
కాళేశ్వరం: డిసెంబర్‌లో ముందస్తు ఎన్నికలు రావచ్చనే ఊహాగానాల నేపథ్యంలో కాళేశ్వరం నీటిని వీలైనంత త్వరగా ఎత్తిపోసేలా ప్రభుత్వం పనుల ప్రాధాన్యతలో మార్పులు చేసింది. జయశంకర్ భూపాపల్లి జిల్లాలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగు, తాగు అవసరాలకు నీరందిస్తేనే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతామంటూ సీఎం కేసీఆర్ అనేక సందర్భాల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మొత్తం ప్రాజెక్టు పనులు పూర్తి చేసి నీటిని ఎత్తిపోయడానికి ఎక్కువ సమయం పట్టపట్టే అవకాశమున్నందున ప్రస్తుతం పూర్తయిన పనుల నుంచి అక్టోబర్‌కల్లా నీటిని ఎత్తిపోయడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలిసింది. దీనిపై ఇంజనీర్ల నుంచి కూడా ప్రభుత్వం సమాచారం సేకరించింది. దీనిలో భాగం గానే మంత్రి హరీశ్‌రావు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ పనుల్లో వేగం పెంచేలా వర్క్ ఏజెన్సీ, ఇంజనీరింగ్ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
ప్రాణహిత నీరుతో..
కాళేశ్వరం గుండా మహారాష్ట్ర నుంచి వస్తున్న ప్రాణహిత నది నీటిని ఒడిసిపట్టుకుని రివర్స్ పంపింగ్ ద్వారా ఎల్లంపల్లి వరకు తరలించి రాష్ట్ర సాగు, తాగునీటి అవసరాలు తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం కాళే శ్వరం ప్రాజెక్టుకు డిజైన్ చేసింది. ఇందులో మొత్తం గోదావరి నదిపై కొత్తగా మూడు బ్యారేజీలతోపాటు 20 రిజర్వాయర్లు, నీటిని ఎత్తిపోసేందుకు 19 పంపు హౌస్‌ల నిర్మాణానికి రూపకల్పన చేశారు.
వీటిలో మేడిగడ్డ బ్యారేజీ నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోతల ద్వారా అన్నారం బ్యారేజీకి, అక్కడి నుంచి అంతే మొత్తంలో సుందిళ్ల బ్యారేజీకి తరలించాల్సి ఉంటుంది. సుందిళ్ల బ్యారేజీ నుంచి ఎల్లంపల్లి వరకు నీటికి తీసుకెళ్తారు. ఇప్పటి వరకు మూడు పంపుల ద్వారా నీటిని ఎత్తి పోసేందుకు అనువుగా పనులు పూర్తయ్యాయి. మొత్తం పంపులు, మోటార్లు బిగించేందుకు జనవరి లేదా ఫిబ్రవరి వరకు సమ యం పట్టవచ్చని ఇంజనీర్లు పేర్కొంటున్నారు.
మూడు మోటార్లు..
కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల పంప్‌హౌస్‌ల వద్ద 3 మోటార్ల ద్వారా నీటిని ఎత్తి పోసేందుకు అవసరమైన పనులు పూర్తయినందున వీటికి మోటార్లు బిగించడంపై ఏజెన్సీ ప్రతినిధులు, ఇంజనీర్లు దృష్టి సారించారు. వర్షాల కారణంగా సివిల్ పనుల్లో వేగం తగ్గినా ఎలక్ట్రోమెకానికల్ పనులు (విద్యుత్, మోటా ర్లు, పైపులైన్ల నిర్మాణం) వేగం తగ్గకుండా కొనసాగిస్తున్నారు.
యుద్ధ ప్రతిపాదికన మూడు మోటార్లు, పైపులైన్ల పనులు చేస్తున్నారు. సెప్టెంబర్ 15 నాటికి మూడు మోటార్లు బిగించి ఆ వెంటనే డ్రైరన్, వెట్ రన్ నిర్వహించనున్నారు. మరోవైపు గోదావరిలోని నీటిని తీసుకునే కన్నెపల్లి వద్ద హెడ్ రెగ్యులేటర్ల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. మోటార్ల బిగింపు పూర్తయితే నది నుంచి హెడ్‌రెగ్యులేటర్ వరకు అప్రోచ్ కెనాల్ పనిని రెండు రోజుల్లో పూర్తి చేస్తామని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు.
అక్టోబర్‌లో రోజుకు ఒక టీఎంసీ..
బ్యారేజీ, పంపుహౌస్‌ల నిర్మాణం పూర్తయితే 11 మోటార్ల ద్వారా రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం మూడు మోటార్లు సిద్ధమవుతున్నందున, వీటి సాయంతో రోజుకు ఇంచుమించు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోవయవచ్చని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు.
సాగును మినహాయించడం వల్ల తాగు నీటి అవసరాల మేర కు నీటిని ఎత్తి పోసేందుకు ఈ మోటార్లు పనిచేస్తా యని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ మొదటి వారంలో నీటిని ఎత్తిపోయడమే లక్ష్యంగా పనుల్లో వేగం పెంచారు. అక్టోబర్‌లో నీటి విడుదలను దృష్టిలో ఉం చుకుని అత్యవసరమైన చోట లైనింగ్, సూపర్‌ప్యాసే జ్, అండర్ టన్నెల్ పనుల్లో వేగం పెంచనున్నారు.
మేడిగడ్డపై ఆధారపడకుండా..
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తయ్యేందుకు మరో ఆర్నెళ్ల సమయం పట్టనుంది. దీంతో బ్యాక్‌వాటర్ మీద ఆధారపడకుండా ఈశాన్య రుతుపవనాల సమయంలో ప్రాణహితలో ఉండే వరదతో కన్నెపల్లి వద్ద వంద అడుగుల నీటి మట్టం ఉంటుందని ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు.
సాధారణంగా గోదావరిలో జూలై, ఆగస్టులో వరదలు వస్తే ప్రాణహితలో సెప్టెంబర్, అక్టోబర్‌లో వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కనీసం మూడు మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసేలా పనుల్లో మార్పులు, చేర్పులు చేసినట్లు సమాచారం. గత వారం రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పనులు ఊపందుకోనున్నట్లు అధికారులు తెలిపారు.