హమ్మయ్య నడకకు నాలుగో వంతెన

Fourth Foot Over Bridge in Secunderabad Railway Station - Sakshi

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు

తీరనున్నప్రయాణికులరద్దీ కష్టాలు

పాదచారులకు కూడా ప్రయోజనం

రెండు నెలల్లో అందుబాటులోకి రానున్న బ్రిడ్జి

సాక్షి,సిటీబ్యూరో: నిత్యం లక్షలాది మంది రాకపోకలతో రద్దీగా ఉండే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో నాలుగో వంతెన త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రయాణికులతో పాటు స్టేషన్‌కు రెండు వైపులా పాదచారుల రాకపోకలకుఅనుకూలంగా నిర్మిస్తున్న నాలుగో వంతెన పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే మొదటి దశ పనులను పూర్తి చేశారు. ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ నుంచి ఏడో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ వరకు వంతెన నిర్మాణం పూర్తయింది. ఏడో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ నుంచి పదో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ వరకు మరో రెండు నెలల్లో వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తేనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో పాతకాలం నాటి వంతెనలు బాగా ఇరుకైపోవడం, నాణ్యతా ప్రమాణాల దృష్ట్యా కూడా మరో బ్రిడ్జి నిర్మాణం తప్పనిసరి కావడంతో గతేడాది నాలుగో వంతెన నిర్మాణానికి కార్యాచరణ చేపట్టారు. మరోవైపు అప్పటికే ముంబైలో పురాతన కాలం నాటి బ్రిడ్జి కూలిపోయి పలువురు దుర్మరణం చెందిన ఉదంతం నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే అప్రమత్తమైంది. లక్షలాది మంది రాకపోకలతో రద్దీగా ఉండే సికింద్రాబాద్‌ స్టేషన్‌లో వంతెన అవసరాన్ని గుర్తించారు. దీంతో గత సంవత్సరం జూన్‌లో రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌ నాలుగో వంతెనకు శంకుస్థాపన చేశారు. దీంతో పాటు మల్టి లెవల్‌ పార్కింగ్‌ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు అధికారులు వంతెన పనులను చేపట్టారు.

ఇకపై నేరుగా రాకపోకలు..
ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ బయటి వైపు నుంచి బోయిగూడ వైపు ఉన్న పదో నెంబర్‌ ప్లాట్‌ఫామ్‌ బయటి వైపు నేరుగా రాకపోకలు సాగించే విధంగా కొత్త వంతెన నిర్మిస్తున్నారు. అంటే రైల్వేస్టేషన్‌ లోపలికి వెళ్లాల్సిన అవసరం లేని వాళ్లు నేరుగా ఇటు నుంచి బోయగూడ వైపు వెళ్లిపోవచ్చు. అంటే ఒలిఫెంటా బ్రిడ్జి కింద నుంచి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇది పాదచారుల కోసం చేసిన సదుపాయం. అదే సమయంలో ప్రయాణికులు ప్లాట్‌ఫామ్‌పైకి కూడా వెళ్లవచ్చు. నాలుగో వంతెన నుంచి ప్రతి ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేందుకు వీలుగా ఎంట్రెన్స్‌ ఏర్పాటు చేస్తారు. 676 మీటర్ల పొడవు ఉన్న సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ప్రతిరోజు సుమారు 220 రైల్లు నడుస్తాయి. 1.95 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. మొత్తం 10 ప్లాట్‌ఫామ్‌లకు ఇప్పుడు మూడు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు మాత్రమే ఉన్నాయి. ఒకేసారి నాలుగైదు రైళ్లు స్టేషన్‌కు చేరుకుంటే ఒక్కసారిగా బ్రిడ్జిలు కిక్కిరిసిపోతాయి. ఒకరినొకరు తోసుకుంటూ వెళ్లడమే తప్ప ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలపై నుంచి నడిచి వెళుతున్నట్లుగా ఉండదు. పైగా మూడు బ్రిడ్జిలు ఉన్నప్పటికీ ఒక్క దానిపైనే రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఉదయం, సాయంత్రం ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే సమయంలో ఏ చిన్న ఉపద్రవం జరిగినా ముంబై తరహాలో ముప్పు తప్పదని అప్పట్లో నిపుణుల ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. నాలుగో బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. ఇది కేవలం ప్రయాణికులకే కాకుండా ఇరువైపులా రాకపోకలు సాగించే పాదచారులకు కూడా సౌకర్యంగా ఉంటుంది.  

ఆర్టీసీతో అనుసంధానం  
దూర ప్రాంతాలకు వెళ్లే వారితో పాటు, ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు కూడా నాలుగో వంతెన వల్ల ఊరట లభించనుంది. మరోవైపు ఉప్పల్, మల్కాజిగిరి, లాలాపేట్, ఎల్‌బీనగర్, ఘట్కేసర్, తదితర ప్రాంతాలకు వెళ్లే సిటీ బస్సు ప్రయాణికులు ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ వైపు నుంచి నేరుగా బోయిగూడ వైపు వచ్చి బస్సు ఎక్కేందుకు అవకాశం ఉంటుంది. రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలోనూ, రేతిఫైల్‌ బస్టేషన్‌ వద్ద ప్రతిరోజు సుమారు 1500 బస్సులు రాకపోకలు సాగిస్తాయి. వేలాది మంది ప్రయాణికులు నిత్యం స్టేషన్‌కు ఇటు వైపు నుంచి అటు వైపు వెళ్లక తప్పదు. ఇప్పటి వరకు ఒలిఫెంటా బ్రిడ్జి నుంచి వెళ్లే వారు నేరుగా స్టేషన్‌ ఒకటో నంబర్‌ నుంచి పదో నంబర్‌ వైపునకు చేరుకోవచ్చు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top