అదనపు కట్నం కోసం వేదిస్తున్న భర్తతో పాటు అత్తింటికి చెందిన ఏడుగురిపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.
అర్వపల్లి (నల్గొండ జిల్లా): అదనపు కట్నం కోసం వేదిస్తున్న భర్తతో పాటు అత్తింటికి చెందిన ఏడుగురిపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. నల్గొండ జిల్లా అర్వపల్లి ఎస్‌ఐ ఎ. మోహన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుండాల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గంగాపురం వెంకటేశ్వర్లు అనే పోలీస్ కానిస్టేబుల్ అర్వపల్లి మండలం వర్ధమానుకోటకు చెందిన విజయలక్ష్మిని ఏడాది కిందట వివాహమాడారు. పెళ్లి సమయంలో వరకట్నం కింద రూ. 5 లక్షలు నగదు, తులంన్నర బంగారం, రెండు ఎకరాల భూమి ఇచ్చారు. అయితే 5 నెలలు వారి కుటుంబం సాఫీగా జరిగింది. ఆ తర్వాత విజయలక్ష్మికి కష్టాలు మొదలయ్యాయి.
అదనంగా మరో రూ. 5ల క్షలు కట్నం తేవాలని తరచూ వేదిస్తున్నాడు. అత్తింటి వారి వేదింపులు తాళలేక ఆమె 7నెలల నుంచి తల్లిగారి ఊరైన వర్ధమానుకోటకు వచ్చి ఉంటుంది. పెద్ద మనుషుల వద్ద పంచాయతీ పెట్టినా సమస్య తీరలేదు. చివరకు ఆమె అత్తింటివారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు ఆమె భర్త వెంకటేశ్వర్లు, మావ రాజయ్య, అత్త లక్ష్మి, అత్తింటి తరుపు వారు గంగాపురం సోమన్న, లక్ష్మి, మంజుల, వజ్రమ్మలు ఏడుగురిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. కాగా విజయలక్ష్మి భర్త వెంకటేశ్వర్లు హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.