
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులో ఏర్పాటుచేసిన మెగా వైద్య శిబిరాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్ బుధవారం ప్రారంభించారు. తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం, అపోలో ఆస్పత్రులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరం 3 రోజులు కొనసాగనుంది.
ఈ సందర్భంగా జస్టిస్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ, న్యాయవాద వృత్తిలో తీవ్ర ఒత్తిడి ఉంటుందని, అందువల్ల ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడాన్ని అలవాటు చేసుకోవాలని న్యాయవాదులను కోరారు. రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆలోచన విధానం సరిగ్గా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, అపోలో ఆస్పత్రి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి, ఇరు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.