మా ఆవిడే నాకు డాక్టర్‌ | Sakshi Interview With Doctor Amar Singh Nayak In Medak | Sakshi
Sakshi News home page

మా ఆవిడే నాకు డాక్టర్‌

Jun 30 2019 5:09 PM | Updated on Jun 30 2019 5:26 PM

Sakshi Interview With Doctor Amar Singh Nayak In Medak

రెండు దశాబ్దాల నుంచి డాక్టర్‌ వృత్తిలో కొనసాగుతున్నాను. వేలాది మందికి వైద్యసేవలు అందించాను. నేను అందరికీ డాక్టర్‌ అయితే నాకు మాత్రం మా ఆవిడే డాక్టర్‌. నా భార్య డాక్టర్‌ కవితాకుమారి నా ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది.  డాక్టర్స్‌ డే సందర్భంగా జిల్లా వైద్యాధికారి అమర్‌సింగ్‌ నాయక్‌  ‘సాక్షి’ పర్సనల్‌ టైంతో మాట్లాడారు. ఆయన చిన్ననాటి కష్టాలు, డాక్టర్‌ అయ్యేందుకు ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, తీరిక వేళల్లో సరదాగా గడపటం, ఇలా అనేక  విషయాలు ఆయన ముచ్చటించారు... ఆయన మాటల్లోనే..

సాక్షి, సిద్దిపేట: మాది ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని మెట్‌పల్లి డివిజన్‌ మెట్లచిట్టాపూర్‌ సమీపంలోని గిరిజన తండా. అమ్మ సుగుణాబాయి, నాన్న  నర్సింహులు నాయక్‌. మేము ఐదుగురం అన్నదమ్ముళ్లం. మాది వ్యవసాయ కుటుంబం. అయినా నాన్న అందరిని చదివించారు. బడికి వెళ్లి ఇంటికి రాగానే చెలక పనులకు వెళ్లాల్సిందే. ఆదివారం వస్తే అందరం కలిసి పనులు చేసేవాళ్లం. నాన్న కూరగాయులు బాగా పండించేవారు. వాటిని అమ్మడానికి నేను మెట్‌పల్లి మార్కెట్‌కు వెళ్లేవాడిని. అలా చదువు చదువే.. పని పనే అన్నట్లు మేం పెరిగాం.. నేను మా ఊరు మెట్‌పల్లి, హైదరాబాద్, కరీంనగర్‌లలో  చదివాను. ఇంటర్‌ నాగార్జున సాగర్‌ ఏపీఆర్‌జేసీలో పూర్తి చేశాను. మెడిసిన్‌ కాకతీయ మెడికల్‌ కళాశాలలో చదివాను. మా తండా అంటే నాకు బాగా  ఇష్టం. ఏ మాత్రం వెసులుబాటు దొరికినా.. మా ఊరికి వెళ్తాం. అక్కడ ఉన్నంత సేపు అన్నీ మర్చిపోతాం. అందుకే మా కుటుంబ సభ్యులు కూడా అక్కడికి వెళ్లడానికి బాగా ఇష్ట పడతారు. అక్కడకు వెళ్తే హాయిగా ఉంటుంది. నాకు  చిన్ననాటి నుంచి గణితం అంటే భయం.
అందుకోసమే                                    

 సైన్స్‌ గ్రూపు(బీపీసీ) తీసుకున్నాను. అలా డాక్టరనయ్యాను.  నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు చూడటం ఇష్టం. అదేవిధంగా పాత సినిమాల పాటలు వినడం నా అలవాటు.  ప్రధానంగా మహ్మద్‌ రఫీ పాడిన పాటలు బాగా వింటాను. ‘బహారో పూలు బరసావో మెరా మహబూబ్‌ ఆయా... ’ అన్న పాటతో మహ్మద్‌ రఫీ పాడిన ప్రతీ పాట వినడం అలవాటైంది. పాత పాటలు మనస్సుకు అత్తుకునే విధంగా సంగీతం, అందులో భావం ఉండేది. కానీ ఇప్పుడు అంతా గజిబిజిగా ఉన్నా పాటలు వస్తున్నాయి..    ఆదివారం వస్తే మా ఆవిడ, అమ్మాయిలతో కలిసి కుటుంబ కథాచిత్రాలు చూస్తాం.. పార్కుకు వెళ్లి అలా సేదతీరుతాం. 

సొలాయి రుచే వేరు.. 
మా గిరిజనుల వంటకంలో (మాంసంతో చేసేవి) సొలాయికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. పండుగలు, ఫంక్షన్లు, దేవతలకు పెట్టినప్పుడు సొలాయి చేయడం ఆనవాయితీ. మా ఇంట్లో చేసిన సొలాయి భలే రుచిగా ఉంటుంది. నేను శాఖారం అంటే ఇష్టపడతా.. మాంసంతో చేసిన సొలాయి తింటే అన్ని మర్చిపోతాం. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. కానీ ఇప్పుడు అది చేసేవారు తక్కువయ్యారు.. తినడం కూడా తక్కువ అయ్యింది. ఇక జొన్నరొట్టె, పచ్చకూర బాగా ఇష్టం. ఎల్లిపాయ కారం, జొన్నరొట్టె కామినేషన్‌ భలే రుచిగా ఉంటుంది. ఉద్యోగం, పిల్లల చదువుల దృష్ట్యా హైదరాబాద్‌లో ఉంటున్నాం.. ఇక్కడ అవేమీ దొరకవు. అందుకోసమే ఆదివారం పిల్లలతో  మంచి హోటల్‌కెళ్లి వారికి కావాల్సింది తినిపిస్తాను.

మా చిన్నమ్మే స్ఫూర్తి.. 
మా కుటుంబంలో మంచి చెడ్డలు అన్నింటికీ మా చిన్నమ్మే. కాకతీయ యూనివర్సీటీ అర్థశస్త్ర ప్రొఫెసర్‌ డాక్టర్‌ శ్యామలాదేవి మాకు స్ఫూర్తి. ఆమె మద్దతు, ఆదరణతోనే అందరం చదువుకో గలిగాం. ఉన్నత స్థాయిలో నిలబడగలిగాం. మా ఆవిడ కవితా కుమారి ఆయుర్వేదిక్‌ డాక్టర్‌ హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. మా పెద్ద అమ్మాయి ఆకాంక్ష ఇంజనీరింగ్, చిన్న పాప వైష్ణవి డాక్టర్‌ చదువుతోంది. మా అన్నలు నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ, ఆర్టీసీ, ఆర్‌అండ్‌బీ విభాగాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మా ఆందరిని ప్రోత్సహించింది మా చిన్నమ్మే. అందుకోసమే మా అందరికి ఆమె మాట వేదం.

రంగారెడ్డి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌ ప్రాథమిక ఆస్పత్రిలో పనిచేసినప్పుడు అక్కడి ప్రజల ఆధరాభిమానం మరువలేను. ఒకే రోజు 50 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి అధికారుల అభినందనలు పొందాను. డాక్టర్‌ వృత్తి దేవుడితో సమానం అంటారు.. ధనార్జన కన్నా సామాజిక సేవా కొణంలోని పనిచేస్తేనే విలువలుంటాయి. ఇంటర్‌ అయిపోగానే ఎంసెట్‌ రాశాను. అప్పుడు సీటు రాలేదు. సంవత్సరం కుస్తీపట్టి మళ్లీ రాశాను మంచి ర్యాంకు వచ్చింది. వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీలో సీటు వచ్చింది. ఆరోజు నా జీవితంలో మర్చిపోలేనిది. అదేవిధంగా మా నాన్న నర్సింహులు నాయక్, మా అన్న సుందరయ్య చనిపోయిన రోజు నేను బాగా బాధపడ్డాను.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement