గ్రామాభివృద్ధికి బాటలు

గ్రామాభివృద్ధికి బాటలు - Sakshi


‘సాక్షి’తో కలెక్టర్ గంగాధర కిషన్  

- ‘మన ఊరు... మన ప్రణాళిక’కు శ్రీకారం

- గ్రామ అవసరాలే ప్రణాళికలు.. 14 అంశాలకు ప్రాధాన్యం  

- ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో రూపకల్పన   

- గ్రామస్థాయిలో ఆర్థిక వనరులు గుర్తిస్తాం  

సాక్షి ప్రతినిధి, వరంగల్ : గ్రామస్తుల భాగస్వామ్యంతో గ్రామాల అవసరాలను గుర్తించి.. అభివృద్ధికి బాటలు వేయడం ప్రధాన లక్ష్యంగా ‘మన ఊరు... మన ప్రణాళిక’ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ నెల 13 నుంచి జిల్లా వ్యాప్తంగా గ్రామ ప్రణాళిక రూపకల్పన ప్రక్రియ ప్రారంభించనుంది. ఈ కార్యక్రమంపై మండల పరిషత్ కార్యాలయూల్లో ప్రజాప్రతినిధులు, అధికారులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించను న్నారు. జిల్లాలో ప్రస్తుతం గ్రామ అభ్యుదయ అధికారుల వ్యవస్థ అమల్లో ఉంది.



గ్రామదర్శిని పేరుతో జిల్లా కలెక్టర్ జి.కిషన్ 2013 నవంబర్‌లోనే దీన్ని ప్రారంభించారు. గ్రామాల అవసరాలను గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమం మొదలైంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు... మన ప్రణాళిక’ సైతం ఇదే విధంగా ఉంది. ఒక్కో గ్రామానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుందని, ఒక్కో గ్రామంలో ఒక్కో రకమైన సమస్య ఉంటుందని, ఊరిని బట్టి అవసరాలు వేరుగా ఉంటాయని, గ్రామస్థుల సూచనలతో గ్రామ ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రణాళికలు రూపొందుతాయని కలెక్టర్ గంగాధర కిషన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు... మన ప్రణాళిక’పై కలెక్టర్ గురువారం ‘సాక్షి ప్రతినిధి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. కలెక్టర్ చెప్పిన విషయూలు ఆయన మాటల్లోనే..



ప్రణాళికలో 14 అంశాలు

గ్రామస్థాయి ప్రణాళిక రూపకల్పనలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. గ్రామపంచాయతీ పరిధిలోని ప్రధాన గ్రామంలోనే కాకుండా అనుబంధంగా ఉండే ఆవాసాలు(పల్లె, గూడెం, తండాలు)లకు సంబంధించి ప్రత్యేకంగా వివరాలు సేకరిస్తారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, సాగునీటి సరఫరా, మహిళా సాధికారత, ఉపాధి, జీవనోపాధుల ప్రణాళిక, మౌలిక సదుపాయాలు, వనరుల సమీకృత వంటికి ప్రాధాన్యం ఇస్తారు. గ్రామ స్థాయి ప్రణాళిక రూపకల్పనకు ఇప్పటికే నమూనా సిద్ధమైంది.



గ్రామానికి సంబంధించిన జనాభా గణాంకాలు, మౌలిక సదుపాయాలు, గ్రామంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యాలయం, ఇతర ప్రభుత్వ సంస్థలు, విద్య స్థితిగతులు, వైద్య సదుపాయాలు, ఆరోగ్య ప్రణాళిక, గ్రామపంచాయతీ ఆదాయ వనరులు, ఖర్చులు, సహజ వనరులు, సంక్షేమం- అభివృద్ధి అంశాలు, కొత్తగా అవసరమైన మౌలిక సదుపాయాలు, సహజ వనరుల నిర్వహణపై ప్రతిపాదనలు ప్రణాళికలో ఉంటాయి. వీటన్నింటిలో మళ్లీ సూక్ష్మ స్థాయిలో వివరాలు సేకరించడం, అవవసరాలను గుర్తించడం జరుగుతుంది.

 

అందరి భాగస్వామ్యం

మన ఊరు... మన ప్రణాళికలో ప్రజల భాగస్వామ్యమే కీలకంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు గ్రామస్థాయిలో ఈనెల 13 నుంచి 18 వరకు, మండల స్థాయిలో 19నుంచి 23వరకు, జిల్లా స్థాయిలో 24 నుంచి 28 వరకు ప్రణాళికలు సిద్ధం చేస్తాం. అవసరమైన శిక్షణ కార్యక్రమాలు పూర్తవుతున్నాయి. గ్రామ అభివృద్ధి, అవసరాలు ప్రాతిపదికగా గ్రామస్థుల సూచనలు మేరకు... సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు, వార్డుమెంబర్లు, వీఆర్వో, గ్రామ కార్యదర్శి, ఇతర శాఖల సిబ్బందితో కలిసి అభ్యుదయ అధికారి ప్రణాళికలు సిద్ధం చేస్తారు.



ప్రతి ప్రభుత్వ శాఖ గ్రామస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అన్ని కలిపి గ్రామ ప్రణాళిక ఉంటుంది. ఆ తర్వాత దశలో మండల స్థాయి అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి అంశాలు మండల ప్రణాళికలో ఉంటాయి. జూనియర్ కాలేజీ, రిజర్వాయర్, సంక్షేమ వసతిగృహం, విత్తన సరఫరా కేంద్రం... వంటివి వీటిలో ఉంటాయి. ప్రజలను, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తేనే ప్రతి పని, ప్రణాళికల రూపకల్పన విజయవంతమవుతుంది. నిరుపేద, బడుగు బలహీన వర్గాల ప్రత్యేక అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా ప్రణాళికలు ఉంటాయి.



గ్రామస్థాయిలో వనరుల లభ్యత, గ్రామాభివృద్ధికి సూక్ష్మస్థాయి ప్రణాళికలు తయారు చేయడం ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అన్ని రకాల అభివృద్ధి, సంక్షేమం గ్రామ స్థాయి నుంచి ఆరంభం కావాలి. దీనికి గ్రామ స్థాయిలో సమకూరే ఆర్థిక వనరులను గుర్తిస్తాం. ప్రభుత్వ పరంగా గ్రామాలకు వచ్చే నిధులు, ప్రత్యేక అవసరాలు, ప్రాజెక్టులకు రూపకల్పన వంటివి చూసుకుని ప్రణాళిక రూపొందిస్తాం.  

 

అవకాశాలను గుర్తించాలి...

మారిన పరిస్థితులతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. వీటిని గుర్తించి అందిపుచ్చుకోవడం ముఖ్యం. అంగన్‌వాడీ కేంద్రాల్లో కోడి గుడ్డు సరఫరా బాధ్యతలను ప్రయోగాత్మకంగా మహిళా సమాఖ్యలకు అప్పగించాం. మొదట్లో రవాణా పరమైన అంశాలతో కొంత ఆలస్యం జరిగేది. ఇది మంచి ఫలితాలను ఇస్తోంది. ఇది జిల్లా అంతటా చేస్తే మహిళా సంఘాలకు ,మహిళా సమాఖ్యలకు ఏటా లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. ఇలాంటివి ఎన్నో ఊన్నాయి.



నైపుణ్యంతో మహిళా సాధికారత పెరుగుతుంది. స్థానికంగా ఉన్న అవకాశాలను గుర్తించి ఉపాధి వనరులుగా మార్చే ప్రక్రియ పెరగాలి. గ్రామాల వారీగా ఉన్న ఉపాధి అవకాశాలను గుర్తించాలి. ఒక ఊరి నుంచి బయటికి వస్తున్న సరుకులు, అక్కడికి రవాణా అవుతున్న వాటిని గుర్తించడం వల్ల కొందరికి ఉపాధి కల్పించవచ్చు. ఇలాంటివి పూర్తిగా గ్రామ స్థాయి ప్రజాప్రనిధులు, అధికారుల చొరవతోనే సాధ్యమవుతాయి.

 

వ్యవస్థ అభివృద్ధి కావాలి

ప్రభుత్వ పరంగా అధికార యంత్రాంగం పాత్ర కీలకమైనది. కలెక్టర్ ఎవరు ఉన్నారనేది నిమిత్తం లేకుండా... జిల్లా యంత్రాంగం ఒక వ్యవస్థగా ఉండాలి. ఇది పరిపూర్ణంగా అభివృద్ధి చెందాలి. అన్ని స్థాయిల్లోనూ.. అందరిలోనూ జవాబుదారీతనం పెరగాలి. ఏ శాఖకు ప్రాధాన్యం ఇస్తారనే ప్రశ్నలు అర్థం లేనివి. ప్రభుత్వ పరంగా, అధికారిగా అన్ని శాఖలూ కీలకమైనవే. ఫలానా వాటికే ప్రాధాన్యం అనేది సరికాదు.



కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేస్తేనే పరిస్థితి చక్కబడుతుందనే ఆలోచనా విధానం మంచిది కాదు. ప్రభుత్వ శాఖల్లోని అన్ని కార్యాలయాలు, కేంద్రాలను తనిఖీ చేయాలంటే కలెక్టర్‌కు సాధ్యం కాదు.అధికారుల నుంచి మొదలు ఉద్యోగులు, సిబ్బందిలో జవాబుదారీతనం పెరగాలి. ఇలా ఒక వ్యవస్థ అభివృద్ధి చెందితే ఇలాంటి సమస్యలకు తెరపడుతుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top