‘రైతుబంధు’పై అమెరికా సంస్థ అధ్యయనం | Sakshi
Sakshi News home page

‘రైతుబంధు’పై అమెరికా సంస్థ అధ్యయనం

Published Thu, Apr 19 2018 1:53 AM

American Institute Study On Rythu Bandhu Scheme - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘రైతుబంధు’పథకం అమలు తీరుపై అమెరికా పరిశోధన సంస్థ అధ్యయనం చేయనుంది. అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన ఆర్థిక విభాగం ఈ బాధ్యతలు చేపట్టనుంది. ఈ అధ్యయనాని కి ‘హై ఫ్రీక్వెన్సీ మానిటరింగ్‌ ఎవాల్యువేషన్‌’అని నామకరణం చేశారు. రైతుబంధు పథకం ప్రారంభమయ్యాక ఈ సంస్థ సర్వే మొ దలు పెడుతుంది. వ్యవసాయ, రెవెన్యూ అధికారుల పనితీరు, వారి సామర్థ్యం అంచనా వేయనుంది. రైతుల అభిప్రాయాలు తీసుకుంటుంది. పథకం వల్ల వారి జీవితాల్లో చోటుచేసుకునే పరిణామాలను తెలుసుకుంటుంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. 

120మండలాల్లో అధ్యయనం.. 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో అధ్యయనం చేపడితే నిష్పక్షపాతంగా ఉండదని భావించి ఒక అంతర్జాతీయ పరిశోధన యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం బాధ్యతలు అప్పగించింది. వచ్చే నెల 10 నుంచి పెట్టుబడి చెక్కులను ప్రభుత్వం రైతులకు ఇవ్వనున్న సంగతి తెలిసిందే. చెక్కుల పంపిణీ సమయంలోనే వర్సిటీ బృందం అధ్యయనం మొదలుపెడుతుంది. అందుకు 120 మండలాలను కంప్యూటర్‌ ద్వారా ర్యాండమ్‌గా గుర్తిస్తుంది. ఆ మండలాల వ్యవసాయ, రెవెన్యూ అధికారుల ఫోన్‌ నంబర్లు, ఇతర వివరాలు తీసుకుంటుంది. ఆయా మండలాలకు చెందిన రైతుల ఫోన్‌ నంబర్లు, పట్టా వివరాలను రెవెన్యూ శాఖ నుంచి సేకరిస్తుంది. పెట్టుబడి చెక్కులు అందాయా.. లేదా.. ఎంత సొమ్ము అందింది.. ఎక్కడైనా అన్యాయం జరిగిందా.. దానికి బాధ్యులెవరు.. తీసుకున్న పెట్టుబడి సొమ్మును ఏ అవసరాలకు ఉపయోగించారు.. తదితర వివరాలను అధ్యయనం చేస్తుంది. అధ్యయనం చేసిన నివేదికలను ప్రతి 10 రోజులకోసారి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తారు. ఈ అధ్యయనం నెల రోజులు జరుగుతుందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. 

కాల్‌ సెంటర్‌ ఏర్పాటు.. 
అమెరికన్‌ పరిశోధన వర్సిటీ ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఆ కాల్‌ సెంటర్‌ నుంచే 120 మండలాలకు చెందిన అధికారులు, రైతులను సంప్రదిస్తుంది. అవసరాన్ని బట్టి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తుంది. ఈ అధ్యయనం చేపట్టడంలో ప్రధాన ఉద్దేశం పథకాన్ని సరిగా అమలుచేసేలా అధికారులపై ఒత్తిడి తేవడమేనని వ్యవసాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. 120 మండలాల్లో పథకం అమలు తీరును పరిశీలించి అధికారుల పనితీరు, సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. పైగా అమెరికా సంస్థ తమ సామర్థ్యాన్ని అంచనా వేస్తుందన్న భయంతో అధికారులు తప్పులు దొర్లకుండా సక్రమంగా చెక్కుల పంపిణీ చేస్తారన్న భావన సర్కారులో ఉందని చెబుతున్నారు. రైతుల నుంచి వచ్చే అభిప్రాయాలను బట్టి పథకంలో తీసుకురావాల్సిన మార్పులను గుర్తిస్తారు. అందుకు తగ్గట్లు రబీలో మార్పులు చేర్పులు చేస్తారు. అధ్యయనం ఎలా చేయాలన్న దానిపై వ్యవసాయ శాఖ కమిషనర్‌ జగన్‌మోహన్‌ బుధవారం అధ్యయన బృందంతో సమావేశమయ్యారు.

Advertisement
Advertisement