జీహెచ్ఎమ్సీ ఎన్నికల నేపధ్యంలో నామినేషన్ల గడువు రేపటితో ముగియనుండటంతో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలవుతున్నాయి.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపధ్యంలో నామినేషన్ల గడువు రేపటితో ముగియనుండటంతో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలవుతున్నాయి. అలాగే టీఆర్‌ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. శనివారం తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ సమక్షంలో నగరంలోని పలు పార్టీల నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ లో చేరారు.
బేగంబజార్ (50), సుభాష్ నగర్ (130) డివిజన్లకు చెందిన ముఖ్య నేతలతోపాటు పలువురు కార్యకర్తలు టీఆర్‌ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతోన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి పలు పార్టీల నేతలు, కార్యకర్తలు తమ టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు.