పగటిపూటే నదుల్లో అధిక ఆక్సిజన్‌!

High Levels Of Oxygen In Rivers During The Day - Sakshi

సూర్యరశ్మికి, నదుల్లో ఆక్సిజన్‌కు లింక్‌

నీటి మొక్కల కారణంగా ఉత్పత్తి

ప్రాణవాయువు.. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు నీటిలో తక్కువ

కేంద్ర జల సంఘం అధ్యయనంలో వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: నదుల నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్‌ (డీఓ) శాతం రాత్రివేళ కంటే పగటిపూటే అధికంగా ఉంటుందని కేంద్ర జల సంఘం తేల్చింది. నదిలో కరిగి ఉండే ఆక్సిజన్‌ స్థాయికి, సూర్యరశ్మికి దగ్గరి సంబంధం ఉందని వెల్లడించింది. ఈ కారణంగానే సూర్యరశ్మి పడే సమయంలో మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ అధికంగా ఉండి నది నీటిలో ఆక్సిజన్‌ ఎక్కువగా ఉంటుందని తెలిపింది. గతంలో వివిధ సందర్భాల్లో, పుష్కరాలు జరిగే సీజన్లలో నది నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ పరిమాణంపై అనేక అపోహలు, అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఈ దృష్ట్యా నదుల్లోని ఆక్సిజన్‌ పరిమాణం, దానికి సూర్యరశ్మికి గల సంబంధం, అది వివిధ సందర్భాల్లో ఎలా ఉంటుంది, జీవజాలం మనుగడకు అది ఎలా దోహదం చేస్తుంది? అన్న అంశాలపై కేంద్ర జల సంఘంతో నిపుణులతో శాస్త్రీయ అధ్యయనం చేయించింది. దేశవ్యాప్తంగా నర్మద, యమున, తుంగభద్ర, గంగ వంటి నదుల పరిధిలోని 19 నీటి నాణ్యతా కేంద్రాల వద్ద పరీక్షలు నిర్వహించి నీటి పరిమాణం, సూర్యరశ్మి మధ్య ఉన్న సంబంధాన్ని తేల్చింది.

పగలే బెటర్‌.. 
నదుల్లో నీటి నాణ్యతను డీఓ నిర్ణయిస్తుంది. నీటిలో డీఓ పరిణామం లీటర్‌కు కనీసం 4 మిల్లీగ్రాములు ఉండాలి. డీవో తగ్గేకొద్దీ బయలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ (బీఓడీ) పెరుగుతుంటుంది. బీవోడీ లీటర్‌కు 3 గ్రా. మించొద్దని నిబంధనలు ఉన్నా.. ప్రస్తుతం నదుల్లో బీవోడీ స్థాయి 4 నుంచి 9 గ్రాములు/లీ. వరకు ఉంది. నదిలో బీఓడీ పెరిగితే ఆ నీరు తాగేందుకు, స్నానాలకు కానీ పనికి రావు. అయితే ప్రస్తుతం కేంద్ర జల సంఘం చేసిన అధ్యయనంలో రాత్రి వేళలో నది నీటిలో డీఓ తక్కువగా ఉంటోంది. రాత్రివేళ సూర్యరశ్మి లేకపోవడంతో చెట్లలో కిరణజన్య సంయోగ క్రియ స్థాయి తగ్గుతుంది. దీంతో నది లోపల ఉండే మొక్కలు ఆక్సిజన్‌ను ఎక్కువగా తీసుకోవడంతో నీటిలో ఆక్సిజన్‌ స్థాయి తగ్గుతుంది.

అదే పగటి ఉష్ణోగ్ర తలు అధికంగా ఉన్నప్పుడు మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఉప ఉత్పత్తి గా ఆక్సిజన్‌ను ఎక్కువగా విడుదల చేయడంతో అది నీటిలో ఎక్కువగా కరిగి ఉంటుందని అధ్యయనంలో తేల్చింది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 4 వరకు నదుల్లో డీఓ తగ్గుతుందని, అందువల్లనే ఈ సమయంలో బ్యాక్టీరియా శాతం పెరుగుతుందని తెలిపింది. రాత్రివేళ తగ్గే డీఓతో నదుల్లోని జీవజాలానికి ప్రాణాంతకం అయ్యేదిగా మాత్రం ఉండదని తేల్చిచెప్పింది. డీఓకు సూర్యరశ్మితో అవినాభావ సంబంధం ఉంటుందని, ఈ ప్రభావం వల్ల డీఓలో హెచ్చుతగ్గులు 16.31 శాతం నుంచి 150.63 శాతం వరకు ఉంటాయని తెలిపింది.

యమున,తుంగభద్ర నదుల్లో...
యమున, తుంగభద్ర నదుల్లో రాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 7 వరకు డీఓ లీటర్‌కు 1.81 మిల్లీ గ్రాములు మాత్రమే ఉందని, ఉదయం సమయాల్లో 4 మిల్లీగ్రాముల వరకు ఉందని అధ్యయనంలో గుర్తించింది. నదిలో నీటి పరిమాణాన్ని సూర్యరశ్మితో పాటే వాతావరణ పీడనం, వాతావరణ పరిస్థితులు వంటివి ప్రభావితం చేస్తాయని గుర్తించింది. దీంతో సూర్యోదయం తర్వాతే నదీ స్నానం ఉత్తమమని కేంద్ర జల సంఘం అధ్యయనం తేల్చినట్లయిం దని నిపుణులు చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top