బంగారు తెలంగాణ సాధనకు భాగస్వాములు కావాలి

Telangana Formation Day Celebrations In Sangareddy - Sakshi

సాక్షి, సంగారెడ్డి: ఐదేళ్లలో రాష్ట్రంతోపాటు జిల్లా సమగ్రాభివృద్ధి సాధించిందని, బంగారు తెలంగాణ సాధనకు అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని, సంక్షేమంతోపాటు అభివృద్ధిలోనూ రాష్ట్రం ముందడుగు వేస్తోందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలి అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోమంత్రి మహమూద్‌ అలి ఉదయం 9 గంటలకు పోలీసు గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఐదు వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకొని ఆరవ వసంతంలోకి అడుగిడుతున్న రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర సాధనకోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులకు నివాళులి అర్పిస్తున్నానని, వారి త్యాగం వృథా పోదని చెప్పారు. రాష్ట్ర ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు చేయిచేయి కలిపి ఉద్యమాన్ని ముందుకు నడిపించారని, ఆ ప్రజా ఉద్యమ ఫలితంగా తెలంగాణ 29వ రాష్ట్రంగా అవతరించిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే క్రమంలో ప్రభుత్వం  ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రజల అవసరాలు, ఆకాంక్షల మేరకు ప్రభుత్వం ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, విద్యార్థులకు సన్నబియ్యం, గురుకుల పాఠశాలల ఏర్పాటు, రైతుబంధు, రైతుబీమా, తదితర ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నదని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి వివిధ పథకాలతో తోడ్పాటునందిస్తున్నదని వివరించారు.
 
మిషన్‌ భగీరథతో ఇంటింటికీ నీటి సరఫరా
మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ రక్షిత తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో జిల్లాలోని 949 ఆవాసాలకు సరఫరా చేస్తున్నామని హోంమంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. ఐదవ విడత హరితహారంలో భాగంగా జిల్లాలో ఈ ఏడాది 2.60 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. జిల్లాలో 538 నర్సరీల ద్వారా సుమారుగా 2.64 కోట్ల మొక్కలను పెంచుతున్నట్లు చెప్పారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకం కింద సంగారెడ్డి జిల్లాకు 5,555 ఇళ్లు మంజూరయ్యాయని, వీటిలో 4,606 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నట్లు చెప్పారు. వీటి నిర్మాణాలకు  ఇప్పటివరకు రూ.102 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 28,153 మందికి కేసీఆర్‌ కిట్లను అందజేశామని చెప్పారు. గ్రామీణాభివృద్ధి పథకం ద్వారా అర్హులైన 1.39 లక్షల మందికి ప్రతి నెలా రూ.15.52 కోట్లు ఆసరా పింఛన్‌ లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 182 స్వయం సహాయక సంఘాలకు రూ.7.28 కోట్లు బ్యాంకు లింకేజీ ద్వారా రుణం మంజూరు చేశామని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 60,817 కుటుంబాల్లోని 16.93 లక్షల మందికి పనిదినాలు కల్పించినట్లు చెప్పారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో గ్రామ పంచాయతీల్లో వందశాతం పన్నులు వసూలు చేసినట్లు చెప్పారు.

విద్యాభివృద్ధికి ప్రాధాన్యం
జిల్లాలోని 1,288 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1,22,626 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద సన్న బియ్యంతో భోజనాన్ని అందిస్తున్నామని హోంమంత్రి మహమూద్‌ అలీ పేర్కొన్నారు. ఇటీవల వెలువడిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా 98.2 ఉత్తీర్ణతా శాతంతో రాష్ట్రంలోనే 4వ స్థానంలో నిలిచిందన్నారు. గిరిజన సంక్షేమంలో భాగంగా 2018–19 సంవత్సరంలో 2,532 మంది విద్యార్థులకు పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ కింద రూ.3.76 కోట్లు మంజూరు చేశామన్నారు. షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి పథకం కింద ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతనాల కింద 2018–19 సంవత్సరంలో 9,653 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.11.40 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. షెడ్యూల్డ్‌ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం ద్వారా వ్యక్తిగత స్వయం ఉపాధి పథకాల కింద ఈ ఆర్థిక సంవత్సరంలో వంద శాతం సబ్సిడీతో 768 యూనిట్లకు రూ.3.84 కోట్లు అందిస్తున్నామన్నారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి కింద 24,807 మంది బీసీ విద్యార్థులకు రూ.18.03 కోట్లు, 2,673 మంది ఈబీసీ విద్యార్థులకు రూ.6.53 కోట్లు రీయింబర్స్‌మెంట్‌ ఆఫ్‌ ట్యూషన్‌ ఫీజు మంజూరు చేశామని వివరించారు.

అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం కింద జిల్లాలో మైనారిటీ విద్యార్థుల కోసం 12 రెసిడెన్సియల్‌ పాఠశాలలు, 2 జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ పాఠశాలల్లో 3,314 మంది, జూనియర్‌ కళాశాలల్లో 144 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. సమగ్ర బాలల పరిరక్షణ పథకం ద్వారా జిల్లాలో 72 మంది పిల్లలకు రూ.8.64 లక్షల ఆర్థిక సహాయం అందజేశామని తెలిపారు. గృహ హింస రక్షణ చట్టం కింద 694 కేసులు పరిష్కరించినట్లు చెప్పారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 1,382 పరిశ్రమలకు అనుమతి నిచ్చామన్నారు. రూ.10,630 కోట్ల పెట్టుబడితో 909 పరిశ్రమలు స్థాపించి 91,665 మందికి ఉపాధి కల్పించనున్నామని ఆయన వివరించారు. జిల్లాలో 2018–19 సంవత్సరంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం కింద 7,571 మంది పేద మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందజేశామని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో అహర్నిషలు శ్రమిస్తూ జిల్లా ప్రజలు శాంతియుతంగా ఉండేందుకు కృషి చేస్తున్న పోలీసు యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ఎం.హనుమంతరావు, ఎస్పీ ఎస్‌.చంద్రశేఖర్‌రెడ్డి, జేసీ నిఖిల, ట్రైనీ ఐఏఎస్‌ జితేష్‌ వి.పాటిల్, జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్, నారాయణఖేడ్, అందోల్‌ ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.సత్యనారాయణ, çజిల్లా అధికారులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమానికి ప్రాధాన్యం

రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో మెజారిటీ ప్రజలు ప్రభుత్వ పాలనపై సంతృప్తిగా ఉన్నారని హోంమంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను ఆయన వివరించారు. జిల్లాలో రైతుబంధు పథకం కింద ఖరీఫ్‌లో 2,69,318 మంది రైతులకు రూ.284.33 కోట్లు, రబీలో 2,41,792 మంది రైతులకు రూ.264.23 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. రైతు బీమా పథకం కింద ఇప్పటివరకు 695 మందికి రూ.33.75 కోట్లు మృతిచెందిన రైతుల నామినీల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. జిల్లాలో 3,15,673 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశామన్నారు. ఆపద్బంధు పథకం కింద 143 మందికి రూ.71.50 లక్షల ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 2,51,710 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేయడానికి అంచనా వేసినట్లు తెలిపారు. ఖరీఫ్‌లో 30,713 క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాన్ని రైతులకు ఇవ్వడానికి సిద్ధం చేశామన్నారు.

తెలంగాణ ‘మినీ మిషన్‌ మిల్లెట్‌’ కార్యక్రమాన్ని జిల్లాలో 6 మండలాల్లోని 712 ఎకరాల్లో అమలు చేస్తున్నామని వివరించారు. రబీ సీజన్‌లో ఐకేపీ, పీఏసీఎస్‌ల ద్వారా 60 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 6,975 మంది రైతుల నుంచి 3,04,341 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించామని తెలిపారు. మార్కెటింగ్‌ శాఖ ద్వారా జిల్లాలో 91,232 మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం గల 36 గోదాంలను అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. జిల్లాలోని జోగిపేట్, జహీరాబాద్, సదాశివపేట్, వట్‌పల్లి వ్యవసాయ మార్కెట్లలో ఈ–నామ్‌ జాతీయ వ్యవసాయ మార్కెట్‌ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. గొర్రెల అభివృద్ధి పథకం కింద జిల్లాలో రెండు విడతల్లో రూ.210.34 కోట్లతో 16,827 గొర్రెల యూనిట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. పాడి పశువుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 1,671 పాడి గేదెలను రైతులకు అందించినట్లు పేర్కొన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం చేపల పెంపకాన్ని చేపట్టామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐఎఫ్‌డీఎస్‌ పథకం ద్వారా వందశాతం రాయితీపై జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్లలో సుమారు 1.13 కోట్ల విలువైన 1.26 కోట్ల చేప పిల్లలను వదిలినట్లు తెలిపారు. సింగూరు జలాశయంలో రూ.57.42 లక్షల విలువగల 29 లక్షల నీలకంఠ రొయ్య పిల్లలను వదిలామని ఆయన పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top