పెట్రో బంకుల్లో ఆగని మోసాలు

Cheatings in Hyderabad Petrol Bunks - Sakshi

పట్టని తూనికలు కొలతల శాఖ స్టాంపింగ్‌లో చేతివాటం

తూ.తూ మంత్రంగా స్టాంపింగ్‌  

సాక్షి, సిటీబ్యూరో:  గ్రేటర్‌ హైదరాబాద్‌లో పెట్రోల్‌ బంకుల మోసాలు ఆగడం లేదు. పంపింగ్‌లో చేతివాటం, డిస్‌ ప్లేలో దగా, స్టాంపింగ్‌ లేకుండా బంకుల నిర్వహణ బాహాటంగా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలోనే పెట్రో, డీజిల్‌ వినియోగంలో గ్రేటర్‌హైదరాబాద్‌ వాటా సగానికి పైనే ఉంటుంది. అవకతవకలను అరికట్టాల్సిన తూనికల కొలుతల శాఖ మాత్రం మామూళ్ల మత్రులో జోగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అప్పుడప్పుడు  చేపడుతున్న స్పెషల్‌ డ్రైవ్‌లో పలు అక్రమాలు బహిర్గతమవుతున్నా  మొక్కుబడి కేసులు, జరిమానాలతో  చేతులు దులుపుకుంటోంది.

ప్రతి లీటర్‌కు  10 నుంచి 20 ఎంఎల్‌...
గ్రేటర్‌ హైదరాబాద్‌ పెట్రోల్‌ బంకుల్లో డీలర్ల చేతివాటంతో ప్రతి లీటర్‌కు సగటున  10 నుంచి 20 ఎంఎల్‌ వరకు తక్కువగా పంపింగ్‌ జరగడం సాధారణమైంది. తూనికల,కొలతల శాఖ నిబంధనల ప్రకారం ఐదు లీటర్లలో 25 ఎంఎల్‌ వరకు తక్కువగా ఉండవచ్చు. కానీ ప్రతి లీటర్‌లో  తక్కువగా పంపింగ్‌ జరుగుతున్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైనా కట్టడి చర్యలు మాత్రం కానరావడం లేదు.  

సీల్‌ బ్రేక్‌ ..
పెట్రోల్‌ బంకుల సీల్‌ బ్రేకింగ్‌ బాహాటంగా సాగుతున్నట్లు  వెల్లడైంది  తూనికల, కొలతల శాఖ అధికారులు ఏడాదికోసారి ఫిల్లింగ్‌ మిషన్‌ను  పరిశీలించి సీల్‌వేసి స్టాపింగ్‌ చేస్తారు. ప్రతియేట రెన్యూవల్‌ కోసం సదరు డీలరు గడువు కంటే పక్షం రోజుల ముందు తూనికల కొలత శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. తూనికల, ఆయిల్‌ కంపెనీల అధికారులతోపాటు ఇద్దరు  టెక్నీషియన్ల సమక్షంలో పంపింగ్‌ మీషన్‌లో మెజర్‌మెంట్‌ను పరిశీలించి స్టాంపింగ్‌ చేస్తారు. ఆయితే  గతంలో అధికారుల దాడుల్లో డీలర్లు సీల్‌ బ్రేక్‌ చేసినట్లు బహిర్గతమైంది. సీల్‌ బ్రేక్‌ చేసి చిప్స్‌ను అమర్చడం,రిమోట్స్‌తో పంపింగ్‌ కంట్రోల్‌ చేయడం లాంటి సంఘటనలు బట్టబయలయ్యాయి.   

ప్రభుత్వ బంకులపైనే..
ప్రభుత్వం పక్షాన నిర్వహించే పెట్రో బంకుల పట్లనే వాహనదారులు ఆసక్తి కనబర్చుతున్నారు. నిత్యం రద్దీ ఉన్నప్పటికి సమయం వెచ్చించి క్యూలో నిలబడి కాస్త పెట్రోల్‌ పోయించుకుంటున్నారు.  జైళ్ల శాఖ నిర్వాహణ లోని చంచలగూడ పెట్రో బంక్‌లలో మాత్రం రోజుకు 20 వేల నుంచి  30 వేల లీటర్ల పెట్రోల్,  15వేల నుంచి నుంచి  20వేల లీటర్లు వరకు డీజిల్‌ అమ్మకాలు సాగుతుంటాయి. సచివాలయం వద్దగల సివిల్‌ సపై్ల పెట్రోల్‌ బంకుకు కూడా వాహనదారులు తాకిడి అధికంగా ఉంటుంది. ప్రై వేటు బంకులపై వాహనదారులకు నమ్మకం సన్నగిల్లడం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది.

వినియోగంలో టాప్‌...
రాష్ట్రంలోనే పెట్రో,డీజిల్‌ వినియోగంలో హైదరాబాద్‌ వాటా సగానికి పైనే ఉంది. జంట జిల్లాల్లో ప్రధాన మూడు కంపెనీలకు సుమారు 447 పెట్రోల్, డీజిల్‌ బంకులు ఉన్నాయి. పతిరోజు  ఆయిల్‌ కంపెనీల టెర్మినల్స్‌ నుంచి పెట్రోల్‌ బంకులకు 150 నుంచి 170 ట్యాంకర్లు ద్వారా ఇంధనం సరఫరా అవుతుంది. ఒక్కొక్క ట్యాంకర్‌ సగటున 12 వేల లీటర్ల నుంచి 20 వేల లీటర్ల వరకు సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రతిరోజు సగటున 40 లక్షల లీటర్ల పెట్రోల్,  35 లక్షల  డీజిల్‌  వినియోగమవుతోంది.

‘నాజిల్‌’కు డబుల్‌ వసూల్‌
పెట్రో బంకుల్లో ఫిల్లింగ్‌ మెషిన్ల పనితీరుపై పర్యవేక్షణ పేరుతో తూనికలు, కొలుతల శాఖ అధికారులు రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఫిల్లింగ్‌ మెషిన్ల స్టాంపింగ్‌ సమయంలో బిల్లు రసీదు కంటే రెట్టింపు ఫీజు వసూలు చేస్తుండటంతో పెట్రోల్‌ బంకులో జరిగే అక్రమాలపై నిఘా కరువైంది. పెట్రోల్‌ బంకుల యాజమానులు, స్థానిక  తూనికల కొలుతల అధికారుల పరస్పర సహకారంతో పెట్రో అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. దీంతో పెట్రోల్‌ బంకుల స్టాంపింగ్‌ సీల్‌ను సైతం బహిరంగంగా పగులగొడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఏడాదికోసారి తనిఖీల పేరుతో హడావుడి
గ్రేటర్‌ హైదరాబాద్‌  పరిధిలో దాదాపు 447 పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. ఒక్కో పెట్రోల్‌ బంకులో ఆరు నుంచి 10 వరకు ఫిల్లింగ్‌ మెషిన్లు ఉన్నాయి.  ఈ లెక్కన  సుమారు మూడు వేల వరకు  ఫిల్లింగ్‌ యంత్రాలు ఉన్నట్లు అంచనా.  తూనికల, కొలతల శాఖ అధికారులు ఏడాదికోసారి  ఫిల్లింగ్‌ మెషిన్లను పరిశీలించి  స్టాంపింగ్‌  చేస్తారు. ఏటా రెన్యూవల్‌ కోసం సదరు డీలరు గడువు కంటే పక్షం రోజుల మందే తూనికల కొలత శాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  తూనికల, ఆయిల్‌ కంపెనీల అధికారులతో పాటు ఇద్దరు టెక్నిషియన్ల సమక్షంలో పంపింగ్‌ మెషిన్‌లో మెజర్‌మెంట్‌ను పరిశీలించి స్టాంపింగ్‌ చేస్తారు.. మెజర్‌మెంట్‌లో ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా సరి చూసి స్టాంపింగ్‌ చేయాల్సి ఉంటుంది. 

ఇందుకుగాను నిర్ణీత ఫీజు  వసూలు చేసి  ప్రభుత్వ ఖజానాలో  జమా చేయాల్సి ఉంటుంది. అయితే స్టాంపింగ్‌ అనంతరం సంబంధిత అధికారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజు రసీదు పెట్రోల్‌ బంకు యాజమానులకు అందిస్తారు. అయితే యాజమానులు మాత్రం రసీదులో పేర్కొన్న మొత్తానికి రెండింతలు నగదును  అందజేయడం అనవాయితీ.  డబుల్‌ ఫీజు చెల్లించకుండా ఉండేందుకు బంకుల యాజమానులు ఎవరూ సహసించరు. దీంతో  తూనికల, కొలుతల అధికారులు బంకులు యాజమానులకు అనుకూలంగానే మెజర్‌మెంట్‌ విషయంలో సహకారం అందిస్తారు. దీనికితోడు బంకుల యాజమానులు సీల్‌ను బ్రేక్‌ చేసినా వారు పట్టించుకోవడం లేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top