
ఎలా మాఫీ చేస్తారో!
వ్యవసాయ రుణాల్ని మాఫీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీపై తెలంగాణ ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తున్నా ఆర్థిక వనరుల సమీకరణపై ఇప్పటికీ స్పష్టత రావటం లేదు.
వచ్చే ఆదాయం రొటీన్ ఖర్చులకే చాలదు
అప్పు చేయాలన్నా నిబంధనలు ఒప్పుకోవు
అమలు తీరుతెన్నులపై ఆర్థిక నిపుణుల సందేహాలు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రుణాల్ని మాఫీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీపై తెలంగాణ ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తున్నా ఆర్థిక వనరుల సమీకరణపై ఇప్పటికీ స్పష్టత రావటం లేదు. మరోవైపు ఖరీఫ్ సీజన్ ముంచుకువస్తున్న తరుణంలో రుణ మాఫీపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల నిర్ణయం కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆర్థిక వనరుల్ని చూసినపుడు విభజన తర్వాత తెలంగాణకు మిగులు ఉంది. కానీ అది పెద్ద మొత్తమేమీ కాదు. రుణ మాఫీ ఎవరికి చేస్తారనే విషయమై కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టతనిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వంపై పడే భారం రూ.18 వేల కోట్లుగా తేలింది. కొత్త పథకాలు, ఉద్యోగుల వేతన సవరణ, ఇతర హామీల అమలుకే తెలంగాణ సర్కారు గింజుకోవాల్సిన పరిస్థితి ఉంది. పన్నులు ఇతరత్రా రూపేణా వచ్చే ఆదాయం ఎప్పటికప్పుడు సరిపోయే పరిస్థితులున్నాయి.
పెపైచ్చు బ్యాంకులకు నగదు రూపంలో చెల్లిస్తేనే అంగీకరిస్తామని, బాండ్లకు అనుమతివ్వబోమని ఆర్‌బీఐ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆర్థిక వనరుల సమీకరణపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మిగులు బడ్జెట్ ఉండి... 18వేల కోట్లు చెల్లించాల్సిన తెలంగాణ రాష్ట్ర పరిస్థితే ఇలా ఉంటే... ఆరంభం నుంచే లోటు బడ్జెట్ ఉండి, జీతభత్యాలకే నిధులు లేవని బహిరంగంగా చెబుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 87వేల కోట్లను రుణమాఫీకి ఎలా చెల్లిస్తుందనేది సదరు నిపుణుల సందేహం!!. ‘‘కేంద్రం సాయం తీసుకుని వేస్ అండ్ మీన్స్ పద్దులో నిధులు తెచ్చకునే అవకాశమూ లేదు. ఇలా చేయడానికి ద్రవ్య జవాబుదారీ, బడ్జెట్ నిర్వహణ(ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టం అడ్డు వస్తుంది. దీని ప్రకారం స్థూల రాష్ట్ర ఉత్పత్తి(జీఎస్‌డీపీ)లో ద్రవ్యలోటు 3 శాతానికి మించకూడదు. ఒకవేళ ఈ షరతులు సడలించాలని ప్రభుత్వం కోరినా, దానికి కేంద్రం అంగీకరించినా సరే అలా సమీకరించే అప్పులు గరిష్టంగా 2 వేల కోట్లు దాటవు. మరి అప్పుడు ఏం చేస్తారు?’’ అని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక అధ్యయన సంస్థ నిపుణుడొకరు వ్యాఖ్యానించారు.