తెలంగాణలో మరో 21 మందికి కరోనా

21 New Corona Positive Cases In Telangana - Sakshi

గ్రేటర్‌లో 20, జగిత్యాల జిల్లాలో ఒక కేసు నమోదు

రాష్ట్రంలో 1082కి చేరిన పాజిటివ్‌ కేసులు

తాజాగా 46 మంది డిశ్చార్జి

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ఆదివారం కొత్తగా 21 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 20 ఉండగా, జగిత్యాల జిల్లాలో ఒక కేసు నమోదైంది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1082కి చేరుకుందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. తాజాగా 46 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లగా, ఇప్పటివరకు మొత్తం 545 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపారు. 29 మంది కరోనాతో మరణించగా.. మరో 508 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు వరంగల్‌ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాని సంగతి తెలిసిందే. అలాగే గత 14 రోజులుగా ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాని జిల్లాలు 17 ఉన్నాయని బులెటిన్‌లో వెల్లడించారు. వాటిలో కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, భూపాలపల్లి, సంగారెడ్డి, నాగర్‌ కర్నూలు, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, వికారాబాద్, నల్ల గొండ, నారాయణపేట్‌ ఉన్నాయి. చదవండి: ఆసుపత్రులకు లైన్‌ క్లియర్‌

గ్రేటర్‌లో కొనసాగుతున్న కేసులు...
గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గతవారం కేసుల సంఖ్య తగ్గినట్లే కన్పించినా.. మళ్లీ పెరుగుతున్నాయి. ఆదివారం రాష్ట్రంలో 21 కేసులు నమోదు కాగా, అందులో 20 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే. ఇప్పటివరకు నగరంలో మర్కజ్‌ కాంటాక్టు కేసులే ఎక్కువగా వెలుగు చూస్తుండగా.. తాజాగా హైదరాబాద్‌ ఇన్నర్‌ రింగ్‌రోడ్డుకు అటు ఇటుగా ఉన్న బస్తీలు, కాలనీల్లో కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. వారికి ఎక్కడ, ఎవరి నుంచి వైరస్‌ సోకిందనేది ప్రశ్నార్థకంగా మారింది.

కాగా, మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వ్యక్తికి రెండు రోజుల క్రితం కరోనా ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఆయన కుటుంబంలో తొమ్మిది మందిని, పోలీస్‌స్టేష న్‌లో క్రైం సీఐ సహా తొమ్మిది మందిని క్వారంటైన్‌ చేసిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబ సభ్యుల్లో ఏడుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ఆదివారం నిర్ధారణ అయింది. బాధితుల్లో ఓ బాలుడు కూడా ఉన్నట్లు సమాచారం. క్వారంటైన్‌లో ఉన్న మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది నుంచి ఆదివారం ఉదయం నమూనాలు సేకరించారు. వీరి రిపోర్టులు రావాల్సి ఉంది. ఇక జియాగూడ సాయిదుర్గానగర్‌లో ఒకే ఇంట్లో ఉంటున్న ఐదుగురికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.

సగం మందికి పైగా కోలుకున్నారు: ఈటల
రాష్ట్రంలో ఇప్పటివరకు 50 శాతానికి పైగా కరోనా రోగులు కోలుకొని డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర అనారోగ్యాలతో వచ్చిన రోగులకు కూడా గాంధీ వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారని వెల్లడించారు. త్వరలోనే మరింత మంది డిశ్చార్జి అవుతారని పేర్కొన్నారు. పాక్షిక సడలింపుల నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. చదవండి: అక్కొచ్చె.. అన్నం తెచ్చె.. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top