
‘డిజిటల్’ చదువులు
మొన్నటి వరకు అ.. అమ్మ, ఆ.. ఆవు, ఇ.. ఇల్లు, ఈ.. ఈగ అంటూ బొమ్మలను చూపిస్తూ చిన్నారులకు ఉపాధ్యాయులు అక్షరాలను నేర్పించేవారు.
మోర్తాడ్: మొన్నటి వరకు అ.. అమ్మ, ఆ.. ఆవు, ఇ.. ఇల్లు, ఈ.. ఈగ అంటూ బొమ్మలను చూపిస్తూ చిన్నారులకు ఉపాధ్యాయులు అక్షరాలను నేర్పించేవారు. ప్రస్తుతం విద్యా విధానంలోనూ, పరీక్షల నిర్వహణలోనూ భారీ మార్పులు చోటుచేసుకోవడంతో నల్ల బల్లకు బదులు తెల్లని తెరను వినియోగించాల్సిన అ వసరం ఏర్పడింది. విద్యార్థులకు అన్ని పాఠాలు అలవోకగా నేర్పించడం కోసం డిజిటల్ (దృశ్యం, శ్రవణం) తరగతులను నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వం తొమ్మిది, పదో తరగతి పరీక్షల్లో బట్టీ విధానానికి స్వస్తి పలకడంతో డిజిటల్ క్లాస్‌లకు ప్రాధాన్యత పెరిగింది. ప్రైవేటు పాఠశాలల్లోనే డిజిటల్ క్లాస్‌లను అప్పుడప్పుడు నిర్వహిస్తున్నారు. అయితే కొందరు దాతల సహకారంతో కొన్ని ప్ర భుత్వ పాఠశాలల్లోనూ డిజిటల్ క్లాస్‌ల నిర్వహణ సాగుతోంది. బట్టీ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయడంతో ఉపాధ్యాయులపైన, విద్యార్థులపైన భారం ఏర్పడింది. భారాన్ని అధిగమించడం కోసం డిజిటల్ క్లాస్ తోడ్పాటును అందిస్తాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
అయితే డిజిటల్ క్లాస్‌ల నిర్వహణ ఏదో ఒక పాఠానికి కాకుండా అన్ని పాఠాలకు వర్తింప జేస్తే, విద్యార్థులకు మేలు కలుగుతుందని ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 461 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 25 వరకు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో తొమ్మిది, పది తరగతులు చదివే విద్యార్థులు దాదాపు 40 వేల మంది ఉంటారు. బట్టీ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు పరీక్షల విధానంలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకటి, రెం డు సబ్జెక్టులు అని కాకుండా అన్ని సబ్జెక్టులలోనూ డిజిటల్ విధానంలో తరగతులను నిర్వహించాల్సిన అవసరం ఉంది.
విద్యార్థులకు పాఠ్యాంశాలపై పూర్తి అవగాహన కలిగితేనే పరీక్షలను రాసి ఉత్తీర్ణులు అవుతారు. పుస్తకంలో పాఠ్యాంశం తరువాత ఉండే ప్రశ్నలకు జవాబులను రాసే విధానం ఇప్పుడు లేదు. పాఠ్యాంశాన్ని విద్యార్థి ఆకళింపు చేసుకుని పరీక్షను రాయాల్సి ఉంటుంది. డిజిటల్ విధానంలో పాఠ్యాంశాన్ని విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోగలరు. ఈ విధానంలో పాఠ్యాంశం కథలాగా విని అర్థం చేసుకునే అవకాశం ఉంది. డిజిటల్ తరగతులకు అవసరమైన సీడీలను టూనీ ఆర్ట్స్, పెబ్బెల్స్ కాంప్రింట్స్ సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. ఆంగ్ల మాధ్యమం విద్యార్థులకు సీడీలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి తెలుగులోనూ సీడీలను తయారు చేయిస్తే విద్యార్థులకు సులభంగా విద్యా బోధన అందించవచ్చని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
నిధులు మంజూరు చేయాలి
దాతల సహకారంతో కొన్ని పాఠశాలల్లోనే డిజిటల్ క్లాస్‌లు కొనసాగుతున్నాయి. డిజిటల్ సౌకర్యం లేని పాఠశాలల్లో ప్రభుత్వమే నిధులను మంజూరు చేసి ఏర్పాట్లు చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.