కదానిపై ఒకటిగా దూసుకొచ్చిన మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గుబులు పుట్టిస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఒకదానిపై ఒకటిగా దూసుకొచ్చిన మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గుబులు పుట్టిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు వచ్చిన ఈ ఎన్నికలు తమ భవితవ్యాన్ని ఏ మలుపు తిప్పుతాయోననే ఆందోళన శాసనసభ్యుల్లో వ్యక్తమవుతోంది. అన్ని రాజకీయ పక్షాలకు ఈ ఎన్నికలు టెన్షన్ పుట్టిస్తున్నా... రేపటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేయాలనుకునే సిట్టింగ్‌లు, ఇతర ఆశావహులకు మాత్రం కంటిమీద కునుకు కరువైంది.
ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేల్లో అయితే డబుల్‌ధమాకా లాగా వచ్చిన ఈ ఎన్నికలు తమపుట్టి ముంచుతాయేమోననే భయం కనిపిస్తోంది. మిగిలిన స్థానాల ఎమ్మెల్యేలు మాత్రం ‘స్థానిక’ తలనొప్పులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో.... తాము పోటీచేసే ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయోననే సందేహంతో కొట్టుమిట్టాడుతున్నారు.
ఆ నలుగురిదీ విచిత్ర పరిస్థితి....
రెండు నెలల వ్యవధిలో మూడు రకాల ఎన్నికలు తన్నుకొచ్చిన నేపథ్యంలో జిల్లాలోని నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జిల్లాలో మధిర, ఇల్లెందు, కొత్తగూడెం, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో ఈనెల 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మున్సిపాలిటీలు ఉన్న నియోజకవర్గాలు.... మధిర నుంచి భట్టి విక్రమార్క (కాంగ్రెస్), ఇల్లెందు నుంచి ఊకె అబ్బయ్య (టీడీపీ), కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు (సీపీఐ), సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య (టీడీపీ) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నలుగురి పరిస్థితి ఇప్పుడు త్రిశంకు స్వర్గాన్ని తలపిస్తోంది. అటు మున్సిపల్, ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మరోవైపు అసెంబ్లీ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక వారు తలలుపట్టుకుంటున్నారు.
అటు ఆర్థికంగా, ఇటు మానసికంగా తమను ఈ ఎన్నికలు తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయని తమ సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికలలో అభ్యర్థుల వెతుకులాట, వారి ఆర్థిక భారంతో పాటు రెబెల్స్... ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు వీరికి గుబులు పుట్టిస్తున్నాయి. మున్సిపాలిటీలో విజయం సాధించలేకపోతే... ఆ ప్రభావం స్థానిక ఎన్నికలపై, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలపై చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ మున్సిపాలిటీలో బతికి బయటపడ్డా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏమవుతుందో... సార్వత్రిక ఎన్నికలకు 20 రోజుల ముందు వచ్చే ఆ ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆందోళన వెంటాడుతోంది.
ఒక ఎన్నికలో గెలిచి, మరో ఎన్నికలో ఓడితే పరిస్థితేంటి? ముందు ఎన్నికల్లో గెలిచి... తరువాతి ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే ఎలా? రెండు ఎన్నికల్లో విజయం సాధించినా... ఆ ఊపు అసెంబ్లీ ఎన్నిక వరకు కొనసాగుతుందా? ముందు జరిగే రెండు ఎన్నికలలో పెట్టుకున్న పొత్తులు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉంటాయా? ఉంటే ఎలా? ఉండకపోతే ఎలా? అసలు ఇన్ని ఎన్నికలు ఒకేసారి వస్తే ఆర్థిక భారం మోసేదెలా? అనే ప్రశ్నలు ఒకరకంగా వారికి నిద్రపట్టనివ్వడం లేదనే చెప్పాలి.
మిగిలిన ఆరుగురికీ టెన్షనే
ఆ నలుగురి పరిస్థితి అలా ఉంటే.... జిల్లాలోని మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేలూ ప్రస్తుతం సంకటస్థితిలోనే ఉన్నారు. వీరిలో నలుగురు అధికార కాంగ్రెస్‌కు చెందిన వారు కాగా, మరొకరు టీడీపీ, ఇంకొకరు సీపీఐకి చెందిన వారు. ముఖ్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు అభ్యర్థుల ఖరారు.... ఆ తర్వాత వారికి ఆర్థిక సహకారం... అటుపైన ఫలితాలు... మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు... అన్నింటినీ ఎలా మేనేజ్ చేయాలో తమకు అర్థం కావడం లేదని వారంటున్నారు.
మున్సిపల్ ఎన్నికలలో ప్రతికూల ఫలితం వచ్చినా, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే స్థానిక ఎన్నికలలో మంచి వ్యూహం అవలంబించి బయటపడితే అదే ఊపు అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఉండేదని, కానీ మా స్థానాల్లో స్థానిక ఎన్నికల్లో ఓటమి పాలయితే అదే ఓటమితో సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాల్సివస్తుందని ఓ ఎమ్మెల్యే ‘సాక్షి’ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద వేసవి అంటే విద్యార్థులకు పరీక్షా కాలమని, కానీ ఈసారి వేసవి కాలం తమకు నిజంగా పరీక్ష వంటిదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. మరి ఈ పరీక్షను సిట్టింగ్‌లు ఎలా నెట్టుకొస్తారో వేచి చూడాల్సిందే.