ప్రాజెక్టు ఎండినా.. వరప్రదాయినే.. | nizam sagar project in nizamabad | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టు ఎండినా.. వరప్రదాయినే..

Nov 8 2015 11:02 AM | Updated on Oct 17 2018 6:06 PM

కాలం కలిసి రాని రైతన్నను నిజాంసాగర్ శిఖం భూములు ఆదుకుంటున్నాయి.

ఎల్లారెడ్డి/నిజాంసాగర్: కాలం కలిసి రాని రైతన్నను నిజాంసాగర్ శిఖం భూములు ఆదుకుంటున్నాయి. ప్రాజెక్టులో నీరు లేక నేల తేలితే... నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితుల్లో ఆ భూముల్లోనే సాగు చేసుకుంటున్నారు నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన రైతులు. వాస్తవానికి ప్రాజెక్టు శిఖం భూముల్లో సాగు చట్టరీత్యానేరమే అయినప్పటికీ.. వర్షాభావ పరిస్థితుల్లో అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించడంతో రెండు జిల్లాల పరిధిలోని ప్రాజెక్టు ప్రాంత రైతులకు బంగారు పంటలు పండుతున్నాయి.

ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల్లో మంజీర నది పూర్తిగా ఎండిపోయింది. అక్కడక్కడ మినహా నీటి చుక్క కనిపించని పరిస్థితి. దీనిపై నిర్మించిన నిజాంసాగర్ అయితే పూర్తిగా అడుగంటి పోయింది. సింగితం ప్రాజెక్టులోనూ చుక్క నీరు లేదు. నిజామాబాద్, మెదక్ జిల్లాలకు వరప్రదాయిని అయిన నిజాంసాగర్‌లో నీరు లేక పోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు. తమ పట్టాభూములు ఈ ఏడాది పక్కన పెట్టి శిఖం భూముల వైపు దృష్టి మరల్చారు. సారవంతమైన ఒడ్రుమట్టితో నిండి ఉన్న వేలాది ఎకరాల ఈ శిఖం భూముల్లో హలాలు నడిపి.. ఆరు తడి పంటలు పండిస్తున్నారు.

నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండల శివారు నిజాంసాగర్ బ్యాక్‌వాటర్ భూముల్లో రుద్రారం, మల్కాపూర్, అల్మాజిపూర్, మత్తమాల, ఎర్రారం, సోమార్‌పేట, పిప్పిర్యాగడితండా గ్రామాలతో పాటు మెదక్ జిల్లా బాచెపల్లి, కాంట్రపల్లి, కల్షేర్ మసానిపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఈ భూముల్లో సాగు చేస్తున్నారు. నీరు ఎక్కువగా అవసరం లేదని ఆరు తడి పంటలైన మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, శనగ పంటలు వేస్తున్నారు.

సారవంతమైన భూమి కావడం.. నీరు అంతగా లేని పంటలు కావడంతో ఇప్పుడవి మంచి లాభాలను తెచ్చేవిగా ఉండడంతో రైతు ముఖాల్లో నవ్వు వెలుస్తోంది. కాలం కలిసిరాకున్నా.. ప్రాజెక్టు శిఖం భూముల్లో సాగు చేసుకుంటున్నామని, లేకుంటే పొట్ట చేతపట్టుకొని వలసలు పోవాల్సిన పరిస్థితి నెలకొనేదని రైతులు అంటున్నారు.
 
సమష్టి వ్యవసాయం...
సొంత భూముల్లో గట్లు ఏర్పాటు చేసుకొని సాగు చేసుకునే రైతన్న శిఖం భూముల్లో సమష్టి వ్యవసాయం చేస్తున్నారు. గ్రామాలవారీగా శిఖం భూముల్లో ఏళ్ల క్రితం నిర్ణయించుకున్న హద్దుల్లో రైతులు వేలాది ఎకరాల్లో సాగు చేసుకుంటున్నారు. ఇందుకు అయ్యే పెట్టుబడులను గ్రామంలోని రైతులంతా సమష్టిగా పంచుకోవడమే కాకుండా, కలుపు తీసుకోవడం.. నూర్పిళ్లు చేసుకోవడం.. పంట కాపలాకు ఇంటికి ఒకరు చొప్పున వెళ్తుండడం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల పెట్టుబడి కూడా తగ్గింది.

కొన్ని చోట్ల పంటలను అడవి పందుల నుంచి రక్షించుకునేందుకు సోలార్ కంచెలను సైతం ఏర్పాటు చేసుకున్నారు. జూలై, ఆగస్టు మాసా ల్లో ఈ భూముల్లో వేసిన మొక్కజొన్న నూర్పిళ్లు  పూర్తవగా, పొద్దు తిరుగుడు పంట చేతికి వచ్చింది. దీంతో రెండో పంటగా శనగ, జొన్నలు వేసేందుకు  సిద్ధపడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement