హోటల్ ఫుడ్డు తింటే బెడ్డు!


మీరు హోటల్‌కు కెళుతున్నారా? జర భద్రం. తినే ఆహారంలో నాణ్యత డొల్లే.. ఏ పదార్థం చూసినా కల్తీమయమే.. జంతు కళేబరాలను మరిగించి నూనెను తీయడం.. ఆ నూనెను వంటల తయారీలో వాడుతున్నట్టు ఫిర్యాదులు వినవస్తున్నాయి. పైగా అపరిశు భ్రత, రోత పుట్టించే పరిసరాల మధ్యే ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే హోటల్, దాబాలు, రెస్టారెంట్ల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 

 సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి: నలభై ఆరు మండల కేంద్రాలు.. 1,058 పంచాయతీలు. ఐదు మున్సిపాల్టీలు.. మూడు నగర పంచాయతీలు. పది మేజర్ పట్టణాలు.. రెండు జాతీయ రహదారులు.. ఇది సూక్ష్మంగా జిల్లా స్వరూపం. రహదారులకు ఇరువైపులా సుమారు 200 దాబాలు. జిల్లాలో వందలాది హోటళ్లు.. రెస్టారెంట్లు, వేలాదిగా చిరు తినుబండారాల కేంద్రాలు.

 

 వీటిలో ఆహార నాణ్యత మాత్రం డొల్ల. ఎటు చూసినా కల్తీ. చనిపోయిన జంతు కళేబరాలను మరిగించి నూనెను తీసి, ఈ నూనెలను బిర్యానీ, మిఠాయిల తయారీలో వాడుతున్నారనే ఫిర్యాదులు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. మరో వైపు అపరిశుభ్రత. రోత పుట్టించే పరిసరాల మధ్య ఆహార పదార్థాలు తయారుచేస్తున్నారు. బొద్దిం కలు, ఈగలు పడిన వంటకాలైతే సరేసరి. వంటకాల్లో పడిన బొద్దింకలను హోటల్ సర్వర్లు ఎడమ చేతితో తీసేసి, కుడి చేతితో వడ్డిస్తున్నారు. ఆహార తనిఖీ అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో అపరిశుభ్రంగా ఉన్న ఆహారం తిని ప్రజలు లేని రోగాల బారిన పడుతున్నారు.

 

 తనిఖీ అధికారులు ముగ్గురే..

 జిల్లాలో ఆహార తనిఖీలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.  ఇంత పెద్ద జిల్లాలో  కేవలం ముగ్గురు మాత్రమే ఆహార తనిఖీ అధికారులున్నారు. వారే జిల్లా అంతటినీ పర్యవేక్షించాలంటే ఎలా సాధ్యం. పట్టణ ప్రాంతాలతో పాటు, మున్సిపాల్టీల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర తినుబండారాల దుకాణాల్లో తరచూ ఆహార పరిశుభ్రతకు సంబంధిత సమస్యలు ఉత్పన్నం అవుతూనే ఉన్నాయి. ఇటీవల జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి వెంట ఉన్న ఓ దాబాలో ఫ్రైడ్ రైస్‌లో ఫ్రై చేసిన బొద్దింక వచ్చింది. పూర్తిగా తిన్న తర్వాత గమనించిన వినియోగదారుడు వాంతులు చేసుకున్నాడు. ఇదిలా ఉండగా మరో రెస్టారెంటులో తయారుచేసిన బిర్యానీకి ఉపయోగించిన నూనె.. కొవ్వును పోలి జిగటగా ఉందనే ఫిర్యాదులు వచ్చాయి. నాణ్యత లేని పదార్థాలు, నిల్వ ఉన్న ఆహార పదార్థాలు వడ్డించడం తరచూ జరుగుతోంది. వినియోగదారులు గుర్తించి హోటల్ యాజమాన్యాన్ని నిలదీస్తే ఆహార పదార్థాలను మార్చి ఇవ్వడం లేదంటే ఉన్నదాన్నే తోసెయ్యడం జరుగుతోంది.

   

 తనిఖీలు లేవు...

 జిల్లాలో గడిచిన నాలుగేళ్ల కాలంలో ఆహార తనిఖీ అధికారులు కేవలం 423 శాంపిల్స్ మాత్రమే సేకరించారు. ఈ లెక్కన అధికారులు సగటున ప్రతి మూడు రోజులకు ఏదో ఒక హోటల్ నుంచి శాంపిల్ సేకరిస్తున్నారన్న మాట. 2011 నుంచి అధికారుల దాడు లు గణనీయంగా తగ్గిపోయాయి. శాం పిల్స్ సేకరించిన తర్వాత అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లేకపోవడంతో హోటల్ యాజమాన్యం లేబరేటరీ వారికి డబ్బు ఆశ చూపి  కల్తీ నిర్ధారణ కానట్లుగా నిరూపించుకుంటున్నారు.

 

 ముడుపులతోనే సరి

 అధికారులు పర్యవేక్షణకు బదులు మామూళ్ల వసూళ్లకే పూర్తి సమయం కేటాయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో ప్రతి హోటల్, రెస్టారెంట్లు, బార్లు, ఇతర తినుబండారాల దుకాణాల్లోకి ఆహార తనిఖీ అధికారులు వచ్చిపోతున్నట్లు ఆధారాలున్నాయి. కానీ నాణ్యతా పరీక్షలు, పరిశీలనలు చేసిన దాఖలాలు మాత్రం లేవు. నెలనెలా డబ్బులు ఇవ్వని దుకాణాలపై మాత్రమే దాడులు చేసి హడావుడి చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top