యువ రైతు... నవ సేద్యం!

Assistant Professer Shifted To Organic Farming In Miryalaguda - Sakshi

ఉద్యోగానికి రాజీనామా చేసి సేద్యం వైపు అడుగులు

రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న యువ రైతు మద్దెల అరుణ్‌ 

సాక్షి, మిర్యాలగూడ  : చదివింది సాంకేతిక విద్య.. పుడమిని నమ్ముకున్న తండ్రికి  చేదోడు వాదోడుగా ఉంటూ గత కొంత కాలంగా సేంద్రియ వ్యవసాయం పై ప్రత్యేక దృష్టిని సారించాడు. మధ్యప్రదేశ్‌లో చేస్తున్న తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి సేంద్రియ వ్యవసాయం చేస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆయనే మద్దెల అరుణ్‌. మిర్యాలగూడ పట్టణంలోని మద్దెల గౌతమ్‌–విమలకు ముగ్గురు సంతానం, వీరు ఇరువురు ఉద్యోగులే. మద్దెల గౌతమ్‌ హాస్టల్‌ వార్డెన్‌గా పని చేస్తుండగా.. విమల ఉపాధ్యాయురాలుగా పనిచేసి పదవి వీరమణ పొందారు. మద్దెల అరుణ్‌  ఎంటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ను పూర్తి చేశాడు. కాగా నల్లగొండలో శ్రీరామానంద తీర్థ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏడాది పాటు అధ్యాపకుడిగా పనిచేశాడు.

ఆ తరువాత నల్లగొండ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌లో మరో ఏడాది పాటు పని చేశాడు. ఆ సమయంలోనే అరుణ్‌కు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరంలోని లక్ష్మీనారాయణ కళాశాల అండ్‌ టెక్నాలజీ (ఎల్‌ఎన్‌సీటీ)లో రూ. 50వేల వేతనంపై అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేశాడు. ఈ క్రమంలో వ్యవసాయంలో తండ్రి గౌతమ్‌కు ఆసరగా ఉండేందుకు వ్యవసాయం చేయాలనే తపనతో 2013లో తన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. సాధారణ పద్ధతులతో వ్యవసాయం సాగు చేస్తే సాగుబడి ఖర్చు పెరుగుతుంది కాని ఎలాంటి ఫలితం లేదని గుర్తించి వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనల మేరకు సేంద్రియ సాగుపై ప్రత్యేక దృష్టి సారించాడు.

పట్టణ శివారులో ఉన్న అద్దంకి–నార్కట్‌పల్లి బైపాస్‌ రోడ్డులో గల ఖలీల్‌ దాబా వెనుకాలో 10 ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో వరి సాగు చేస్తున్నాడు. అందుకు గాను మండల వ్యవసాయ అధికారులు, కృషి విజ్ఞాన్‌ కేంద్రం శాస్త్రవేత్తలు, తక్కువ పెట్టబడితో ఎక్కువ అధిక దిగుబడిని సాధిస్తున్న రైతుల సలహాలు తీసుకొని సేంద్రియ వరిసాగును చేపట్టాడు. మొదటి పంటలో 20 బస్తాలను పండించగా, గత రబీ సీజన్‌లో 34బస్తాల వరి ధాన్యాన్ని పండించాడు. ప్రస్తుతం సేంద్రియ పద్ధతిలోనే వరిని సాగు చేస్తున్నాడు. 

క్షేత్రంలోనే ఎరువుల తయారీ.. 
అద్దంకి–నార్కట్‌పల్లి బైపాస్‌ రోడ్డు వెంట ఉన్న ఖలీల్‌ దాబా వెనుకాల ఒక షెడ్‌ను ఏర్పాటు చేసుకొని భూసారాన్ని పెంచేందుకు తెగుళ్ల నివారణ, పంటలకు అవసరమైన పోషణలకు తన వ్యవసాయ క్షేత్రం పక్కనే సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నాడు. నాణ్యమైన దిగుబడితో పాటు, పెట్టుబడి తక్కువ అని పేర్కొంటున్నాడు. ఎరువుల తయారీ ఆయన మాటల్లోనే.. జీవన, దృవ, ఘన జీవంలో ఆవుపేడ, ఆవు మూత్రం, ఏదైనా పిండితో కలిపి బెల్లం రెండు కేజీలు, పుట్టమన్ను రెండు కేజీలు, 200 లీటర్ల నీటితో నాలుగు రోజుల పాటు మరుగుపెట్టాల్సి ఉంటుంది. ఆ తరువాత పొలాల్లో చల్లితే యూరియా, అడుగుపిండి అవసరం లేదు. దీనిని వరి పంటలో 15 రోజులకు ఒక్కసారి వేయాల్సి ఉంటుంది.

అదే విధంగా వీటిన్నింటి ఆవుపేడతో కలిపి ముద్దలుగా పిడకలను చేసి నిల్వ ఉంచాలి. ఆ తరువాత దీని పంటలకు పెంట దిబ్బలను తోలే సమయంలో ఈ ముద్దలను కలిపితే మరింత బలంగా ఉంటుంది. ఇలా పచ్చిరొట్టె, పైర్లు, వేపపిండి, ఘన జీవామృతం, జీవ ఎరువుల అజోల స్పెరిలం, పొటాష్‌ పప్పోసాల్‌బాయిల్‌ బ్యాక్టీరియా, వర్మీకంపోస్ట్, విత్తన శుద్ధికి బీజామృతం తయారీ, పురుగుల మందు నివారణకు జీవామృతం తయారీ చేయాలి. అంతేకాకుండా సేంద్రియ వ్యవసాయంలో ఫలితం పొందుతున్న యువ రైతు వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసే సదస్సుల్లో సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం వర్మీకంపోస్టు తయారు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను చేపడుతున్నాడు. అదే విధంగా సుమారు 20 గేదెలు, ఆవులతో మంచి పాల వ్యాపారంతో పాటు సొంత డెయిరీని కూడా నడుపుకుంటున్నాడు. 

తక్కువ ఖర్చు.. ఎక్కువ దిగుబడి..
మద్దెల అరుణ్‌ సేంద్రియ ఎరువులపైనే ప్రత్యేక దృష్టిని సారించి తనదైన శైలిలో వ్యవసాయాన్ని చేస్తున్నాడు. సాధారణ పద్ధతిలో ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని సాధించాలనే లక్ష్యంతో ముందడుగు వేస్తున్నాడు. అయితే ఎకరానికి రూ. 15వేల నుంచి రూ. 20వేల వరకు ఖర్చు అవుతుండగా సేంద్రియ పద్ధతిలో రూ. 10వేల నుంచి రూ. 12వేల వరకు పెట్టుబడి అవుతుంది. సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలకు బహిరంగ మార్కెట్లలో మంచి స్పందన లభిస్తుందని ఆయన పేర్కొంటున్నాడు. వేములపల్లి మండలంలో 10 ఎకరాలు, మిర్యాలగూడ బైపాస్‌లో 10 ఎకరాలతో పాటు మరో 6 ఎకరాలను కౌలుకు తీసుకొని వరిసాగును చేపడుతున్నాడు.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top