ఎవరైతే బాగుంటుంది...

T Congress Leaders MLA Candidates List Rangareddy - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్‌ పార్టీ సమరానికి సన్నద్ధమైంది. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలు పెట్టింది. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, ఆశావహుల జాబితాపై అభిప్రాయసేకరణ ప్రారంభించింది. శాసనసభ రద్దు, వెనువెంటనే అభ్యర్థులను ఖరారు చేసి దూకుడు ప్రదర్శిస్తున్న టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు వ్యూహాలకు పదునుపెడుతోంది. ప్రస్తుతం మానస సరోవర్‌ యాత్రలో ఉన్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వచ్చిన తర్వాత అభ్యర్థులను ప్రకటించాలని పీసీసీ భావిస్తోంది.

అయితే, ఆ లోపు సమర్థులైన అభ్యర్థుల జాబితా తయారు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు శనివారం గాంధీభవన్‌లో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జిల్లా కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జీ డీకే ఆరుణ, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌లు కూడా పాల్గొన్న ఈ సమావేశంలో నియోజకవర్గాల పార్టీ పరిస్థితిని సమీక్షించారు.

అంతేగాకుండా ఆయా సీట్లను ఆశిస్తున్న నేతల గుణగణాలు, ఆర్థిక వనరులు ఇతరత్రా అంశాలను అడిగి తెలుసుకున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల బలాలు, బలహీనతలను కూడా ఆరాతీశారు. నియోజకవర్గాల వారీగా సేకరించిన అభిప్రాయాలను క్రోడీకరించి అధిష్టానానికి నివేదించనున్నట్లు బోసురాజు తెలిపారు. అంతేగాకుండా పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ నిర్వహిస్తున్న ‘భారత్‌ బంద్‌’ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ బంద్‌ను సక్సెస్‌ చేయడం ద్వారా అటు మోడీని.. ఇటు ఆయనకు మద్దతుగా నిలుస్తున్న కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top