ప్రాణాలు తీస్తున్న ఒత్తిడి, పోలిక

Main reasons for Inter Students suicide - Sakshi

ఇంటర్‌లో విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రధాన కారణాలివే.. ఈ ఏడాది ఆందోళనకర స్థాయిలో బలవన్మరణాలు

ఈ ఏడాదిలో ఇప్పటివరకు రాలిన 24 మంది విద్యాసుమాలు.. కాలేజీల్లో కానరాని కౌన్సెలర్లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మార్కుల భూతం మరో విద్యార్థిని బలితీసుకుంది. 20 రోజుల కిందట ఇంటర్‌లో తనకు వచ్చిన మార్కులు చూసుకొని కలత చెంది పురుగుల మందు తాగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మానస (17) అనే టీనేజర్‌ మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో ఇప్పటివరకూ చనిపోయిన ఇంటర్‌ విద్యార్థుల సంఖ్య 24 వరకు చేరిందని సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ ఏడాదిలోనూ ఇంత భారీ సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడలేదు. ఐదేళ్లలో ఒకసారి కూడా ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలు రెండంకెలు దాటిన దాఖలాలూ లేవు. కానీ ఈసారి ఏకంగా 24 మంది విద్యార్థులు కేవలం ఇంటర్‌లో ఫెయిలయ్యామన్న కారణంతో ప్రాణాలు తీసుకోవడం వారి తల్లిదండ్రులను తీవ్రంగా కలిచివేస్తోంది.

ఒత్తిడి, పోలికే ప్రధాన కారణాలు..
తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటకలో ఇంటర్, ఆ తర్వాత ఇంజనీరింగ్‌ మాత్రమే చదవాలన్న ధోరణి అధికం. ఎంసెట్, జేఈఈ, నీట్‌ అంటూ రకరకాల ఎంట్రన్స్‌లు రాస్తూ విద్యార్థులు ఇంజనీరింగ్‌ కోర్సులో జాయిన్‌ అవ్వాలని అనుకుంటారు. వారికి ఇష్టం ఉన్నా లేకున్నా తల్లిదండ్రులు, సమాజం వారిని ఇంజనీరింగ్‌ వైపు నడిపిస్తున్నారు. ర్యాంకుల కోసం బలవంతంగా రోజుకు 18 గంటలపాటు చదివించే అనుమతి లేని కార్పొరేట్‌ హాస్టళ్లలో ఉంచుతున్నారు. ఫలితంగా విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవు తున్నారు. పోటీ ప్రపంచంలో కొట్టుకుపోతూ 90% మార్కులు సాధించినా రోజుల తరబడి విలపించేంతగా మానసికంగా కుంగిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం పక్కవారితో తమను తాము పోల్చుకోవడం, తల్లిదండ్రులు కూడా ఇతర విద్యార్థులతో పోల్చి వారిని కించపరచడం. ఇవి చాలవన్నట్లు కుటుంబంలో, కాలేజీల్లో ఉన్న ఒత్తిడితో పిల్లలు ఫెయిలవడాన్ని తీవ్ర అవమానంగా భావిస్తూ ప్రాణాలు తీసుకుంటున్నారు.

రైతులు, మహిళల తరువాత విద్యార్థులే..
దేశంలో జరిగే ఆత్మహత్యల్లో రైతులు, మహిళలు తొలి రెండు స్థానాల్లో ఉండగా మూడోస్థానం విద్యార్థులదేనని గణాంకాలు చెబుతున్నాయి. 2016లో నేషనల్‌ క్రైమ్‌బ్యూరో రికార్డ్స్‌ (ఎన్‌సీఆర్‌బీ) ప్రకారం దేశంలో 1,34,000 మందికిపైగా భారతీయులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో 15 నుంచి 39 ఏళ్లలోపు వారే అధికం. వారిలో రైతులు, మహిళల తరువాత విద్యార్థులే నిలవడం గమనార్హం.

ఏటేటా పెరుగుతున్న ఆత్మహత్యలు...
పోలీసుల గణాంకాల ప్రకారం తెలంగాణలో ఇప్పటివరకు 42 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారిలో 18 మంది బాలురు కాగా, 24 మంది బాలికలు కావడం గమనార్హం. ఏటేటా ఈ సంఖ్య పెరుగుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఒక్క ఈ ఏడాదిలోనే ఏప్రిల్‌ 24 వరకు 15 మంది ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ సంఖ్య 24 దాటిందని సమాచారం. గత ఐదేళ్లలో 50 మందికిపైగా ఇంటర్‌ విద్యార్థులు అర్ధంతరంగా తనువు చాలించారు.

కాలేజీల్లో కౌన్సెలర్లు ఎక్కడ?
ప్రతి ఇంటర్‌ కాలేజీలోనూ విద్యార్థుల మానసిక పరిస్థితిని గమనించేందుకు కౌన్సెలర్‌ ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఎక్కడా ఈ నిబంధనను పట్టించుకున్న దాఖలాలు లేవు. తక్కువ మార్కులు వచ్చిన లేదా ఇంటి బెంగ, ఇష్టంలేని కోర్సు చదువుతున్న విద్యార్థులను గుర్తించి కౌన్సెలింగ్‌ ఇవ్వాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల మానసిక పరిస్థితిపై తల్లిదండ్రులకు వివరించాల్సిన అవసరం ఉంది. కానీ ఇలాంటి నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు.

ఒత్తిడి సరికాదు
ఏ విద్యార్థినీ ఇతరులతో పోల్చడం సరికాదు. ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్‌ దాగి ఉంటుంది. గానం, సంగీతం, క్రీడలు ఇవన్నీ ప్రతి భారంగాలే కదా! వాటిని వదిలి అందరినీ ఇంజనీర్లు, డాక్టర్లు కావాలంటూ ఒత్తిడి చేయడం సబబుకాదు. పిల్లలపై ఇలా ఒత్తిడి తీసుకురావడంతో తీవ్ర అవమాన భారంతో కుంగిపోతున్నారు. అలాంటి వారికి తల్లిదండ్రులు బాసటగా నిలిచి ధైర్యం చెప్పాలి. వారు అభిరుచి ఉన్న రంగంలో రాణించేలా ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయి.    
– స్వాతి లక్రా, ఐజీ, విమెన్స్‌ ప్రొటెక్షన్‌ వింగ్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top