
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలపై సీపీఐ, సీపీఎం జరుపుతున్న చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. సీట్ల సర్దుబాటు విషయంలో సీపీఐ పెట్టిన నిబంధనల పట్ల సీపీఎం అసహనం వ్యక్తం చేస్తోంది. ఈ ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్‌ను పక్కన పెట్టాలని, టీఆర్‌ఎస్, బీజేపీలను ఓడించాలనే నినాదంతోపాటు, వామపక్షాలు పోటీ చేయని చోట్ల కాంగ్రెస్‌కు మద్దతుపై స్పష్టమైన ప్రకటన చేయాలన్న సీపీఐ సూచనలపై సీపీఎంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
శనివారం ఇక్కడ ఎంబీ భవన్‌లో జరిగిన సమన్వయ కమిటీ భేటీలో తమ్మినేని వీరభద్రం, చెరుపల్లి సీతారాములు, డీజీ నరసింహారావు (సీపీఎం), చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు(సీపీఐ) పాల్గొన్నారు. సీపీఐ కార్యవర్గ భేటీలో వెల్లడైన అభిప్రాయాలను సీపీఎం నేతలకు తెలియజేసినట్టు సమా చారం. రాజకీయ విధానం, పోటీ చేయని చోట్ల ఏ పార్టీకి మద్దతునివ్వాలనే విషయంపై తమకు నిబంధనలు విధించడం సరికాదని సీపీఎం పేర్కొన్నట్టు తెలిసింది. తాజా పరిణామాలపై పార్టీలో చర్చించి చెబుతామని సీపీఎం నేతలు చెప్పినట్లు తెలిసింది.