జీరో బ్లాక్‌ స్పాట్స్‌!

Hyderabad Police Target to Zero Black Spots in Hyderabad - Sakshi

యాక్సిడెంట్‌ ఫ్రీ సిటీ కోసం బృహత్తర కార్యాచరణ

మహానగరంలో ఇంకా 52 ప్రాణాంతక జంక్షన్లు

ఆ ప్రాంతాల్లో ప్రత్యేక లైటింగ్, హెచ్చరిక బోర్డులు

వేగ నియంత్రణపై ప్రత్యేక దృష్టి

సాక్షి, సిటీబ్యూరో : చిలకలగూడ క్రాస్‌రోడ్స్‌లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. బ్లాక్‌స్పాట్‌గా ఉన్న ఇక్కడ తగిన సేఫ్టీ చర్యలు తీసుకోవాల్సిందిగా 2018లో గుర్తించి చర్యలుతీసుకున్నారు. అయినప్పటికీ 2019లో కూడా ఇది బ్లాక్‌స్పాట్‌గానమోదైంది.

ఎంజే మార్కెట్‌..గాంధీ భవన్‌
జంక్షన్‌–యూసుఫ్‌ కంపెనీ–జీపీఓ మార్గం సైతం బ్లాక్‌ స్పాట్‌ మరకను పోగోట్టుకోలేదు. 2018లోబ్లాక్‌స్పాట్‌గా ఉన్న ఇది 2019లోనూ అదే ముద్ర వేసుకుంది.... ఇలా ఒకటి కాదు.. రెండు కాదు మహానగరంలో 52 ప్రాంతాలు ఇంకా ప్రాణాంతక బ్లాక్‌స్పాట్లుగా ఉన్నాయి. అక్కడ ప్రమాదాలు, ప్రాణనష్టాలు జరుగకుండాఉండాలంటే మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇలా పదే పదే ప్రమాదాలు పునరావృతమవుతున్న బ్లాక్‌స్పాట్స్‌లో ఇతర సమస్యలతో పాటు ర్యాష్‌డ్రైవింగ్, సరైన వెలుతురు లేకపోవడం, స్పీడ్‌ లిమిట్స్‌ పాటించకపోవడం వంటివి కూడా కారణాలని గుర్తించారు. ఇలాంటి లోపాల్ని సరిదిద్దడం ద్వారా ప్రమాదాల్ని తగ్గించవచ్చునని, బ్లాక్‌స్పాట్స్‌ లేని నగరంగా మార్చవచ్చునని భావించిన అధికారులు అందుకు చేపట్టాల్సిన చర్యలకు సిద్ధమవుతున్నారు. గ్రేటర్‌ నగరంలో గతంతో పోలిస్తే  రోడ్డు ప్రమాదాలు 35 శాతం తగ్గినప్పటికీ, బ్లాక్‌స్పాట్స్‌ ఇంకా   కొనసాగుతుండటంతో పరిశీలించిన ట్రాఫిక్‌ పోలీసులు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా జీహెచ్‌ఎంసీకి సూచించారు. తగిన చర్యలకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా  వేగ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు తగిన లైటింగ్‌ ఏర్పాట్లు, హెచ్చరిక బోర్డులు, ఉల్లంఘనులను గుర్తించేందుకు తగిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌  అవసరమని భావిస్తున్నారు.  జీరో బ్లాక్‌స్పాట్స్‌ నగరంగా మార్చేందుకు జీహెచ్‌ఎంసీతోపాటు  రోడ్ల నిర్వహణ బాధ్యతలు చూస్తున్న సంస్థలు, పోలీసు, రవాణా శాఖలు సైతం తమవంతు పాత్ర పోషించనున్నాయి. ఆయా అంశాల వారీగా ప్రమాదాల నివారణకు దిగువ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. 

వేగ నియంత్రణ..
ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ చాలా సందర్భాల్లో అతివేగమే ప్రమాదాలకు కారణం కావడంతో స్పీడ్‌కంట్రోల్‌కు తగిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చర్యలు అవసరం. ఇందులో భాగంగా ఉల్లంఘనులకు  భారీ పెనాల్టీలు. అంతేకాకుండా వాహనాలు నడిపేవారికి ఉపకరించేలా,  వేగం నియంత్రణలో ఉండేలా  కార్ల  తయారీదారులు కొత్త టెక్నాలజీ అందుబాటులోకి తేవాల్సిన అవసరముంది. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడంతో పాటు సీటుబెల్ట్, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్, హెల్మెట్లు, ఓవర్‌ స్పీడ్, ఓవర్‌లోడ్‌ తదితరమైనవి పకడ్బందీగా అమలయ్యేలా చూడాలి. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌తరహాలో ప్రజలు భయపడేలా అమలు చేయాలి. బ్లాక్‌స్పాట్స్‌కు సంబంధించిన హెచ్చరిక బోర్డులుండాలి. వేగ పరిమితి దాటకుండా రంబుల్‌స్ట్రిప్స్‌ వంటివి సరేసరి. కేవలం ఫ్లై ఓవర్లపైనే కాక అవసరమైన అన్ని ప్రాంతాల్లో వేగపరిమితి సూచికలు, రోడ్డు మార్కింగ్‌లు,సైనేజీలు ఉండాలి.  సేఫ్టీ చర్యల్లో భాగంగా వాహనాలకు  సైడ్, రియర్‌ అద్దాలు, ఎయిర్‌బ్యాగ్‌లతోపాటు  వాహనాలు ఓవర్‌స్పీడ్‌తో వెళ్లే బీప్‌ సౌండ్‌ ఉపకరణాలు తదితరమైనవి అవసరం. 

అవగాహన..
రోడ్‌సేఫ్టీ గురించి తగిన అవగాహన కల్పించేందుకు, విస్తృత ప్రచారం చేసేందుకు ఒక ప్రత్యేక ఏజెన్సీ అవసరం. డేటా సిస్టమ్స్‌ అభివృద్ధి పరచడం ద్వారా రోడ్‌సేఫ్టీ పర్యవేక్షణ. 

సదుపాయాల అభివృద్ధి..
పాదచారులు, సైక్లిస్టులు, మోటార్‌ సైకిళ్లు   సాఫీగా ప్రయాణించేందుకు వారికి ప్రత్యేక లేన్లుండాలి. క్రాష్‌బారియర్లుండాలి. స్కూల్‌జోన్లతోపాటు రెసిడెన్షియల్, వాణిజ్య ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు, వేగా>నికి తగిన నియంత్రణ ఉండాలి. ప్రజారవాణాను ఎక్కువగా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలి. 

క్షతగాత్రులకు తక్షణ సాయం..
చేసేవన్నీచేసినా  ప్రమాదాలు జరిగితే గాయపడ్డవారిని తక్షణం ఆస్పత్రులకు తరలించేలా ఏర్పాట్లుండాలి. అత్యవసర వైద్యం  అందించేందుకు ఆస్పత్రులు సంసిద్ధంగా ఉండాలి. డబ్బులేని కారణంగా వైద్యం నిరాకరించరాదు.  ప్రమాదప్రాంతంలోని స్థానికులు  క్షతగాత్రులకు తక్షణసాయం అందించేలా తగిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. 

బ్లాక్‌స్పాట్లు..  
గ్రేటర్‌లోని 52 బ్లాక్‌  స్పాట్‌ ప్రాంతాల్లో రేతిబౌలి, ఎన్‌ఎండీసీ, బోయిన్‌పల్లి, బంజారాహిల్స్‌ రోడ్‌నెంబర్‌ 12,  రోడ్‌నెంబర్‌ 3, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, పెద్దమ్మగుడి,  డీఎంఆర్‌ఎల్‌ క్రాస్‌రోడ్స్, ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి,పురానాపూల్‌దర్వాజ, ఓల్డ్‌ ఆనంద్‌థియేటర్, తాజ్‌కృష్ణా, మదీన క్రాస్‌రోడ్స్, ఐఎస్‌ సదన్, మారుతీనగర్‌ కమాన్,సెవెన్‌టూంబ్స్‌(దక్కన్‌పార్క్‌), పుత్లిబౌలి, చాదర్‌ఘాట్‌ క్రాస్‌రోడ్స్, కవాడిగూడ సీజీవో టవర్స్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ , జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబర్‌ 45, సికింద్రాబాద్‌ వైఎంసీఏ జంక్షన్‌  తదితర ప్రాంతాలున్నాయి. ముఖ్యంగా ఎర్రగడ్డ–పటాన్‌చెరు మార్గంలో అత్యధిక ప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు. 

పరిష్కారమిలా..  
ఆయా బ్లాక్‌స్పాట్‌ ప్రాంతాల్లో ఏమేం చేయాలోకూడా సూచించారు. ఉదాహరణకు  
∙చిలకల గూడ బ్లాక్‌ స్పాట్‌గా మిగలకూడదంటే మరిన్ని అదనపు సేఫ్టీ చర్యలు తీసుకోవాల్సి ఉంది. అందుకుగాను జంక్షన్‌ దగ్గరి రోటరీని తగిన డైమెన్షన్స్‌లో అభివృద్ధి చేయాల్సి ఉంది. పాదచారుల కోసం ప్రత్యేకంగా స్కైవాక్‌ను ఏర్పాటు చేయాలి. మెట్రో పిల్లర్లపై రేడియం స్టిక్కర్లు  ఉండాలి. రాత్రివేళల్లో మితిమీరిన వేగంతో వెళ్లేవారిని కట్టడి చేసేందుకు తగిన ‘ఎన్‌ఫోర్స్‌మెంట్‌’ చర్యలుండాలి.  
∙ఎంజే మార్కెట్‌ పరిసరాలకు బ్లాక్‌స్పాట్‌ ముద్ర తొలగాలంటే çస్టడ్స్, రంబుల్‌స్ట్రిప్స్, జీబ్రాక్రాసింగ్‌ మార్కులు వేయాలి. హమీదా స్వీట్‌ హౌస్‌ వద్ద రోడ్డు వెడల్పు చేయడంతోపాటు మ్యాన్‌హోళ్లు రోడ్డుకు సమానంగా సరిచేయాలి. జీపీఓ వద్ద  ఫుట్‌పాత్‌లు వెడల్పు చేయాలి. మాలకుంట జంక్షన్‌ వద్ద బీటీరోడ్డు అవసరం. ఇలా అన్ని బ్లాక్‌స్పాట్స్‌ వద్ద ఏమేం చేయాలో ట్రాఫిక్‌ విభాగం సూచించింది. 

ప్రమాదాలు ఇలా..
అధికారుల వివరాల మేరకు, గత సంవత్సరం దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో 1.51 లక్షల మంది మృతి చెందారు. 4.7 లక్షల మంది క్షతగాత్రులయ్యారు. తెలంగాణలో 6.6 వేల మంది మరణించారు. 23.6 వేల మంది క్షతగాత్రులయ్యారు. హైదరాబాద్‌లో 260 మందికి పైగా మరణించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top