సీడ్‌బాల్స్‌తో అటవీ సంరక్షణ

Forest protection with seedballs - Sakshi

ఈ సారి లక్ష విత్తన బంతులు సిద్ధం

గత ఏడాది ఫలించిన ప్రయోగం

అనంతగిరి అడవిని మరింత పెంచేందుకు అధికారుల చర్యలు

ప్రతి మొక్కా బతకాలన్నదే సర్కారు లక్ష్యం

హరితహారంలో భాగంగా విత్తన బంతుల తయారీతో హరితహారం లక్ష్యం చేరుకునేందుకు గత ఏడాది ఈ పద్ధతిని సర్కారు ప్రయోగించింది. ప్రభుత్వం ఆదేశం మేరకు ఈ సారి కూడా ఇదే తరహాలో మొక్కలను పెద్దఎత్తున నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లోనూ ఇదే పద్ధతిని అనుసరిస్తుడడంతో ప్రభుత్వం కూడా ఈ పద్ధతికే మొగ్గు చూపుతోంది.  ఈవిధానంతో అడవి శాతాన్ని పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

వికారాబాద్‌ అర్బ్‌న్‌ : నూతనంగా ఏర్పడ్డ వికారాబాద్‌ జిల్లా విస్తీర్ణంలో 1.1 లక్షల ఎకరాల్లో మాత్రమే అడవులు ఉన్నాయి. భౌగోళికంగా ఇది 14శాతం మాత్రమేనని అటవీశాఖ అధికారులు తెలిపారు. దీన్ని 37శాతానికి పెంచేందుకు పలు రకాల చర్యలు తీసుకుంటున్నారు.

రాష్ట్రంలో అడవుల శాతాన్ని 37 శాతానికి పెంచేందుకు గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపడుతుంది. ఇందులో భాగంగానే అటవీశాఖ, ఉపాధిహామీ పథకం కింద నర్సరీల్లో మొక్కలు పెంచి అన్నీ గ్రామాలకు అందిస్తున్నారు.

ఈ రకంగా అడవి ప్రాంతాల్లో, ఇతర ప్రాంతాల్లో నాటుతున్న మొక్కలు రక్షణ లేక ఎండిపోతున్నాయి. వర్షాలు పుష్కలంగా ఉండి వీటికి నీరు అందించినా ఎండిపోతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే అటవీ శాఖ ఆధ్వర్యంలో విత్తన బంతి ప్రయోగాన్ని ముందుకు తీసుకొచ్చారు. 

ప్రత్యేక ఆకర్షణగా సీడ్‌బాల్‌.. 

సీడ్‌ బాల్స్‌ ప్రయోగాన్ని గత ఏడాది హరితహారంలో అమలుపరిచి విజయం సాధించిన అటవీశాఖ అధికారులు ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున విత్తన బంతులు తయారు చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే  సుమారు లక్ష విత్తన బంతులు తయారు చేసి నిల్వ ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

హరితహారం ప్రారంభం కాగానే విత్తన బంతులను అన ంతగిరి అడవిలో విసిరేందుకు సిద్ధంగా ఉంచారు. ఈ సీడ్‌ బాల్స్‌ ద్వారా చేపట్టే హరితహారం కార్యక్రమంలో యువజన సంఘాలను, స్వచ్ఛంద సంస్థలను, విద్యార్థులు పాల్గొనేలా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.  

కర్ణాటకలో సత్ఫలితాలు.. 

కర్ణాటక రాష్ట్రానికి చెందిన విశ్రాంత ఐఏఎస్‌ అ ధికారి అమర్‌ నారాయణ విత్తన బంతులను ప్ర యోగాత్మకంగా ప్రవేశపెట్టి విజయం సాధించా డు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మన రాష్ట్రంలో కూడా గత ఏడాది  ఈ పద్ధతి ఫలితాన్ని ఇచ్చింది. 

జిల్లాలో అటవీ శాతం పెంచేందుకు.. 

 జిల్లాలో అనంతగిరి అటవి శాతాన్ని పెంచేందుకు అటవీ శాఖ అధికారులు సీడ్‌ బాల్స్‌ ప్రయోగాన్ని అమలు చేయనున్నారు. అనంతగిరి అటవీ ప్రాంతం 3,700 ఎకరాల వరకు విస్తరించి ఉంది. ఎత్తయిన కొండలు, లోయలతో కూడిన ఈ అనంతగిరిలో కొంత కాలంగా అటవి అంతరించిపోయే పరిస్థితికి వచ్చింది.

ఒకప్పుడు పచ్చని చెట్లతో కళకళలాడిన అనంతగిరి కొండలు నేడు కళ తప్పాయి. దీంతో ఈ ప్రాంతంలో అటవి శాతాన్ని పెంచి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అటవీశాఖ అధికారులు సీడ్‌ బాల్‌ ప్రయోగాన్ని అమలు చేయబోతున్నారు. అనంతగిరి పర్యాటక కేంద్రానికి వచ్చే పర్యాటకులు ట్రెక్కింగ్‌కు వెళ్తుంటారు.ఆ సమయంలో వారికి విత్తన బంతులు ఇచ్చి విసిరేయించే ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు అనంతగిరిలోని ఫారెస్టు గెస్టహౌస్‌లో విత్తన బంతులను సిద్ధంగా ఉంచనున్నారు.  

విత్తన బంతుల తయారీ విధానం..

విత్తన బంతిలో ఉండే విత్తనం పుచ్చిపోకుండా పాడవకుండా ఉండడానికి కారణం బంతి తయారీలో వాడే పదార్థాలే. విత్తన బంతిని తయారు చేయాలంటే స్థానికంగా లభించే విత్తనాన్ని ముందుగా ఎండబెట్టి సిద్ధంగా ఉంచుకోవాలి.

తర్వాత వర్మీకంపోస్టు ఎరువు, ఎర్రమట్టి, పశువుల పేడ, గో మూత్రం, బెల్లం, శనగపిండి పదార్థాలు తగినంత నీటిలో మిశ్రమం చేసి చిన్న పాటి లడ్డూల మాదిరిగా తయారు చేసుకోవాలి. ఎండబెట్టిన విత్తనాన్ని లడ్డూ మాదిరి తయారు చేసిన విత్తన బంతి మధ్యలో విత్తనాన్ని ఉంచి గుం డ్రంగా బంతిలా తయారు చేయాలి.

ఈ బంతులు నెల నుంచి రెండు నెలల పాటు నిల్వ ఉంటాయి. వర్షాలు కురుస్తున్న సమయంలో విత్తన బంతులను అటవి ప్రాంతంలో, పొలాల వద్ద విసిరేస్తే మొక్కలుగా మొలుస్తాయి. మామూలుగా పెరిగే మొక్కకంటే విత్తన బంతి ద్వారా నాటిన మొక్క త్వరగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది.   

ఏ ప్రాంతాలు అనుకూలం.. 

అటవీ ప్రాంతం తక్కువగా ఉన్న చోట్ల, బంజరు భూములు, పొలం గట్లు, ప్రభుత్వ భూముల్లో విత్తన బంతులను చల్లాలి. కొద్దిపాటి తేమ, మట్టి ఉన్న భూములను ఎంపిక చేసుకోవాలి. రాయి ఉన్న భూములు పనికి రావు. 

ఖర్చు తక్కువ..

అటవీశాఖ, ఉపాధి హామీ నర్సరీల్లో పెంచే మొక్కలకు ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు చేస్తుంది. ఒక్కో మొక్కపై సుమారు రూ. 20 నుంచి రూ. 30వరకు ఖర్చు చేస్తుంది. అయితే విత్తన బంతి ఖర్చుమాత్రం చాలా తక్కువ అవుతుంది. ఒక్కో బంతి తయారీకి కేవలం రూ. 5 లోపే ఖర్చు అవుతున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top