
పెద్దపల్లి అర్బన్: పింఛన్ ఇప్పించాలని తిరిగి తిరిగి వేసారిన ఓ వృద్ధుడు బండరాయితో తల పగులగొట్టుకున్నాడు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రజావాణి వేదికగా కలెక్టరేట్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం ఎన్టీపీసీ మేడిపల్లికి చెందిన రైళ్ల నర్సయ్య మూడేళ్ల క్రితం వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పెన్షన్ పొందేందుకు అవసరమైన వయస్సు లేదంటూ అధికారులు దరఖాస్తును తిరస్కరించారు. తనకు 70 ఏళ్లకు పైబడే ఉన్నాయని.. భార్య మంచానికే పరిమితమైందని.. ఆదుకుంటేనే బువ్వ దొరుకుతుందని కాళ్లావేళ్లాపడ్డా.. అధికారులు కనికరించలేదు.
ఇలా నాలుగుసార్లు జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజావాణికి వచ్చి అధికారులకు మొరపెట్టుకున్నారు. అధికారుల తీరుతో విసుగుచెందిన ఆయన చివరికి సోమవారం ఆధార్‌కార్డు చించివేసి కలెక్టర్ కార్యాలయం వద్ద బండరాయితో తలపగులగొట్టుకున్నాడు. తీవ్రరక్తస్రావం అయిన ఆయనను ఏ ఒక్క అధికారీ పట్టించుకోలేదు. ప్రజావాణికి వచ్చిన ప్రజలే నర్సయ్యకు నీరందించి సపర్యలు చేశారు. కనీసం వైద్య సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవటంతో ప్రథమ చికిత్స అందించే వారు కరువయ్యారు. నర్సయ్య రక్తమోడుతుండగానే ఇంటికి తిరుగుపయనమయ్యాడు.