సరికొత్తగా విద్యాశాఖ వెబ్‌సైట్‌ | Education Website as new | Sakshi
Sakshi News home page

సరికొత్తగా విద్యాశాఖ వెబ్‌సైట్‌

Aug 20 2018 1:21 AM | Updated on Jul 11 2019 5:01 PM

Education Website as new - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాల విద్యాశాఖ తమ వెబ్‌సైట్‌ను ఆధునీకరిస్తోంది. ఇప్పుడు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ ఉన్నప్పటికీ ఎక్కువ భాగం కార్యకలాపాలు మాన్యువల్‌గానే కొనసాగుతున్నాయి. దీంతో ఈ శాఖ ఉద్యోగులకు సమాచార పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే ఇకపై ప్రతి వ్యవహారాన్ని వెబ్‌సైట్‌ ద్వారా నిర్వహించాలని శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కాగితాలకు స్వస్తి పలుకుతూ ఆన్‌లైన్‌ సేవలను విస్తృతం చేస్తోంది. ఇందుకోసం టీఎస్‌టీఎస్‌ (తెలంగాణ స్టేట్‌ టెక్నికల్‌ సర్వీసెస్‌)తో సమాలోచనలు చేస్తోంది. వెబ్‌సైట్‌ ఆధునీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆన్‌లైన్‌ పద్ధతిలో కార్యకలాపాలు సాగించడంతో పర్యవేక్షణ సులభతరం కావడంతోపాటు జవాబుదారీతనం పెరుగుతుందని భావించిన విద్యాశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 

అందుబాటులోకి దాదాపు 22 సేవలు  
రాష్ట్రంలో 29వేల ప్రభుత్వ, స్థానిక సంస్థల విద్యాలయాలున్నాయి. వీటితోపాటు మరో 15వేల ప్రైవేటు పాఠశాలలున్నాయి. వీటికి సంబంధించి తీసుకునే నిర్ణయాల తాలూకు సమాచారం ఇకపై విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ప్రదర్శించనుంది. టీచర్ల సమాచారం, విద్యార్థులు, స్కూళ్ల వివరాలు, వివిధ రకాల దరఖాస్తులన్నీ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. విద్యాశాఖ పథకాల పర్యవేక్షణ సైతం వెబ్‌సైట్‌ ద్వారానే నిర్వహిస్తారు. రోజుకు సగటున 25లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని అందుకుంటున్నారు. భారీ మొత్తంలో నిధులు వెచ్చించి అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజూ పర్యవేక్షించనున్నారు. రోజువారీ హాజరు, మధ్యాహ్న భోజనం తీసుకున్న విద్యార్థుల వివరాలన్నీ ప్రత్యక్షం కానున్నాయి.

పాఠశాలల్లో ప్రవేశాల అంశాన్నీ ఆన్‌లైన్‌ చేయ నుంది. ప్రవేశాల విషయంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇబ్బందులు లేనప్పటికీ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ప్రవేశాలు కొన్ని సందర్భాల్లో వివాదాస్పదమవుతున్నాయి. వాటికి గుర్తింపు ఉందా? లేదా? అనే విషయం తెలియక తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. పాఠశాలల గుర్తింపు వివరాలను వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేస్తే ఇబ్బందులుండనవి భావిస్తున్నారు. పరీక్షల సమాచారంతోపాటు ఫలితాలు కూడా వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. దాదాపు 22 రకాల కార్యక్రమాలను ప్రస్తుతం విద్యాశాఖ అందుబాటులోకి తేనుంది. వచ్చే నెలలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్లు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement