్‌సీ 90.7వ కిలోమీటర్‌ వద్ద మరో తూము నిర్మాణం చేసి, 965 క్యూసెక్కులు (నెలకు 2.5 టీఎంసీ, ఇందులో 1 టీఎంసీ సంగంబండకు, మరో 1.5 టీఎంసీ జూరాలకు) తరలించేలా కాల్వలను తవ్వి దాన్ని నారాయణపేట మండలం సింగారం గ్రామంలో ఉన్న మాలవాగులో కలపాలి. దీనికి రూ.155 కోట్ల మేర ఖర్చు కానుంది. ఇక సంగంబండలో నీరు మిగులు అయితే అవి పెద్దవాగు ద్వారా జూరాల ప్రాజెక్టును చేరతాయి. అయితే ఈ నీటిని తరలించే క్రమంలో వివిధ నిర్మాణాలకు కలిపి రూ.180 కోట్లు ఖర్చు కానుంది. 

అయితే కర్వెన నుంచి జూరాలకు వరద నీటిని తరలించే క్రమంలో ఇప్పటికే ఎన్ని నిర్మాణాలు ప్రభావితం అవుతాయి.. ఇప్పటికే సాగులో ఉన్న ఆయకట్టు ఏమైనా దెబ్బతింటుందా? అన్న అంశం సమగ్ర సర్వేలోనే తేలనుంది. ప్రస్తుతం సిద్ధం చేసిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించిన అనంతరం ఆయన ఆమోదం మేరకు తుది ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top