వలంటీర్లు, సహాయకులకూ..పోస్టల్‌ బ్యాలెట్‌

Postal Ballot For Election Officials - Sakshi

ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ వర్తింపు  

వారికోసం ప్రత్యేక కాల్‌ సెంటర్‌ ఏర్పాటు

26న ఈవీఎంల తొలి ర్యాండమైజేషన్‌

హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి దానకిశోర్‌ వెల్లడి

సాక్షి,సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికల్లో మరో ముందడుగు పడింది. విధుల్లో పాల్గొనే అధికారులు, రెగ్యులర్‌ సిబ్బందికే కాకుండా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, డ్రైవర్లు, వలంటీర్లకు.. వెబ్‌కాస్టింగ్, దివ్యాంగ ఓటర్లకు సహాయకులుగా ఉండే వలంటీర్లకు కూడా ఈసారి ‘పోస్టల్‌ బ్యాలెట్‌’ సౌకర్యం కల్పిస్తున్నారు. వీరంతా ఏప్రిల్‌ 11న జరిగే పోలింగ్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు చేయవచ్చు. ఈ విషయాన్ని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్‌ ప్రకటించారు. ఎన్నికల ఏర్పాట్లపై శుక్రవారం నిర్వహించిన నోడల్‌ అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గొనే అధికారులు, సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్లు అందించే కార్యక్రమం పురోగతిలో ఉందన్నారు. వీరితోపాటు పరోక్షంగా విధుల్లో పాల్గొనే జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, పోలీస్‌ అధికారులు, సిబ్బందితో పాటు వెబ్‌ కాస్టింగ్, బీఎల్‌ఓలకూ ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు వివరించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం వినియోగించుకోవాల్సిందిగా ఉద్యోగులందరికీ ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తున్నామన్నారు. ఎన్నికల శిక్షణ కార్యక్రమాలు  జరిగే కేంద్రాల వద్దే ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి పోస్టల్‌ బ్యాలెట్లు అందిస్తున్నామన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యానికి సంబంధించి ప్రత్యేక కాల్‌సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈసారి పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు చేపట్టిన చైతన్య కార్యక్రమాల్లో భాగంగా 1250 చునావ్‌ పాఠశాలలు నిర్వహించామని, 15 కళాశాలల్లో ఓటరు నమోదు,  ఈవీఎంలు, వీవీప్యాట్, సీవిజిల్‌పై చైతన్యం కల్పించామని వివరించారు.

హైదరాబాద్‌ జిల్లాలో పెన్షన్లు పొందుతున్న 24 వేల మంది దివ్యాంగుల్లో 19,326 మందిని ఓటర్లుగా పేర్లు నమోదు చేయించామన్నారు. ఎన్నికల్లో అక్రమాలను అరికట్టేందుకు 126 ఎస్‌ఎఫ్‌టీ, ఎస్‌ఎస్‌టీ టీమ్‌లతో పాటు మరో 28 బృందాలను ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు ప్రత్యేకంగా నియమించినట్లు తెలిపారు.  నగరంలో ఇప్పటి దాకా 16 వేలకు పైగా అక్రమ పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించడంతో పాటు రూ.3.52 లక్షల విలువైన 1676 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నాట్టు వివరించారు. జిల్లాలోని పోలింగ్‌ కేంద్రాల్లో 646 కేంద్రాల్లో ర్యాంప్‌ల నిర్మాణం ఏప్రిల్‌ 2వ తేదీలోగా పూర్తి చేస్తామన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో ఒక మోడల్‌ పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

పోలింగ్‌ కేంద్రాల్లో ఎండ నుంచి ఉపశమనానికి టెంట్లను ఏర్పాటు చేయయడంతోపాటు తాగునీటి సదుపాయం కల్పిస్తామన్నారు. అంతే కాకుండా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఈనెల 25వ తేదీలోగా అన్ని స్ట్రాంగ్‌రూమ్‌లను సిద్ధం చేసి 26వ తేదీన ఈవీఎంలను ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు తరలించనున్నట్లు దానకిశోర్‌ వివరించారు. ఎన్నికల సిబ్బందికి ఈనెల 24వ తేదీలోగా అన్ని రకాల శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేస్తామన్నారు. ఈనెల 26న ఈవీఎంల తొలి ర్యాండమైజేషన్‌ చేపట్టి అదేరోజు రాజకీయ పార్టీల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గానికి ఇద్దరు ఎన్నికల వ్యయ పరిశీలకులు, ఒక సాధారణ పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించిందని వెల్లడించారు.  సమావేశంలో అడిషనల్‌ కమిషనర్లు హరిచందన, అద్వైత్‌కుమార్‌ సింగ్, సిక్తా పట్నాయక్, సందీప్‌ఝా, కెనెడీ, విజయలక్ష్మి, జోనల్‌ కమిషనర్‌ ఎస్‌. శ్రీనివాసరెడ్డి, ఈవీడీఎం డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top