ఆర్టీసీలో మళ్లీ జేఎండీ పోస్టు?

JMD post in the RTC? - Sakshi

 పదవీ విరమణ చేసిన ఓ అధికారికి అనుకూలంగా నిర్ణయం

వకాల్తా పుచ్చుకున్న నగరానికి చెందిన నేత

ప్రభుత్వానికి సిఫారసుకు సిద్ధం

అదే జరిగితే అడ్డుకుంటామని కార్మికుల హెచ్చరిక 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీలో మళ్లీ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పోస్టు ఏర్పాటు కాబోతోందని సంస్థలో ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వం ఇలాగే జాయింట్‌ మేనేజింగ్‌ పోస్టును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఉమ్మడి ఆర్టీసీకి ఎండీగా సాంబశివరావు వ్యవహరించారు. తెలంగాణ నుంచి ప్రాతి నిధ్యం ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జేఎండీ పోస్టును సృష్టించి, అప్పటికే ఆర్టీసీలో ఈడీగా పనిచేసి పదవీ విరమణ పొందిన రమణారావును అందులో నియమించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రమణారావు ఎండీగా పూర్తిస్థాయి బాధ్యతలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం ఆర్టీసీకి పూర్తిస్థాయి ఎండీ లేరు. రమణారావును తప్పించిన తర్వాత పూర్తిస్థాయి ఎండీని నియమించకుండా ప్రభుత్వం రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు మరో పదవీ విరమణ అధికారిని జేఎండీగా తెచ్చిపెట్టబోతున్నారంటూ మూడు నాలుగు రోజులుగా ఆర్టీసీలో తీవ్ర ప్రచారం జరుగుతోంది. అధికారికంగా దీనిపై ఎలాంటి స్పష్టత లేకున్నా రోజురోజుకు ప్రచారం పెరుగుతోంది. ఆర్టీసీలో ఈడీగా పదవీ విరమణ పొందిన అధికారిని ‘కొనసాగింపు’ ఉత్తర్వు ద్వారా జేఎండీ పోస్టులో నియమిస్తారనేది దాని సారాంశం.

ఆర్టీసీలో ఎక్కువ కాలం పనిచేసిన అనుభవం ఉన్న ఆ అధికారి తరఫున ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ నేత వకాల్తా పుచ్చుకున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి సిఫారసు కూడా చేయబోతున్నారని, ఎన్నికలైన తర్వాత ఇందుకు లైన్‌ క్లియర్‌ అవుతుందని ఆ ప్రచారంలో పేర్కొంటున్నారు. దీన్ని కొందరు సీనియర్‌ అధికారులుసహా కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. గతంలో రమణారావు జేఎండీగా ఉన్న సమయంలో ఆర్టీసీ పురోగతి ఒక్కసారిగా ఆగిపోయిందని, ఆయన కాకుండా మంచి ఐపీఎస్‌ అధికారిని నియమించి ఉంటే తెలంగాణ ఆర్టీసీ లాభాల్లో ఉండేదని వారు పేర్కొంటున్నారు. ఇదే జరిగితే కోర్టు తలుపుతట్టాలని కూడా కొందరు సీనియర్‌ అధికారులు భావిస్తున్నారని ఉద్యోగుల్లో ప్రచారం జరుగుతోంది. వారి వాట్సాప్‌ గ్రూపుల్లో కొద్దిరోజులుగా ఇదే హాట్‌ టాపిక్‌. కానీ అధికారులు దీన్ని ధ్రువీకరించటం లేదు. ఇక ఇటీవల పదవీ విరమణ చేసిన ముగ్గురు ఈడీల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున భర్తీ ప్రక్రియకు అడ్డుగా మారింది. ఆర్‌ఎంగా ఉండి ఈడీ పోస్టు కోసం ఎదురుచూస్తున్న ఒకరిద్దరు అధికారులు కోడ్‌ ముగిసే సమయానికి పదవీ విరమణ పొందాల్సి ఉంది. దీంతో ఎన్నికల కమిషన్‌ నుంచి ప్రత్యేక అనుమతి పొంది తమకు పదోన్నతులు కల్పించాలని వారు కోరుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top