కొండంత సంబురం నేడే | CM KCR Inaugurate Kondapochamma Sagar Project On 29th May | Sakshi
Sakshi News home page

కొండంత సంబురం నేడే

May 29 2020 1:47 AM | Updated on May 29 2020 8:09 AM

CM KCR Inaugurate Kondapochamma Sagar Project On 29th May - Sakshi

కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌.. పంప్‌హౌస్‌ను పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రానికి వరప్రదాయిని అయిన కాళేశ్వ రం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైన దశకు శుక్రవారం అంకురార్పణ జరుగనుంది. సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తున నిర్మించిన కొండపోచమ్మసాగర్‌రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడం ద్వారా రాష్ట్రం కొత్త చరిత్ర ను లిఖించనుంది. ఈ చరిత్రా త్మక కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు కొండపోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు, చండీయాగం, సుదర్శన యాగం నిర్వహించనున్నారు.  

ఉదయం నుంచే పూజలు.. 
శుక్రవారం ఉదయం 4.30 గంటల నుంచే ఏక కాలంలో కొండపోచమ్మ దేవాలయంలో చండీయాగం, కొండపోచమ్మ సాగర్‌ పంపుహౌస్‌ (మర్కూక్‌) వద్ద సుదర్శన యాగం ప్రారంభం కానున్నాయి. ఉదయం 7 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు ప్రాజెక్టు నుంచి 30 కిలోమీటర్ల దూరంలోని కొండపోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చండీ యాగంలో భాగంగా నిర్వహించే పూర్ణాహుతిలో పాల్గొని తీర్థ ప్రసాదాలు, వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకొని ఉదయం 9 గంటల తర్వాత ఎర్రవల్లి, మర్కూక్‌ గ్రామాల్లో నిర్మించే రైతు వేదికలకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తారు. అనంతరం మర్కూక్‌ వద్ద గల కొండపోచమ్మసాగర్‌కు నీటిని ఎత్తిపోసే పంప్‌హౌస్‌ వద్దకు చేరుకుంటారు. 10 గంటల సమయంలో పంప్‌హౌస్‌ వద్దకు చేరుకొనే చినజీయర్‌ స్వామికి కేసీఆర్‌ స్వాగతం పలుకుతారు. అక్కడ నిర్వహించే సుదర్శన యాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు. అనంతరం 11.30 గంటలకు పంప్‌హౌస్‌లలోని రెండు మోటార్లను ఆన్‌ చేసి గోదావరి ఎత్తిపోతలకు కేసీఆర్‌ శ్రీకారం చుడతారు. అక్కడి నుంచి 11.35 గంటలకు ప్రాజెక్టు డిశ్చార్జి కెనాల్‌ వద్దకు చేరుకొని గోదా వరి జలాలకు పూలతో స్వాగతం పలుకుతారు. గోదావరి జలాలకు పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి వరదరాజుపూర్‌ గ్రామంలోని వరదరాజేశ్వరస్వామి దేవాలయానికి వెళ్తారు. అక్కడ పూజల అనంతరం 12.40 గంటలకు వరదరాజుపూర్‌ నుంచి మర్కూక్‌ పంప్‌హౌస్‌కు చేరుకొని అధికారులు, ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొంటారు. 


ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్‌ కీలకపాత్ర... 
కాళేశ్వరంలోని మేడిగడ్డ నుంచి సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్‌కు గోదావరి జలాల తరలింపులో ముగ్గురి పాత్ర అత్యంత కీలకంగా ఉంది. అందులో మొదటి వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్‌. తన సొంత నియోజకవర్గానికి నీళ్లు తెచ్చే లక్ష్యంతో పాత డిజైన్‌లో కేవలం ఒక టీఎంసీ సామర్థ్యమున్న ఈ రిజర్వాయర్‌ను 21 టీఎంసీలకు పెంచాలని నిర్ణయించారు. అయితే రిజర్వాయర్‌ కింద భారీగా ముంపు, భూసేకరణ అధికంగా ఉండటంతో మళ్లీ దాన్ని 15 టీఎంసీలకు కుదించారు. అయినప్పటికీ భూసేకరణ సమస్యలు, ఆర్‌ అండ్‌ ఆర్‌ సమస్యలు తలెత్తడంతో స్వయంగా జోక్యం చేసుకొని వాటిని పరిష్కరించారు. ఎప్పటికప్పుడు వివిధ విభాగాలను సమన్వయం చేస్తూ వచ్చారు. 

మంత్రి హరీశ్‌ సహకారం.. 
సీఎం ఆదేశాల మేరకు త్వరితగతిన 4,600 ఎకరాల భూసేకరణ జరిగేలా నాటి నీటిపారుదలశాఖ మంత్రి, ప్రస్తుత ఆర్థిక మంత్రి టి. హరీశ్‌రావు కృషి చేశారు. భూసేకరణపై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్, ఆర్డీఓతోపాటు ప్రాజెక్టు ఇంజనీర్లకు సూచనలు చేస్తూ పంప్‌హౌస్, రిజర్వాయర్, కాల్వల పనులను పూర్తి చేయించారు. కొండపోచమ్మసాగర్‌కు ఎగువన ఉండే రంగనాయక్‌సాగర్‌ రిజర్వాయర్‌ కింద కాల్వల పనులను వేగంగా పూర్తి చేయించిన ఘనత ఆయనకే దక్కింది. 

ఈఎన్‌సీ హరిరామ్‌ సాంకేతిక సమన్వయం.. 
మిడ్‌మానేరుకు కా>ళేశ్వరం జలాలు చేరిన తర్వాత నుంచి రంగనాయక్‌సాగర్‌ వరకు నీటిని చేర్చడంలో ఈఎన్‌సీ హరిరామ్‌ అత్యంత కీలకంగా వ్యవహరించారు. అనంతగిరి, కొండపోచమ్మ కింద ముంపు గ్రామాల కోర్టు వ్యవహారాలను సమన్వయం చేయడం, 5 పంప్‌హౌస్‌లలో మోటార్ల బిగింపు, సమస్యల్లేకుండా నీటి ఎత్తిపోతలు, కాల్వలకు నీటి విడుదల కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, కొండపోచమ్మ ఎస్‌ఈ వేణు సైతం కీలకపాత్ర పోషించారు. అలాగే పంప్‌హౌస్‌ పనులను చేపట్టిన మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ సైతం పంపులు, మోటార్లను తక్కువ కాలంలోనే ఏర్పాటు చేయడం, అవి పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా సిద్ధం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించింది. మర్కూక్‌ పంప్‌హౌస్‌లోని 34 మెగావాట్ల సామర్థ్యంగల 6 మోటార్లను తక్కువ కాలంలోనే మేఘా సంస్థ సిద్ధం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement