125రోజులు.. 129కేసులు

Coronavirus Cases Increased In Mahabubnagar - Sakshi

కొత్తగా మరో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ 

పట్టణంలో ఓ సీనియర్‌ వైద్యుడి మృతి 

వైరస్‌ లక్షణాలు ఉన్నట్టు అనుమానం 

మరో 70మంది ఫలితాలు రావాలి

జిల్లాలో తొలి కరోనా కేసు గత మార్చి 30న నమోదైంది. ఆ నాటి నుంచి కేసుల పరంపర కొనసాగుతోంది. ఏప్రిల్‌ 10నాటికి 11మందికి సోకింది. మే 30న మూడు కేసుల నమోదుతో మళ్లీ కలవరం మొదలైంది. ఇక అప్పటి నుంచి ఈ వైరస్‌ విజృంభిస్తూ ప్రతిరోజూ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

సాక్షి, మహబూబ్‌నగర్: మొదట్లో ఇద్దరు వైద్యారోగ్యశాఖ ఉద్యోగులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో విధులు నిర్వహించడం వల్ల ఒక ఉద్యోగికి, అతని తల్లికి, మరో ఉద్యోగికి వైరస్‌ సోకింది. వీరితో పాటు మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారిలో ముగ్గురికి వారి నుంచి మరో ఐదుగురికి కరోనా వచ్చింది. అయితే ఏప్రిల్‌ 24వరకు అందరూ ఆరోగ్యవంతులుగా మారి డిశ్చార్జ్‌ అయ్యారు. ఆ తర్వాత మే 30న వేపూర్, అమిస్తాపూర్, చిన్నచింతకుంటలో ఒక్కొక్కరికి ఈ వైరస్‌ సోకింది. గత నెలలో అధికంగా 75కేసులు రాగా, ఈనెలలో ఆదివారం వరకు 40మందికి వచ్చింది.   

ఏయే ప్రాంతాల్లో వ్యాప్తి 
మహబూబ్‌నగర్‌ పట్టణంలోని ఏనుగొండ, సాగర్‌కాలనీ, శివశక్తినగర్, రవీంద్రనగర్, మోనప్పగుట్ట, కొమ్ముగేరి, భగీరథకాలనీ, బాలాజీనగర్, అయోధ్యనగర్, మర్లు, హౌసింగ్‌బోర్డు, శ్రీనివాసకాలనీ, హనుమాన్‌నగర్, కొత్తచెరువురోడ్, న్యూగంజ్, సంజయ్‌నగర్, టీడీగుట్ట, క్రిస్టియన్‌పల్లి, క్రిస్టియన్‌కాలనీ, పద్మావతికాలనీ, బీకేరెడ్డికాలనీ, రాంమందిర్‌చౌరస్తా, గాం«దీనగర్, న్యూటౌన్, షాషాబ్‌గుట్ట, జనరల్‌ ఆస్పత్రి, నాగేంద్రనగర్‌లో కరోనా వైరస్‌ వ్యాపించింది. అలాగే మూసాపేట, జడ్చర్ల, బాలానగర్, నవాబ్‌పేట, గండీడ్, భూత్పూర్, దేవరకద్ర మండలంలోని పలు గ్రామాల్లో వ్యాప్తి చెందడం వల్ల కేసులు తరచూ నమోదవుతున్నాయి. 

ఇదీ సంగతి.. 
ఇంతవరకు విదేశాల నుంచి 327మంది వచ్చారు. అలాగే ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి 18,787మంది రాగా వీరిలో 436మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు. 879మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు చేయగా వీరిలో 129మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. 750మందికి నెగిటివ్‌ వచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రిలో 15మంది, ప్రైవేట్‌ ఆస్పత్రిలో నలుగురు, ప్రభుత్వ క్వారంటైన్‌లో తొమ్మిది మంది, హోం ఐసోలేషన్‌లో 45మంది చికిత్స పొందుతున్నారు. మరో 38 మంది హోం ఐసోలేషన్‌ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం 73కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇంతవరకు ఆరుగురు మృతి చెందగా మరో 12మంది డిశ్చార్జ్‌ అయ్యారు. అలాగే 71కంటైన్మెంట్‌ జోన్లలో 14 మూసివేశారు. 

కొత్తగా ఆరుగురికి.. 
జిల్లా కేంద్రంలో ఆదివారం కొత్తగా మరో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. టీడీగుట్టకు చెందిన ఓ మహిళ అనారోగ్యానికి గురికావడంతో ఇటీవల హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మూడు రోజుల క్రితం లక్షణాలు కనిపించడంతో నమూనాలు తీసి పరీక్ష చేయగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. అలాగే రాంనగర్‌లో నివాసం ఉండే ఓ ల్యాబ్‌ టెక్నీషియన్‌ భార్యకు కోవిడ్‌ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇక సంజయ్‌నగర్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌కు కరోనా ఉన్నట్టు తేలింది. ఇతను హైదరాబాద్‌లోని హాఫీజ్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మహబూబ్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. శ్రీకృష్ణ థియేటర్‌ పక్కన ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే తల్లి, కూతురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. పద్మవతికాలనీలో ఓ లెక్చరర్‌కు సైతం కోవిడ్‌ సోకింది. ఇప్పటికే ఈ ఇంట్లో భార్యాభర్తలకు పాజిటివ్‌ రాగా కొత్తగా తమ్ముడికి సైతం వచ్చింది.  

ఇంకా 70ఫలితాలు రావాలి 
జిల్లాకు చెందిన మరో 70మంది కరోనా లక్షణాలు కలిగిన అనుమానితుల ఫలితాలు రావాల్సి ఉంది. హైదరాబాద్‌లో పరీక్షలు చేయాల్సిన ల్యాబ్‌లలో ఇతర జిల్లాల నుంచి శాంపిళ్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పెండింగ్‌లో పడ్డాయి. వీటిలో ఇంకా ఎన్ని పాజిటివ్‌ కేసులు వస్తాయోననే ఆందోళనలో అధికారులు ఉన్నారు.

వైద్యుడి మృతి 
మహబూబ్‌నగర్‌ పట్టణంలో ఆదివారం ఓ సీనియర్‌ వైద్యుడు అనారోగ్యంతో మృతి చెందాడు. శ్వాసకోశ సమస్యతో ఇబ్బందిపడుతుంటే హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకువెళ్లగా చనిపోయాడు. మృతదేహాన్ని పట్టణంలోని ఓ కాలనీలో కొద్దిసేపు ఉంచారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు పలువురు వైద్యులు నివాళులు అరి్పంచారు. అనంతరం కోవిడ్‌ నిబంధనల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించినట్టు తెలిసింది. ఈ వైద్యుడికి కరోనా లక్షణాలు ఉన్నట్టు అనుమానించి మూడు రోజుల క్రితమే కరోనా పరీక్షలు చేస్తే ఫలితాలు నెగిటివ్‌గా వచ్చినట్టు సమాచారం.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top