10 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి 

Telangana To Add Over 10000 MW Power Capacity Within Three Years - Sakshi

వచ్చే మూడేళ్లలో సాధించే అవకాశం 

గత ఆరేళ్లలో విద్యుదుత్పత్తి రెట్టింపు 

7,778 నుంచి 15 వేల మెగావాట్లకు పెరిగిన సామర్థ్యం 

తలసరి విద్యుత్‌ వినియోగంలో రాష్ట్రానికి అగ్రస్థానం 

27 వేల కోట్లతో విద్యుత్‌ సరఫరా, పంపిణీ వ్యవస్థల బలోపేతం 

ఆరేళ్లలో రాష్ట్ర విద్యుత్‌ రంగం వెలుగుల ప్రస్థానం 

సాక్షి, హైదరాబాద్ ‌: రాష్ట్రాన్ని మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యానికి అనుగుణంగా అడుగులు వడవడిగా పడుతున్నాయి. విభజన చట్టంలో ఇచ్చిన హామీ నెరవేర్చాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రామగుండం ఎన్టీపీసీలో 4 వేల మెగావాట్ల విద్యుత్‌ కేంద్రానికి ఆమోదం తీసుకుంది. ఇప్పటికే మొదటి దశలో 1,600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి యూనిట్ల నిర్మాణాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. 4 వేల మెగావాట్ల యాదాద్రి విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం నిర్మాణ పనులు పూర్తవుతాయి. సింగరేణి నుంచి మరో 800, సీజీఎస్‌ ద్వారా మరో 809, సోలార్‌ ద్వారా 1,584, హైడల్‌ ద్వారా 90 మెగావాట్లు అందుబాటులోకి రానుంది. దీంతో మూడేళ్లలో 10 వేల మెగావాట్లకు పైగా అదనపు విద్యుత్‌ వచ్చి చేరుతుంది. అప్పుడు తెలంగాణ మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మారనుంది.

దీనివల్ల విద్యుత్‌ సంస్థలు ఆర్థికంగా బలోపేతం అవుతాయి. అవసరం ఉన్న వర్గాలకు మరిన్ని రాయితీలు ఇచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. తెలంగాణ ఏర్పడే నాటికి తీవ్ర విద్యుత్‌ సంక్షోభం ఉంది. హైదరాబాద్‌లో రోజు 2 నుంచి 4 గంటలు, పట్టణాల్లో 6 గంటలు, గ్రామాల్లో 12 గంటలు విద్యుత్‌ కోతలు అమలయ్యేవి. తెలంగాణ ఏర్పడ్డాక విద్యుత్‌ సంక్షోభం నుంచి గట్టెక్కే సవాల్‌ను సీఎం కేసీఆర్‌ మొదటగా స్వీకరించారు. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి, రాష్ట్రం ఏర్పడిన 6వ నెల (2014 నవంబర్‌ 20) నుంచే కోతల్లేని విద్యుత్‌ ప్రజలకు అందుతోంది. గృహావసరాలకు, పరిశ్రమలకు, వాణిజ్య అవసరాలకు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. వ్యవసాయానికి 2018 జనవరి 1 నుంచి రైతులకు 24 గంటల కరెంటు అందిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 24.16 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల పాటు నిరంతర ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ కొత్త చరిత్రను లిఖించింది. రాష్ట్రంలోని 30 శాతం కరెంటు ఉచిత విద్యుత్‌ కోసమే వినియోగిస్తున్నారు. 

వంద శాతం పెరిగిన సామర్థ్యం.. 
2014లో స్థాపిత విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా, ఫిబ్రవరి 2020 నాటికి వంద శాతానికి పైగా పెరిగి 15,980 మెగావాట్లు అందుబాటులోకి వచ్చింది. ఇందులో 3,681 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ కూడా ఉంది. 27.77 వేల కోట్ల వ్యయంతో పంపిణీ, సరఫరా వ్యవస్థలను పటిష్టం చేసి విద్యుత్‌ ఉత్పత్తి చేయడంతో పాటు సరఫరా వ్యవస్థను మెరుగుపర్చడంలో తెలంగాణ విద్యుత్‌ సంస్థలు ప్రగతి సాధించాయి. 99.9 శాతం ట్రాన్స్‌ మిషన్‌ అవెయిలబిలిటీతో దేశ సగటును మించింది. ఇందుకు రూ.27,770 కోట్ల వ్యయంతో సబ్‌ స్టేషన్ల నిర్మాణం, ట్రాన్స్‌ ఫార్మర్ల ఏర్పాటు, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ ఫార్మర్లు, కొత్త లైన్ల నిర్మాణం చేపట్టింది. 

దేశ సగటును మించి 
ప్రగతి సూచికలుగా గుర్తించే అంశాల్లో తలసరి విద్యుత్‌ వినియోగం ఒకటి. ఈ అంశంలో తెలంగాణ దేశ సగటును మించింది. 2018–19 సంవత్సరంలో దేశవ్యాప్తంగా సగటు తలసరి విద్యుత్‌ వినియోగం 1,181 యూనిట్లు కాగా, తెలంగాణలో ప్రస్తుతం 1,896 యూనిట్లు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో తలసరి విద్యుత్‌ వినియోగం 1,356 యూనిట్లుంటే, ఆరేళ్లలో 39.82 శాతం పెరిగింది. ఏడాదికి వెయ్యి యూనిట్లకు పైగా తలసరి విద్యుత్‌ వినియోగం జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధికంగా 10 శాతం వృద్ధి రేటు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. 2017–18 సంవత్సరంలో తెలంగాణలో తలసరి విద్యుత్‌ వినియోగం 1,727 యూనిట్లుంటే, 2018–19 నాటికి 1,896కి చేరింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా తలసరి విద్యుత్‌ వినియోగం 2.7 శాతం మాత్రమే వృద్ధి సాధించడం విశేషం. 2017–18లో దేశ సగటు తలసరి విద్యుత్‌ వినియోగం 1,149 యూనిట్లుంటే, 2018–19లో 1,181 యూనిట్లు నమోదైంది. 

ఔట్‌ సోర్సింగ్‌ క్రమబద్ధీకరణ 
రాష్ట్రంలోని విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ సంస్థలైన ట్రాన్స్‌ కో, జెన్‌ కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లలో ఔట్‌సోర్సింగ్‌ విధానంలో విధులు నిర్వర్తిస్తున్న 23,667 మంది తాత్కాలిక ఉద్యోగుల (ఆర్టి జన్ల) సర్వీసును ప్రభుత్వం క్రమబద్ధీకరించింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top