పాలమూరు పచ్చబడాలి | 20 lakh acres will be cultivated in two years says kcr | Sakshi
Sakshi News home page

పాలమూరు పచ్చబడాలి

Nov 11 2017 2:15 AM | Updated on Mar 22 2019 2:57 PM

20 lakh acres will be cultivated in two years says kcr - Sakshi

శుక్రవారం జేపీ దర్గాలోకి చాదర్‌ను తీసుకెళ్తున్న సీఎం, చిత్రంలో మహమూద్‌ అలీ

సాక్షి, రంగారెడ్డి జిల్లా: పాలమూరు ప్రాంతం పచ్చబడాలన్నదే తమ ప్రతిజ్ఞ అని.. వచ్చే రెండేళ్లలో ఇక్కడ 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇందుకోసం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని హజ్రత్‌ జహంగీర్‌పీర్‌ దర్గా (జేపీ దర్గా)ను సీఎం కేసీఆర్‌ సందర్శించారు. డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీతో కలసి చాదర్‌ సమర్పించి మొక్కు చెల్లించారు. న్యాజ్‌ (కందూరు) చేసి.. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులకు విందు ఇచ్చారు.

అనంతరం జేపీ దర్గా అభివృద్ధిపై కలెక్టర్‌ రఘునందన్‌రావు, స్థానిక ఎమ్మెల్యే అంజయ్యలతో చర్చించారు. తర్వాత స్థానిక సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తదితర నాయకులతో ప్రత్యేకంగా మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని వేగంగా పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని పచ్చగా మారుస్తామన్నారు. ‘‘ఈ పథకాన్ని ఆగమేఘాల మీద పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిబద్ధతతో ఉంది. రెండేళ్లలో 20 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తాం. నేను స్వయంగా పర్యటించి పథకం పనులను పరిశీలిస్తా. కానీ కొంతమంది దుర్మార్గులు ప్రాజెక్టు పనులు నడవకుండా కోర్టులకు పోతున్నారు. స్టేలు తెస్తున్నారు. రకరకాల కతలు చేస్తున్నరు. ఏదైనా పాలమూరు పచ్చబడాలనేది మన ప్రతిజ్ఞ. పాలమూరులో 20 లక్షల ఎకరాలు సాగైతేనే తెలంగాణ సాధించుకున్న సార్థకత దక్కుతుంది..’’అని కేసీఆర్‌ పేర్కొన్నారు. 

భక్తులకు తీవ్ర ఇబ్బందులు 
ముఖ్యమంత్రి జేపీ దర్గాకు వస్తున్న సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. శుక్రవారం కావడంతో దర్గాకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. కానీ పోలీసులు ఉదయం ఐదు గంటల నుంచే దర్గా వద్దకు ఎవరినీ అనుమతించలేదు. దుకాణాలన్నింటినీ మూసేయించారు. సీఎం దర్గాలో మొక్కులు చెల్లించి వెళ్లిపోయాక.. సాయంత్రం 4 గంటల సమయంలో దర్గాలోకి అనుమతించారు. దీంతో దర్గాకు వచ్చినవారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి పిల్లలతో తీవ్ర అవస్థలు పడ్డామని వాపోయారు. ఇక విందు ప్రాంగణంలోకి అనుమతించకపోవడంతో పోలీసులకు టీఆర్‌ఎస్‌ నాయకులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరికి స్థానిక సర్పంచ్‌నూ లోనికి వెళ్లనివ్వలేదు. ఇది సీఎం వ్యక్తిగత కార్యక్రమమని... అందుకే ఎవరినీ లోనికి అనుమతించడం లేదని పోలీసులు పేర్కొన్నారు. ఇక విందు ప్రాంగణం వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ మంత్రికి చెందిన వాహనం విధుల్లో ఉన్న బి.రవికుమార్‌ అనే కానిస్టేబుల్‌ను ఢీకొట్టడంతో ఛాతీపై తీవ్రగాయమైంది. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు.   

గొప్పగా తీర్చిదిద్దుతాం
జేపీ దర్గాను దేశంలోనే గొప్ప దర్గాగా తీర్చిదిద్దుతానని గతంలో మొక్కుకున్నట్లు కేసీఆర్‌ చెప్పారు. భక్తుల కోసం దర్గా వద్ద అన్ని సదుపాయాలు కల్పించడంతోపాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. దర్గాకు పలు పద్దుల కింద 27 ఎకరాల భూమి ఉందని.. దాని చుట్టుపక్కల 70 ఎకరాల ప్రభుత్వం భూమి అందుబాటులో ఉందని, మొత్తంగా దాదాపు వంద ఎకరాల్లో దర్గాను అభివృద్ధి చేసేందుకు రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. ఏడాదిలోపు అభివృద్ధి పనులు పూర్తయ్యేలా వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ సలీం, మాజీ డీజీపీ ఏకే ఖాన్‌లు దగ్గరుండి చర్యలు తీసుకుంటారని చెప్పారు. 

షాద్‌నగర్‌కు వరాలు 
షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి పథంలో నడవాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇందులో భాగంగా నియోజక వర్గంలోని 92 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున.. 86 అనుబంధ గ్రామాలు, 127 లంబాడా తండాలకు రూ.5 లక్షల చొప్పున ప్రత్యేక నిధిని విడుదల చేస్తామని ప్రకటించారు. వచ్చే సోమవారం సాయంత్రంలోగా నిధుల ఆర్డర్‌ కాపీని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌కు అప్పగిస్తామని.. ఆ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసుకోవాలని చెప్పారు. కొత్తగా ఏర్పడిన షాద్‌నగర్‌ మున్సిపాలిటీని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. జడ్చర్ల సమీపంలోని ఉద్దండాపూర్, కొందుర్గు మండలంలోని లక్ష్మీదేవునిపల్లిలలో రిజర్వాయర్లు నిర్మించి నీటితో నింపుతామని.. దాంతో షాద్‌నగర్‌ నియోజకవర్గమంతా సస్యశ్యామలం అవుతుందని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement