అంగట్లో మెడికల్‌ కళాశాల పోస్టులు

Medical College Posts Are Selling Fraud In Nalgonda  - Sakshi

మొదటి సంవత్సరానికిగాను 80 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌

ఇంకా ఫైనల్‌ కాని ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీలు

ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు నిరుద్యోగులనుంచి భారీగా డబ్బుల వసూళ్ల

నల్లగొండకు  చెందిన ఓ నిరుద్యోగి ఎంఎల్‌టీ పూర్తి చేశాడు. ప్రైవేట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. మెడికల్‌ కాలేజీలో బ్లడ్‌ బ్యాంక్‌ టెక్నీషియన్‌ పోస్టు  కోసం ఆశపడ్డాడు. అతన్ని ఓ ఏజెన్సీకి చెందిన దళారీ సంప్రదించాడు. ఉద్యోగం కావాలంటే రూ.5లక్షల దాకా ఖర్చయితదని ఆ నిరుద్యోగికి సదరు దళారీ ముందే చెప్పాడు. ఈ ఉద్యోగానికి వచ్చే వేతనం నెలకు రూ.12వేల దాకా ఉంటుంది. ప్రైవేట్‌ ఫీల్డ్‌ కంటే మెడికల్‌ కాలేజీలో కొలువు అంటే ఎంతో గొప్పగా ఉంటుందని భావించాడు. అతను అప్పోసప్పో చేసి అడ్వా న్స్‌గా రూ.2లక్షలు కూడా ముట్టజెప్పాడు. అతనినుంచి ఏజెన్సీ వారు దరఖాస్తు కూడా తీసుకున్నారు. కానీ డబ్బులు తీసుకున్న ఏజెన్సీకి ఇంకా సిబ్బంది నియామకం చేసే అధికార ఉత్తర్వులు రానే లేదు. అసలు వస్తుందో రాదో తెలియదు. కానీ డబ్బులు మాత్రం వసూలు చేస్తున్నారు. ఇలా మెడికల్‌ కాలేజీ ఉద్యోగాల దందా నడుస్తోంది. 

సాక్షి, నల్లగొండ : జిల్లా మెడికల్‌ కళాశాల తరగతులు ఇటీవల ప్రారంభమయ్యాయి. కాలేజీకి అవసరమైన సిబ్బంది నియామక బాధ్యతలను ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలకు ఇస్తున్నారు. ‘ఆలూ లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు...’ అన్నట్లు ఇంకా ఏ ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ పోస్టుల భర్తీ ఆర్డర్‌ను దక్కించుకుకోనూలేదు కానీ ఉద్యోగాల అమ్మకానికి మాత్రం తెరలేపారు. వివిధ పోస్టులను కొందరు దళారులు అంగట్లో అమ్మకానికి పెట్టారు. ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు నిర్ణయించి నిరుద్యోగులనుంచి దరఖాస్తులను స్వీకరిస్తూ రూ.లక్షల్లో బేరసారాలు చేస్తున్నట్లు సమాచారం.

మెడికల్‌కాలేజీ పోస్టుల భర్తీ కోసం జిల్లా కేంద్రానికి చెందిన నాలుగు ఏజెన్సీలు పోటీపడుతున్నాయి. జిల్లా యంత్రాం గం పోస్టుల భర్తీకి ఏ ఏజెన్సీకి అర్డర్‌లను ఇవ్వనప్పటికి అనధికారికంగా దందాను కొనసాగిస్తూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ లక్షలు వసూళ్లు చేస్తున్నారనే సమాచారం. నల్లగొండ మెడికల్‌ కళాశాలకు  237 వివి ధ రకాల పోస్టులను మంజూరీ చేస్తూ  ఔట్‌ సో ర్సింగ్‌ పద్ధతిన నియామకాలను చేసుకోవాలని సూచిస్తూ జీఓఎంఎస్‌ నంబర్‌ 77ను 2018, జూన్‌ 12వ తేదీన జారీ చేసింది. కానీ నల్లగొండ కళాశాల భవనం పూర్తి కాకపోవడంతో నియమాకాల ప్రక్రియను అధికారులు ప్రారభించలే దు. ఇప్పటికే కళాశాల భవనం  పూర్తయ్యింది. ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం అడ్మిషన్లకు  కౌన్సెలింగ్‌ కూడా నిర్వహించారు.

జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిని త్వరలో మెడికల్‌ కళాశాలకు అప్పగించే ప్రక్రియను కూడా అధికారులు వేగవంతం చేస్తున్నారు. వచ్చే నెల నుంచి తరగతులు ప్రారంభం కావచ్చని మెడికల్‌ కళాశాల వర్గాలు చెబుతున్న నేపథ్యంలో ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలు తమ దుకాణాలను తెరిచాయి. నియామకాలకు సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా ఏ ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీకి ఉత్తర్వులు ఇవ్వలేదు. మెడికల్‌ కళాశాలకు సంబంధించిన 237 వివిధ రకాల పోస్టులలో మొదటి సంవత్సరం సుమారు 80 వరకు భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే సూర్యాపేట మెడికల్‌ కళాశాలకు సంబంధించి ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులని యామకాల ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఏజెన్సీలను ఎం పిక చేయడంతో పాటు నియామకాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కూడా స్వీకరించారు. కా నీ నల్లగొండ మెడికల్‌ కళాశాలకు సంబంధించిన పోస్టుల భర్తీకి ఇప్పటికి ఏ ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీకి అధికారికంగా బాధ్యతలు అప్పగించలేని పరిస్థితి. 

పోస్టులు ఇలా
జిల్లా మెడికల్‌ కళాశాలలో 32 విభాగాలలో 35 రకాల పోస్టులను ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన నియమించనున్నారు. అందులో డిసెక్షన్‌ హాల్‌ అటెండెంట్, స్వీపర్లు, ల్యాబ్‌ అటెండెంట్, స్టెనో కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్, స్టెనో టైపిస్ట్, రికార్డ్‌ కీపర్, ఆఫీస్‌ సబార్డినేట్, వ్యాన్‌ డ్రైవర్, రికార్డు అసిస్టెంట్, డార్క్‌రూం అసిస్టెంట్, బ్లడ్‌ బ్యాంక్‌ టెక్నీషియన్, స్టోర్‌ కీపర్స్, అసిస్టెంట్‌ లైబ్రేరియన్, బుక్‌కీపర్, కంప్యూటర్‌ ఆపరేటర్, అటెండర్స్, వార్డ్‌బాయ్స్, హెడ్‌ దోబీ, దోబీ, ప్యాకర్స్, కార్పెంటర్స్, బ్లాక్‌ స్మిత్, బార్బర్, టైలర్, ఎలక్ట్రీషియన్‌ ఫోర్‌మన్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ఏసీ మెకానిక్, మాలి, మోడీఫైడ్‌ సూపర్‌వైజర్, టెలిఫోన్‌ ఆపరేటర్, గ్యాస్‌ ఆపరేటర్స్, రిసెప్సనిస్ట్‌ కం క్లర్క్, మేల్‌ నర్సింగ్‌ ఆర్డర్డీ వంటి సుమారు 80 పోస్టులను మొదటి సంవత్సరంలో పూర్తి చేయనున్నట్లు సమాచారం. వీటన్నింటిని ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతినే నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓలో స్పష్టం చేసింది. 

ఏజెన్సీల మధ్య తీవ్ర పోటీ
మెడికల్‌ కళాశాలకు సంబంధించిన పోస్టుల భర్తీ ఆర్డర్‌ను పొందడానికి జిల్లాకు చెందిన అనేక ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలతో జిల్లా అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువస్తూ ఆర్టర్‌ను పొందడానికి అన్ని దారులను వెతుకుతున్నారు. మరికొందరైతే రాష్ట్ర స్థాయిలో మం త్రులతో తమకున్న సంబంధాలను అడ్డుపెట్టుకుని అర్డర్‌ను దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ ఏజెన్సీల దరఖాస్తులను పరిశీలించిన అధికార యంత్రాంగం ఇప్పటివరకు ఎవరికీ అర్డర్‌ను అధికారికంగా ఇవ్వలేదని సమాచారం.

దుకాణాలను తెరిచిన ఏజెన్సీలు
మెడికల్‌ కళాశాల పోస్టుల భర్తీకి తమకే ఆర్డర్‌ వచ్చిందంటూ నాలుగు ఏజెన్సీలు ఇప్పటికే తమ దుకాణాలను తెరిచాయి. నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నిరుద్యోగులనుంచి దరఖాస్తులు స్వీకరిస్తూ ఒక్కో పోస్టుకు ఒక్కో రేటును నిర్ణయించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  స్వీపర్‌నుంచి అన్ని పోస్టులకు రూ.2లక్షల నుంచి రూ.7లక్షల వరకు ముందుగానే తీసుకుని వారికి తప్పక ఉద్యోగాలను ఇప్పిస్తామని భరోసా కల్పిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులను టార్గెట్‌గా చేస్తూ దళారుల చేత బేరసారాలు చేస్తూ పోస్టులను ఇప్పిస్తామంటూ దరఖాస్తులను స్వీకరించినట్లు తెలుస్తోంది. అనధికారికంగా దరఖాస్తులతోపాటు డబ్బులను వసూలు చేస్తున్న ఏజెన్సీల్లో కొన్నింటికి కొందరు మెడికల్‌ కళాశాల అధికారులు, మరికొన్నింటికి అధికార పార్టీ నేతలు అండగా నిలుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల పేరిట అన్ని అర్హతలున్న తమనుంచి రూ.లక్షల్లో వసూలు చేయడం దారుణమని పలువురు నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై వివరణ కోసం ప్రయత్నించగా మెడికల్‌ కళాశాలకు చెందిన అధికారులు అందుబాటులో లేరు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top