ఇదే మాత్రం? | Negligence In Treating Corona Patients In Telangana | Sakshi
Sakshi News home page

ఇదే మాత్రం?

Jun 15 2020 1:48 AM | Updated on Jun 15 2020 7:13 AM

Negligence In Treating Corona Patients In Telangana - Sakshi

జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఓ ఆటోమొబైల్‌ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తి ఇటీవల కరోనా బారినపడ్డాడు. స్వల్ప జ్వరం తప్ప ఇతర లక్షణాలు పెద్దగా లేకపోవడంతో ఇంటి వద్దే వైద్యం పొందేందుకు అతనికి అధికారులు అనుమతిచ్చారు. తొలిరోజు స్థానిక వైద్య సిబ్బంది వచ్చి పరిస్థితిని సమీక్షించి 14 రోజులకు సరిపడా మందులు ఇచ్చారు. అయితే నాలుగు రోజులు కావస్తున్నా అతని ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసిన వారు లేరు. అధికారులిచ్చిన ఫోన్‌ నంబర్‌కు కాల్‌ చేస్తే ‘అనారోగ్య సమస్యలుంటే ఫోన్‌ చేయండి.. లేకుంటే ఇచ్చిన మందులను వాడండి’ అని సమాధానం రావడంతో పేషెంట్‌ ముఖం తెల్లబోయింది.

సాక్షి, హైదరాబాద్ ‌: రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు ఎక్కువ అవుతుండటంతో రోగులకు వైద్య సేవలు అందడం ఇబ్బందిగా మారుతోంది. పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నకొద్దీ వైద్యులపై భారం మరింత పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కేసుల సంఖ్య తక్కువగా ఉండటంతో అక్కడ పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ పట్టణ ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి కొంత గందరగోళంగా ఉంది. ప్రధానంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరి ధిలో హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందాలనుకొనే రోగులకు వైద్య సేవలు నేరుగా అందించలేని పరి స్థితి నెలకొంది. పాజిటివ్‌గా తేలిన వెం టనే స్థానిక పీహెచ్‌సీ పరిధిలోని ఏఎన్‌ఎం లేదా ఆశ కార్యకర్త వచ్చి వారి ఆరోగ్య స్థితిని నమోదు చేసుకొని 14 రోజులకు సరిపడా మాత్రలు ఇస్తున్నారు. వైద్యులు నేరుగా రోగి వద్దకెళ్లి ఆరోగ్యస్థితిని తరచూ పర్యవేక్షించడం, సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం పూర్తిస్థాయిలో జరగట్లేదు.

భరోసా ఎలా?: కరోనా రోగుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు, వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన తగ్గించేందుకు వైద్యుల కౌన్సెలింగ్, వారిచ్చే భరోసా ఎంతో ముఖ్యం. కానీ ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉంటున్న తమకు సకాలంలో కౌన్సెలింగ్‌ అందట్లేదని, వైరస్‌ ఇతరులకు వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలోనూ జాప్యం జరుగుతోందని రోగులు పేర్కొంటున్నారు. స్థానిక ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు సైతం ఎక్కువగా ఫోన్లోనే మాట్లాడి పరిస్థితిని తెలుసుకోవడం తప్ప కౌన్సెలింగ్‌ ఇవ్వట్లేదని చెబుతున్నారు. రోగుల ఆరోగ్య స్థితిని తెలుసుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వివరాలు సమర్పిస్తున్నారని అంటున్నారు. మరోవైపు కరోనా లక్షణాలు తక్కువగా ఉన్న వ్యక్తులను హోం క్వారంటైన్‌కు ప్రభుత్వం అనుమతిచ్చినా ఇరుగుపొరుగు వారు మాత్రం రోగులను ఇళ్లలో ఉండనీయకుండా అడ్డుకుంటున్నారు.. జగిత్యాల జిల్లాలో తాజాగా ఇద్దరు కరోనా రోగులు సొంత ఇళ్లలో ఉండి వైద్యం పొందేందుకు పక్కింటి వాళ్లు ఒప్పుకోకపోవడంతో అధికారులు వారిని ఊరు చివరన ఉన్న పాఠశాల భవనంలో క్వారంటైన్‌ చేశారు. స్థానిక పంచాయతీ ఆధ్వర్యంలో భోజన వసతి కల్పిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement