కళ తప్పిన ‘ఆర్ట్స్‌’

Arts College Management Delayed Development And Staff Shortage - Sakshi

ఓయూలో అధ్యాపకుల కొరత  

రద్దవుతున్న పలు కోర్సులు

తగ్గుతున్నవిద్యార్థుల సంఖ్య

ఉస్మానియా యూనివర్సిటీ: చారిత్రక ఆర్ట్స్‌ కళాశాలను అధ్యాపకుల కొరత వేధిస్తోంది. యూనివర్సిటీ కాలేజీల్లో అతిపెద్దదైన ఆర్ట్స్‌ కళాశాలలో ఆర్ట్స్, సోషల్‌ సైన్స్‌ విభాగాలలో 26 ఎంఏ కోర్సులు ఉన్నాయి. ఇంగ్లిష్, ఎకనామిక్స్, పొలిటికల్‌ సైన్స్‌ కోర్సులు మినహా ఇతర 23 కోర్సులలో అధ్యాపకుల కొరత ఏర్పడింది. నిబంధనల ప్రకారం ప్రతి విభాగంలో 6– 8 మంది అధ్యాపకులు ఉండాలి. అందులో ముగ్గురు ప్రొఫెసర్లు తప్పనిసరి. కానీ మూడు విభాగాలు మినహా మిగతావాటిలో అవసరమైన సంఖ్యలో అధ్యాపకులు లేకుండాపోయారు. దీంతో విద్యార్థులు ఆయా కోర్సులలో చేరడం లేదు. విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతోంది. సంస్కృతం, పర్షియన్, మరాఠి, కన్నడ, ఉర్దూ,  పురావస్తు శాఖలలో కేవలం ఒకే అధ్యాపకుడు  ఉన్నారు. తమిళ్, జర్మన్, ఫ్రెంచ్, రష్యన్‌ విభాగాల్లో అధ్యాపకులు లేకపోవడంతో పీజీ కోర్సులను రద్దు చేశారు. చరిత్ర, తెలుగు, హిందీ, అరబిక్, సైకాలజీ, ఫిలాసఫీ, లైబ్రరీ సైన్స్‌ తదితర విభాగాల్లో ఒకరి నుంచి ముగ్గురు మాత్రమే అధ్యాపకులు పని చేస్తున్నారు. థియేటర్‌ ఆర్ట్స్‌ విభాగంతో పాటు మరికొన్ని విభాగాల్లో పర్మనెంట్‌ అధ్యాపకుల స్థానంలో కాంట్రాక్టు అధ్యాపకులతో కొనసాగిస్తున్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల నియామకాలను ఆరు సంవత్సరాల క్రితం రద్దు చేయడంతో ప్రస్తుతం పార్టుటైం అధ్యాపకులతో బోధన సాగుతోంది. ఓయూలో పని చేస్తున్న కాంట్రాక్ట్, పార్టుటైం అధ్యాపకులు కేవలం బోధనకు మాత్రమే చేస్తున్న పీహెచ్‌డీ గైడ్‌షిప్‌ ఇవ్వకపోవడంతో పరిశోధనలు కుంటుపడ్డాయి. ఓయూ పరిధిలోని ఇతర కాలేజీల్లో పని చేసే కాంట్రాక్టు, పార్టుటైం అధ్యాపకులకు ప్రిన్సిపల్‌ పదవులతో పాటు ఇతర ముఖ్యమైన పదవులను కూడ కట్టపెడుతున్నారు కానీ ఆర్ట్స్‌ కాలేజీలో పని చేసే వారికి కనీసం అదనపు బాధ్యతలు కూడా అప్పగించడం లేదు.

వృథాగా మౌలిక వసతులు..
ఆర్ట్స్‌ కాలేజీలో అనేక విభాగాల తరగతి గదులు, కార్యాలయాలు, అధ్యాపకుల గదులు, సెమినార్‌ లైబ్రరీలు, ఇతర మౌలిక వసతులు వృథాగా ఉంటున్నాయి. ఇంగ్లిష్, ఎకనామిక్స్, పొలిటికల్‌ సైన్స్, చరిత్ర, జర్నలిజం, సైకాలజీ విభాగాలు మినహా ఇతర 20 విభాగాల తరగతి గదులు, ఇతర గదులు ఎవరూ లేక బోసిపోతున్నాయి. ఆర్ట్స్‌ కాలేజీలోని కోట్లాది రూపాయల విలువైన మౌలిక వసతులను ఇతర అవసరాలకు కూడా ఉపయోగించడం లేదు. అండర్‌ గ్రౌండ్‌తో పాటు మరో రెండు అంతస్తులతో ఆర్ట్స్‌ కాలేజీని నిర్మించారు. ప్రస్తుతం  విద్యార్థులు లేని కోర్సులకు అన్ని వసతులున్న ప్రవేశ ద్వారానికి దగ్గరఉన్న గదులను అలాగే కొనసాగిస్తున్నారు. నిత్యం తరగతులు జరిగే ఇంగ్లిష్‌ కోర్సును 2వ అంతస్తు చివర్లో, సైకాలజీ, జర్నలిజం కోర్సులను సెల్లార్‌ గదుల్లో నిర్వహిస్తున్నారు. విద్యార్థులు లేకుండా నిరుపయోగంగా ఉన్న కోర్సులకు ప్రధాన గదులను కేటాయించారు. ప్రాధాన్యమున్న కోర్సులకు తరగతి గదులను సెట్‌ చేయాలని విద్యార్థులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆర్ట్స్‌ కాలేజీ తరగతి గదులను సెట్‌ చేయాలని విద్యార్థులు ఓయూ అధికారులను కోరుతున్నారు.  

ఇతర భాషా కోర్సుల్లో శూన్యం..
ఆర్ట్స్‌ కాలేజీలో అధ్యాపకుల కొరత కారణంగా పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. సంస్కృతం, పర్షియన్, మరాఠి, కన్నడ, ఉర్దూ,  పురావస్తు శాఖ, ఇస్లామిక్‌ స్టడీస్, లింగ్విస్టిక్స్‌ తదితర కోర్సుల్లో విద్యార్థులు చేరడం లేదు. గతంలో ఇతర భాషా కోర్సులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విద్యార్థుల ఆర్థిక సహాయం లభించేది. ఇప్పుడా అవకాశం లేకపోవడంతో ఇతర రాష్ట్రాల భాషా కోర్సుల్లో ఎవరూ చేరడం లేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top