Sakshi News home page

పారిశ్రామిక పార్కులు

Published Thu, Oct 23 2014 2:46 AM

Industrial parks

* ఆరు చోట్ల ఏర్పాటు చేయాలని నిర్ణయం
* భూములు గుర్తించిన టీఎస్‌ఐఐసీ

 సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : దేశంలోనే అత్యున్నత పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించిన రాష్ట్ర సర్కారు ఆ దిశగా అడుగులు వేస్తోంది. జిల్లాలో ఇండస్ట్రీయల్ పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో మరిన్ని పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా పారిశ్రామికంగా అభివృద్ధి సాధించవచ్చని భావిస్తోంది. ఇందులో భాగంగా ఆరు చోట్ల ఈ పార్కులను ఏర్పాటు చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. నెన్నెల, సిర్పూర్(టి), అంకుసాపూర్(కాగజ్‌నగర్ మండలం), చెన్నూరు, చాట (కుభీర్ మండ లం), ఆలూరు(సారంగాపూర్)లో నెలకొల్పాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇం దుకోసం అవసరమైన భూముల గుర్తింపు ప్రక్రియ ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తోంది.

నెన్నెలలో ఏర్పాటు చేయతలపెట్టిన పారిశ్రామిక పార్కు కోసం సుమారు వెయ్యి ఎకరాల భూములను గుర్తించారు. అలాగే సిర్పూర్ (టి) పార్కు కోసం సుమారు 700 ఎకరాలు, చెన్నూరు కోసం 461 ఎకరాలు, చాట కోసం 147 ఎకరాలు, ఆలూరు కోసం 239 ఎకరాల భూమిని ప్రాథమికంగా గుర్తించారు. జిల్లా పరిశ్రమల శాఖ, టీఎస్‌ఐఐసీ (తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ) అధికారులు సంయుక్తంగా ఈ ప్రక్రియ చేపట్టారు. సాగుకు యోగ్యంగా లేని ప్రభుత్వ భూములను మాత్రమే పారిశ్రామిక పార్కుల కోసం సేకరిస్తామని జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ఈ పార్కుల్లో అన్ని సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించారు. ఈ భూములను అభివృద్ధి చేయడంతోపాటు, పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ లైన్లను నిర్మించడం, రోడ్లు, పారిశ్రామిక వ్యర్థాలను తరలించేందుకు అవసరమైన డ్రెయినేజీల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. వీటిలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఉత్సాహం చూపుతున్న పారిశ్రామిక వేత్తలకు ఈ పార్కుల్లో స్థలాలను కేటాయించడం ద్వారా వారికి తోడ్పాటునందించాలని ప్రభుత్వం భావిస్తోంది.
 
ఆశించిన ఫలితమివ్వని ఎస్టేట్లు..
జిల్లాలో ప్రస్తుతానికి మూడు ఇండస్ట్రియల్ ఎస్టేట్లు ఉన్నాయి. ఆదిలాబాద్‌తోపాటు, నిర్మల్, మంచిర్యాలల్లో ఎస్టేట్లను రెండు దశాబ్దాల క్రితం ఏపీఐఐసీ ఏర్పాటు చేసింది. అయితే.. ఈ పట్టణాలు దినదినాభివృద్ధి చెందడంతో ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్లలో పరిశ్రమల కంటే నివాస గృహాలు అధికంగా వెలిశాయి. ఐటీడీఏ (సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ) పరిధిలో కూడా మరో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉట్నూర్‌లో ఉంది. గిరిజనులు చిన్న, కుటీర పరిశ్రమలను నెలకొల్పి ఉపాధి పొందేలా చేయూత నిచ్చేందుకు ఉట్నూర్‌లో ఈ ఎస్టేట్‌ను ఏర్పాటు చేసినప్పటికీ, సరైన పర్యవేక్షణ లేక ఈ ఎస్టేట్‌లో చాలా యూనిట్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి.
 
కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి..
జిల్లాలో కొత్తగా పత్తి ఆధారిత పరిశ్రమల స్థాపనకు పారిశ్రామిక వేత్తలు మొగ్గు చూపుతున్నారు. స్పిన్నింగ్, జిన్నింగ్-ప్రెస్సింగ్, పారాబాయిల్డ్, సిరామిక్స్, కార్న్ (మొక్కజొన్న ఉత్పత్తులు) ప్రొడక్ట్స్ వంటి పరిశ్రమలు వచ్చే అవకాశాలున్నాయని పరిశ్రమల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. పక్కనే ఉన్న మహారాష్ట్రలో ప్రైవేటు సెక్టార్‌లో మొక్కజొన్న ఆధారిత భారీ పరిశ్రమలున్నాయి. జిల్లాతోపాటు, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో ఉత్పత్తి అవుతున్న మొక్కజొన్న చాలా మట్టుకు ఈ పరిశ్రమలకు వెళుతోంది. ఇలాంటి పరిశ్రమలు ఇక్కడే నెలకొల్పడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగు పడటంతో పాటు, వెనుకబడిన జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధిని సాధించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement
Advertisement