బండబడ.. ఇదేం ఎండ!

11 Points Reach UV Index in Hyderabad Summer Temperature - Sakshi

11 పాయింట్లకు చేరిన యూవీ ఇండెక్స్‌..

8 పాయింట్లు దాటితే అప్రమత్తత అవసరం

24 గంటలూ రేడియేషన్‌ ప్రభావం..

గ్రీన్‌ బిల్డింగ్స్‌... హరితం పెంచడమే పరిష్కారం..

కోల్‌కతా, బెంగళూరుల్లో యూవీ ఇండెక్స్‌ పది పాయింట్లు

చెన్నై, ముంబై నగరాల్లో 12, ఢిల్లీలో 8.6 పాయింట్లు..

అధిక ఎండలకు తోడు పెరుగుతున్న యూవీ వికిరణ తీవ్రత...

హరితం హననం. శతాబ్దాలుగా తోటల నగరం(భాగ్‌)గా ప్రసిద్ధి చెందిన భాగ్యనగరంలో ఇపుడు హరిత వాతావరణం రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. రహదారులు, బహుళ అంతస్తుల భవంతులు శరవేగంగా విస్తరిస్తుండడంతో పచ్చదనం కనుమరుగవుతోంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం మహానగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) పరిధిలో 30 శాతం గ్రీన్‌బెల్ట్‌ (హరిత వాతావరణం)ఉండాల్సి ఉండగా..నగరంలో కేవలం 8 శాతమే  ఉండడంతో ప్రాణవాయువు తక్కువై సిటీజనులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 

సాక్షి, సిటీబ్యూరో: ‘భాగ్‌’ నగరం ఇప్పుడు భానుడి భగభగలతో నిప్పుల కొలిమిలా మారింది. కాంక్రీట్‌ మహారణ్యంలా మారిన మహానగరంలో ఇప్పుడు అతినీలలోహిత వికిరణం(అల్ట్రావయొలెట్‌ రేడియేషన్‌)తీవ్రత ‘11’ పాయింట్లకు చేరుకోవడంతో సెగ..భగలతో సిటీజనులు విలవిల్లాడుతున్నారు. రేయింబవళ్లు వికిరణ తీవ్రత, అధిక వేడిమి తగ్గకపోవడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సాధారణంగా యూవీ ఇండెక్స్‌ 8 పాయింట్లు దాటితే అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ ప్రస్తుత తరుణంలో 11 పాయింట్లు దాటడంతో సిటీజన్లు కళ్లు, చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. గ్రేటర్‌ విస్తీర్ణంలో హరితం శాతం 8 శాతానికే పరిమితం కావడం, ఊపిరి సలపని రీతిలో నిర్మించిన బహుళ అంతస్తుల కాంక్రీటు, గాజు మేడల నుంచి ఉష్ణం వాతావరణంలో తేలికగా కలవకుండా భూ ఉపరితల వాతావరణానికే పరిమితం కావడంతో ప్రస్తుతం వికిరణ తీవ్రత పెరిగి ఒళ్లు, కళ్లు మండిపోతున్నాయని సిటీజనులు గగ్గోలు పెడుతున్నారు.

యూవీ సెగ..భగలతో అవస్థలివీ...
అతినీలలోహిత వికిరణ తీవ్రత (యూవీ ఇండెక్స్‌)పెరగడంతో ఓజోన్‌ పొర మందం తగ్గి ప్రఛండ భానుడి నుంచి వెలువడే యూవీ రేస్‌ నేరుగా భూ వాతావరణంలోకి చేరుకుంటున్నాయి. దీంతో అధిక సమయం ఎండలో తిరిగితే కళ్లు, చర్మం మండడం, రెటీనా దెబ్బతినడం వంటి విపరిణామాలు తలెత్తుతున్నాయి.  
యూవీ సూచీ 12 పాయింట్లు దాటితే చర్మ క్యాన్సర్‌లు పెరిగే ప్రమాదం పొంచిఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో వికిరణ తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు సన్‌స్క్రీన్‌ లోషన్లు రాసుకోవాలని, చలువ కళ్లద్దాలు, క్యాప్‌లు ధరించాలని, ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు గొడుకు తీసుకెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.

గ్రేటర్‌లో తగ్గుతోన్న హరితం..
మహానగరంలో పచ్చదనం తగ్గుతోంది. గతేడాది హరిత హారంలో భాగంగా 95 శాతం ఇళ్లలో పెంచుకునే కరివేపాకు, తులసి, ఉసిరి, క్రోటన్స్, పూల మొక్కలు పంపిణీ చేశారని..బహిరంగ ప్రదేశాలు, ప్రధాన రహదారులు, పార్కులు, ఖాళీ స్థలాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థల్లో ఏపుగా పెరిగి ఆక్సిజన్‌ శాతాన్ని పెంచే రావి, మద్ది, మర్రి, చింత వంటి మొక్కలు ఇందులో 5 శాతం మాత్రమే నాటినట్లు పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో గ్రేటర్‌లో గ్రీన్‌బెల్ట్‌ 8 శాతానికే పరిమితమైందని వాపోతున్నారు. 

ఇలా చేస్తే మేలు..  
నగరంలో హరిత భవనాలు, హరిత వాతావరణం ఏర్పాటు చేయాలి.
ప్రధాన రహదారులు,  చెరువుల చుట్టూ మొక్కలు నాటి గ్రీన్‌బెల్ట్‌ రూపొందించాలి.
సువిశాల ప్రాంగణాల్లో బహుళ అంతస్తుల భవంతులు నిర్మిస్తున్నవారు విధిగా కొంత విస్తీర్ణంలో మొక్కలు పెంచుతామని, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని డిక్లరేషన్‌ ఇచ్చిన తర్వాతే వారికి జీహెచ్‌ఎంసీ భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలి.
నూతనంగా ఏర్పడిన కాలనీల్లో 30 శాతం గ్రీన్‌బెల్ట్‌ ఉండేలా చూడాలి. 

వాతావరణ శాఖ హైఅలర్ట్‌..
ప్రస్తుతం నగరంలో అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాల్పుల నేపథ్యంలో వాతావరణ శాఖ పలు జాగ్రత్తలు సూచించింది. అవి ఇలా..
అధికంగా మంచినీరు తాగాలి. గుండె జబ్బులు, ఎపిలెప్సి, కిడ్నీ, లివర్‌ జబ్బులున్నవారు జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల సూచనలు తీసుకోవాలి.
వడదెబ్బ బారిన పడకుండా ఓఆర్‌ఎస్, లస్సీ, లెమన్‌ వాటర్, బటర్‌మిల్క్‌ అధికంగా తీసుకోవాలి.
ఎండలో బయటకు వెళ్లే సమయంలో క్యాప్,అంబ్రెల్లా తీసుకెళ్లాలి.
మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి.
అధిక జ్వరం, తలనొప్పి, శ్వాసలో ఇబ్బందులు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్యన ఎండ వేడిమికి గురికాకుండా జాగ్రత్తపడాలి.

ఏసీలు, కూలర్లకు గిరాకీ
నగరంలో వేసవితాపం, వేడిగాలులు, రేడియేషన్‌ తీవ్రత అనూహ్యంగా పెరగడంతో గ్రేటర్‌ సిటీజనులు ఏసీలు, కూలర్ల కొనుగోలుకు ఆయా దుకాణాలకు పరుగులు తీశారు. సోమ, మంగళవారాల్లో పలు ఎలక్ట్రానిక్‌ షోరూంలు అత్యధిక రద్దీతో కిటకిటలాడాయి. ఇప్పటికే ఏసీలు, కూలర్లు వినియోగిస్తున్న వారు సైతం వాటి నిర్వహణ, మరమ్మతుల కోసం టెక్నీషియన్లను ఆశ్రయిస్తున్నారు. సంబంధిత విడిభాగాలను విక్రయిస్తున్న దుకాణాలకు పరుగులు తీశారు. ఇదే అదునుగా వ్యాపారులు వాటిపై 20–30 శాతం అధిక ధరలకు విక్రయిస్తున్నారని వినియోగదారులు వాపోయారు. ధరల నియంత్రణపై ప్రభుత్వం శ్రద్ధచూపాలని కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top