పుష్కరాలకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు


ముకరంపుర : వచ్చే సంవత్సరం జరిగే గోదావరి పుష్కరాలకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో జిల్లా అధికారులతో సోమవారం సమీక్షించారు. 2003లో జరిగిన గోదావరి పుష్కరాల్లో భక్తులకు కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. 2015 పుష్కరాలకు ప్రత్యేకంగా ధర్మపురి, కాళేశ్వరంలో భారీ ఏర్పాట్లు చేయాలన్నారు. పుష్కర స్నానానికి 60 లక్షల మంది వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

 

 ప్రతిశాఖ అధికారులు తమ పరిధిలో పుష్కరాలకు చేయూల్సిన ఏర్పాట్లు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై పూర్తి నివేదికను 15 రోజుల్లో సిద్ధం చేయూలని ఆదేశించారు. 2015లో కాళేశ్వరం, ధర్మపురి, మంథని, కోటిలింగాల ప్రాంతాల్లో భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి అంచనాలు రూపొందించాలని సూచించారు. భక్తుల రద్దీ దృష్ట్యా అదనపు స్నాన ఘట్టాల నిర్మాణానికి ప్రతిపాదనలు చేయాలని ఎస్‌ఈ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. శానిటేషన్, తాగునీటి సరఫరా, తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారుచేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు.



దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఆలయాల వద్ద క్యూలైన్ల నిర్మాణానికి, విద్యుత్ దీప అలంకరణ, ఆలయాల సుందరీకరణకు, క్లాక్‌రూములు తదితర ఏర్పాట్లకు రూ.3.5కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. ఆలయాల వద్ద 50 లక్షల మంది  భక్తులకు సరిపడా మందులు, క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్టీసీ అధికారులు యాత్రికుల కోసం పుష్కరాల సమయంలో 5 వేల బస్సులను తిప్పడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

 

 పటిష్ట బందోబస్తు

 పుష్కరాల సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ శివకుమార్ తెలిపారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. అదనపు జేసీ నంబయ్య, డీఆర్‌వో వీరబ్రహ్మయ్య, మంథని, పెద్దపెల్లి, జగిత్యాల ఆర్డీవోలు, ఏడీ ఎండోమెంట్స్ రాజేశ్వర్, ధర్మపురి ఈవో తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top