breaking news
-
లోక్‌సభ ఎన్నికలకు ఒంటరిగానే సీపీఎం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుకు దూరంగా ఉన్న సీపీఎం.. లోక్‌సభ ఎన్నికలకు ఒంటరిగానే వెళ్లాని నిర్ణయించుకుంది. బుధవారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. భువనగిరి అభ్యర్థిగా జహంగీర్‌ను ప్రకటించిన సీపీఎం మిగతా స్థానాలకు త్వరలోనే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని తెలిపింది. -
సీపీఐ నారాయణకు ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రమాదానికి గురయ్యారు. ఈ నెల 16వ తేదీన ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన వేదిక ఎక్కబోతుండగా.. జారిపడ్డారు. ఆ తర్వాత అదేం పట్టించుకోకుండా మాములుగానే తన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తర్వాత నొప్పి ఎక్కువ కావడంతో ఆయన వైద్యుల్ని సంప్రదించడంతో ఆయన గాయపడినట్లు తేలింది. నారాయణకు రిబ్ ఎముక విరిగిందని.. రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. -
శ్రీనివాస్ యాదవ్ మౌనం వెనక కారణమేమిటో..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో తనదైన ముద్రతో వ్యవహరించే మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల తరుణంలో పెద్దగా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్లో కేసీఆర్ కుటుంబ సభ్యుల తర్వాత.. ముఖ్యంగా నగర రాజకీయాలకు సంబంధించిన అంశాల్లో అన్నీ తానై వ్యవహరించే తలసాని దూకుడు వైఖరి గతంలో మాదిరిగా కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గానికి సంబంధించినంత వరకు చురుగ్గా ఉన్నారని, స్థానిక సమస్యలు విన్నవించుకోవడానికి ప్రతిరోజూ ఉదయం తన వద్దకు వచ్చే ప్రజలను కలుస్తూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నారని ఆయన అనుయాయులు చెబుతున్నారు. ఎల్ఆర్ఎస్ ఫీజులకు వ్యతిరేకంగా నగరవ్యాప్తంగా జరిగిన ధర్నా తదితర కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నప్పటికీ ఎక్కడో ఏదో వెలితి కనిపిస్తోంది. బహుశా, ప్రత్యర్థి పార్టీలపై గతంలో మాదిరిగా తీవ్ర రాజకీయ విమర్శలు చేయకపోవడం వల్లే అయి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వ్యాఖ్యల ఆంతర్యమేమిటో? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి వారు నగరానికి వచ్చినప్పుడు విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు తానే వెళ్లడం తెలిసిందే. రాజకీయంగా ఎవరిౖపైనెనా వెరవకుండా విమర్శలు, ప్రతివిమర్శలు చేయడాన్ని, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డిపై సైతం గతంలో పరుష వ్యాఖ్యలు చేయడాన్ని నగర ప్రజలు గుర్తు చేస్తున్నారు. గతంలో మాదిరి దూకుడు లేకపోవడం వల్ల కావచ్చు వెలితిగా కనిపిస్తోందని అంటున్న వారూ ఉన్నారు. ప్రస్తుతం తమ పార్టీ అధికారంలో లేనందున అనవసర వివాదాల్లో తలదూర్చరాదనే తలంపుతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే రాజకీయంగా ఎలాంటి విమర్శలు కానీ, ప్రతివిమర్శలు కానీ చేయడం లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారంటీలకు సంబంధించి సైతం ఆయన పెద్దగా విమర్శలు చేయలేదు. పైపెచ్చు పేదలకు ఉపకరించే కార్యక్రమాలు ఎవరు చేసినా తమ మద్దతు ఉంటుందని తన నియోజకవర్గంలో ఆయా కార్యక్రమాల ప్రారంభాల సందర్భంగా పేర్కొనడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికలపైనా.. బీఆర్ఎస్ నుంచే ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరడంతో సికింద్రాబాద్ లోక్‌సభ టికెట్ తలసానికి ఇవ్వనున్నారనే ప్రచారం మొదలైనప్పటికీ ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దానం పార్టీ మార్పు గురించీ ప్రతిస్పందించలేదు. బహుశా తాను కూడా గతంలో పార్టీ మారడం వల్ల అయి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. గత ఎన్నికల్లో ఆయన కొడుకు సాయికిరణ్‌కు టికెట్ కోసం ప్రయత్నించి, సాధించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా ఆయననే రంగంలోకి దింపనున్నారా.. లేక తాను పోటీ చేసే యోచనలో ఉన్నారా అన్నదీ తెలియడం లేదు. అటు పోటీకి సంబంధించి కానీ, ఇటు రాజకీయ వ్యాఖ్యలకు సంబంధించి కానీ తొందరపడకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ తలసాని వ్యవహరిస్తున్న తాజా వైఖరికి కారణమేమిటన్నది మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. -
Cantonment: బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లోకి కీలక నేత
హైదరాబాద్: ఎన్నికల వేళ కంటోన్మెంట్లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఎన్.శ్రీగణేశ్ కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మహేశ్ గౌడ్ సమక్షంలో మంగళవారం ఆయన కాంగ్రెస్ పారీ్టలో చేరారు. కాగా శ్రీగణేశ్ మంగళవారం ఉదయం బీజేపీ లోక్‌సభ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో కలిసి మారేడుపల్లి నెహ్రూనగర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మారి్నంగ్ వాకర్స్తోనూ ముచ్చటించారు. వచ్చే ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి బీజేపీ తరఫున శ్రీగణేశ్ బరిలో ఉంటారని వక్తలు పేర్కొన్నారు. అటు నుంచి శ్రీగణేశ్ నేరుగా పికెట్‌లోని తన కార్యాలయానికి వెళ్లారు. మధ్యాహ్నం మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్ రెడ్డిలు శ్రీగణేశ్‌ను కలిశారు. కాంగ్రెస్‌లోకి రావాల్సిందిగా మైనంపల్లి హన్మంతరావు రెండు రోజులుగా ఆయనతో సంప్రదింపులు జరిపారు. ఇక మంగళవారం నేరుగా కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడించి, కాంగ్రెస్‌లో చేర్పించారు. ఉదయం 11.00 గంటల వరకు బీజేపీ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీగణేశ్ మధ్యాహ్నం 2.00 గంటలకు కాంగ్రెస్‌లో చేరిపోవడం గమనార్హం. -
ఆ రెండూ ఎవరికో?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు గాను 15 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చే యగా..పెండింగ్‌లో ఉన్న వరంగల్, ఖమ్మం అభ్యర్థుల విషయంలో ఇంకా పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు. వరంగల్ ఎంపీ సీటు బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు ఖరారైనట్టు సమాచారం. మరోవైపు ఖమ్మం సీటు కోసం పలువురు ప్రయత్నాలు చేస్తుండగా, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు పేరును నాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మంగళవారం బీజేపీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీతో ఆయన సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు బీఆర్ఎస్కు చెందిన ఓ ఎంపీ ఖమ్మం టికెట్ కోసం ఢిల్లీస్థాయిలో పెద్దెత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో తాను టీడీపీలో ఉన్నందున, ఇప్పుడు ఏపీలో టీడీపీ–బీజేపీల మధ్య పొత్తు దృష్ట్యా, ఖమ్మంలో తనకు టీడీపీ శ్రేణులు సహకరిస్తాయని, తప్పకుండా గెలుస్తానంటూ బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించే ప్రయత్నాల్లో ఆయన నిమగ్నమైనట్టు చెబుతున్నారు. దీంతో ఖమ్మం విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. శానంపూడికి ఖాయమేనా? నల్లగొండ సీటును బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి ఇప్పటికే ప్రకటించారు. కానీ తనకు టికెట్ ఇస్తే అక్కడి నుంచి పోటీ చేసి గెలుస్తానంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఒకరు గట్టిగా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలిసింది. దీనిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థి ని మార్చడం కుదరదని కొందరు అంటుంటే, గెలుపు ఖాయమనుకుంటే అభ్యర్థి ని మార్చేందుకు నాయకత్వం వెనుకాడదని కొందరు అంటున్నారు. 22వ తేదీన జరిగే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించవచ్చునని పార్టీ నేతలు చెబుతున్నారు. 23న అభ్యర్థులతో కిషన్‌రెడ్డి సమావేశం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఈ నెల 23న పార్టీ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. శనివారం నాటి కల్లా 17 స్థానాలకు అభ్యర్థులు ఖరారు అయ్యే అవకాశాలు ఉండడంతో వారితో ఈ భేటీ జరపనున్నట్టు సమాచారం. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలు సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. -
సవాళ్లను అధిగమిస్తూ.. సత్తా చాటేలా
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇంటా బయటా ఎదురవుతున్న వరుస సవాళ్లను అధిగమిస్తూ, లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటే దిశగా పార్టీని నడిపించేందుకు బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. నేతల నిష్క్రమణ, ఎమ్మెల్సీ కవిత అరెస్టు వంటి పరిణామాలు పార్టీలో కలకలం రేపుతున్నప్పటికీ.. కీలకమైన అభ్యర్థుల ఎంపిక, సమన్వయం, ప్రచార షెడ్యూల్ వంటి అంశాలపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. పార్టీ నేతలు, కేడర్‌లో ఆత్మవిశ్వాసం నింపుతూ ఎన్నికలకు సన్నద్ధులను చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బీఎస్పీతో పొత్తు వ్యూహం విఫలమైనా, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా కొత్త ఎత్తుగడలకు శ్రీకారం చుట్టారు. మరో అరడజను లోకసభ స్థానాలకు పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపైనా ముమ్మర కసరత్తు చేస్తున్నారు. వచ్చే నెల మొదటి వారం నుంచి భారీ బహిరంగ సభల నిర్వహణ ద్వారా ఎన్నికల ప్రచార పర్వంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే మిగతా అభ్యర్థుల ప్రకటన రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను ఇప్పటికే 11 స్థానాలకు అభ్యర్థులను కేసీఆర్ ఖరారు చేశారు. 9 మంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీల్లో ఐదుగురు పార్టీని వీడిన నేపథ్యంలో..మిగిలిన ముగ్గురు సిట్టింగ్ ఎంపీలతో పాటు కొత్తగా 8 మంది పోటీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇక పార్టీలో తాజాగా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ నాగర్‌కర్నూలు నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. దీంతో పాటు కీలకంగా భావిస్తున్న సికింద్రాబాద్, భువనగిరి, నల్లగొండ, మెదక్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపైనా కసరత్తు జరుగుతోంది. మెదక్ నుంచి వంటేరు ప్రతాప్‌రెడ్డి, నల్లగొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పేర్లు దాదాపు ఖరారైనట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి కూడా బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే సికింద్రాబాద్, భువనగిరి అభ్యర్థులు ఎవరనే అంశంపై పార్టీ లోపలా బయటా సస్పెన్స్ కొనసాగుతోంది. సీనియర్లకు సమన్వయ బాధ్యతలు తొలుత అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఎన్నికల సన్నద్ధత సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 23న చేవెళ్లలో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభను రద్దు చేసి, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా భేటీలు జరపాలని ఆదేశించారు. చేవెళ్ల లోక్‌సభ స్థానానికి సంబంధించి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సంపూర్ణ సమన్వయ బాధ్యతలు అప్పగించారు. హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్యకు అప్పగించారు. వర్ధన్నపేట నియోజకవర్గ కేడర్‌ను సమన్వయం చేయాల్సిందిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఆదేశించారు. ఆశావహులకు బుజ్జగింపులు లోక్‌సభ టికెట్లు ఆశించి భంగపడిన నేతలను బుజ్జగించే బాధ్యతను స్థానిక నేతలకు కేసీఆర్ అప్పగించారు. ఈ నేపథ్యంలో వరంగల్ టికెట్ ఆశించిన డాక్టర్ నిరంజన్, జోరిక రమేశ్, యాదగిరి, బోడ అనయ్ తదితరులను మంగళవారం వినయభాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు బుజ్జగించారు. త్వరలో కేసీఆర్ లేదా కేటీఆర్ వద్దకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఇదే తరహాలో మహబూబాబాద్, ఆదిలాబాద్, చేవెళ్ల తదితర లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు నష్ట నివారణ చర్యలుజాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ వేస్తున్న ఎన్నికల ఎత్తుగడలు, అనుసరిస్తున్న వ్యూహా లను కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నారు. కొందరు పార్టీ సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలను చేర్చుకుంటూ బీఆర్ఎస్ను బలహీన పరిచేందుకు ఆ రెండు పార్టీలూ చేస్తున్న ప్రయత్నాలపై దృష్టి పెట్టారు. ఎప్పటికప్పుడు నష్ట నివారణ చర్యలు చేపడుతున్నారు. సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడిన నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేయడం ద్వారా కేడర్‌లో అయోమయానికి తెరదించారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్ (వర్ధన్న పేట), సైదిరెడ్డి (హుజూర్నగర్), ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (ఖైరతాబాద్), తెల్లం వెంకటరావు (భద్రాచలం) తదితరులు పార్టీని వీడిన నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. సంబంధిత జిల్లా నేతలకు సమన్వయ బాధ్యతలు అప్పగించారు. స్థానిక కేడర్‌తో బుధవారం నియోజక వర్గ కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. -
కాంగ్రెస్ రెండో జాబితా రెడీ!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి రెండో విడత జాబితా ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు పూర్తి చేసింది. నేతల జనాదరణను పరిగణనలోకి తీసుకుని పేర్లు ఫైనల్ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి ప్రకటనా వెలువడక పోవడంతో.. ఎన్ని స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు, ఎవరెవరికి టికెట్లు లభించాయన్న దానిపై ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎనిమిది చోట్ల అభ్యర్థులు ఫైనల్ అయ్యారని ఏఐసీసీ వర్గాలు చెబుతుండగా, ఆరు స్థానాలు పరిశీలించినా, ఐదుగురు అభ్యర్థుల ఎంపిక మాత్రమే పూర్తయిందనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది. సీఈసీ ఆమోద ముద్ర: ఢిల్లీలో మంగళవారం సాయంత్రం సీఈసీ సమావేశం జరిగింది. తెలంగాణ సహా వివిధ రాష్ట్రాలకు సంబంధించి పలువురు అభ్యర్థులకు ఆమోదముద్ర వేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత సోనియాగాం«దీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మంత్రి ఉత్తమ్ సహా కమిటీ ఇతర సభ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణకు సంబంధించి చర్చ జరిగినప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఆదివారం ముంబైలో జరిగిన రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఖరారు చేసిన జాబితాపై చర్చించారు. 13 మందిని ప్రకటించాలనుకున్నా.. తొలి జాబితాలో జహీరాబాద్, మహబూబాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగిలిన 13 స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై పార్టీ పెద్ద ఎత్తున కసరత్తు జరిపింది. ఏఐసీసీ వర్గాల సమాచారం ప్రకారం..13 మంది అభ్యర్థుల పేర్లను సీఈసీలో చర్చించి ఒకేసారి ప్రకటించాలని భావించారు. అయితే ఐదు లోక్‌సభ స్థానాలకు ఎక్కువమంది ఆశావహులు ఉండడంతో వాటిపై పీటముడి పడింది. దీంతో అవి మినహా మిగిలిన 8 స్థానాలపై చర్చించి ఆమోద ముద్ర వేశారు. చేవెళ్ల నుంచి రంజిత్‌రెడ్డి, మల్కాజ్గిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి మల్లు రవి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఆదిలాబాద్ నుంచి డాక్టర్ సుమలత, కరీంనగర్ నుంచి ప్రవీణ్‌రెడ్డి, వరంగల్ నుంచి పసునూరి దయాకర్‌ల పేర్లు పరిగణనలోకి తీసుకుని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఖమ్మం, సికింద్రాబాద్, భువనగిరి, హైదరాబాద్, మెదక్ స్థానాలపై ఈ నెల 21న మరోసారి జరుగనున్న సీఈసీ భేటీలో చర్చించే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు చెపుతున్నాయి. ఆరు స్థానాలపైనే చర్చ: గాం«దీభవన్ వర్గాలు గాందీభవన్ వర్గాల సమాచారం ప్రకారం.. సీఈసీ భేటీలో ఆరు స్థానాలపైనే చర్చ జరిగింది. అయితే ఐదు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ఖరారు చేశారు. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, చేవెళ్ల నుంచి రంజిత్‌రెడ్డి, మల్కాజ్గిరి నుంచి సునీతా మహేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి మల్లు రవి, ఆదిలాబాద్ నుంచి డా.సుమలతల అభ్యర్థిత్వాలకు సీఈసీ ఆమోదం తెలిపింది. భువనగిరిపై కూడా చర్చ జరిగినా.. టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మిల్లో ఒకరిని ఖరారు చేయాలా? ఇంకెవరికైనా అవకాశం కల్పించాలా? అన్న దానిపై మరోమారు చర్చించాలనే నిర్ణయానికి వచ్చారు. మొత్తం మీద బుధవారం అధికారికంగా జాబితా ప్రకటించే అవకాశం ఉందని, కానిపక్షంలో మరుసటి రోజు విడుదల చేస్తారని చెబుతున్నారు. అయితే 8 స్థానాలకు ప్రకటిస్తారా లేక ఐదుకే పరిమితమవుతారా? అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. -
‘ఫోన్ ట్యాపింగ్ తెలియదు.. వార్ రూమ్ తెలియదు’
హన్మకొండ: తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు నేతలు కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్న నేపథ్యంలో ఎర్రబెల్లి కూడా పార్టీ మారనున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కేసీఆర్ సారథ్యంలో పార్టీ కోసం ఒక సైనికుడిగా పనిచేస్తానని తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం ఓ ఫేక్ అని స్పష్టం చేశారు. మంగళవారం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. ‘నా రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను. ప్రణీత్ రావు ఎవరో కుడా తెలియదు. ఆయన అమ్మమ్మ ఊరు పర్వతగిరి. నా పేరు చెప్పాలని ప్రణీత్‌రావు మీద ఒత్తిడి తెస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ తెలియదు.. వార్ రూమ్ కూడా నాకు తెలియదు. చాలా మంది నాయకులు పార్టీ వీడి పోతున్నారు. బిజినెస్, ల్యాండ్ దందాలు, తప్పుడు పనులు చేసేవారు అధికార పార్టీలోకి పోతున్నారు. కాంగ్రెస్ వంద రోజుల పాలన ఫెయిల్ అయిందని ప్రజలు అనుకుంటున్నారు. ఆరు గ్యారంటిలు అమలు చేయలేరు. ఎన్నికల కోసమే డ్రామా చేశారు. కేసీఆర్ పెట్టిన పథకాలు కూడా అమలు చేయట్లేరు. మాయ మాటలు చెప్పడం, మోసాలు చేయడం సీఎం రేవంత్‌రెడ్డికి అలవాటే. నీళ్లు లేవు.. పంటలు ఎండిపోతున్నాయి. మండే వేసవిలో కూడా చెరువులు నింపిన మహానుభావుడు కేసీఆర్. కార్యకర్తలు ధైర్యంగా ఉండండి, నాయకులు పోయినంత మాత్రాన ఏమీ కాదు. కార్యకర్తలు మీద తప్పుడు కేసులు పెడితే మేము పోలీస్ స్టేషన్లో కూర్చుంటాం. బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుందాం.. గెలుపు, ఓటములు సహజం. ఎన్టీఆర్ లాంటి నాయకునికి కూడా ఓటమి తప్పలేదు’అని ఎర్రబెల్లి అన్నారు. -
AP,TG: చంద్రబాబు ఇళ్ల వద్ద టీడీపీ శ్రేణుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్/గుంటూరు: తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకున్న నివాసాల వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టికెట్ పంచాయితీలతో పలు నియోజకవర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీగా ఆ నివాసాల దగ్గర ఆందోళనకు దిగారు. విజ్ఞప్తి చేసేందుకు వస్తే తమను పార్టీ అధినేతను కలవనీయకుండా అడ్డుకుంటున్నారని నినాదాలు చేస్తున్నారు. ఇటు జూబ్లీహిల్స్ నివాసం.. టీడీపీలో ఆలూరు నియోజకవర్గ టికెట్ పంచాయితీ రాష్ట్రం దాటి హైదరాబాద్‌కు చేరింది. మాజీ ఎమ్మెల్యే, ఆలూరు టీడీపీ ఇంఛార్జి కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నివాసానికి ఆమె అనుచరులు తరలి వచ్చారు. ఆలూరులో పాతికేళ్లుగా టీడీపీ అభ్యర్థులు ఓడిపోతూనే ఉన్నారని.. ఈసారైనా గెలిపించుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తామని వాళ్లు అంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబును కలిసి వినతి పత్రం ఇస్తామని చెప్పగా.. పోలీసులు అందుకు అనుమతించలేదు. దీంతో సుజాతమ్మకు అనుకూల నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. అటు ఉండవల్లి నివాసం వద్ద.. చంద్రబాబు నివాసం వద్ద కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్ భాషా అనుచరుల ఆందోళనకు దిగారు. కదిరి టిక్కెట్ అత్తర్ చాంద్ భాషాకే ఇవ్వాలని పట్టుబట్టారు. ఈపాటికే కదిరి టికెట్‌ను టీడీపీ అధిష్టానం కందికుంట ప్రసాద్ సతీమణి యశోద దేవికి టీడీపీ కేటాయించింది. అయితే.. చాంద్‌భాషా ఐదేళ్లుగా నియోజకవర్గంలో కష్టపడుతున్నారని.. అన్యాయం చేయొద్దని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కదిరి టికెట్ కుదరని పక్షంలో.. హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని చెబుతున్నారు. అయితే టీడీపీ మాత్రం నో అంటోంది. ఈ క్రమంలో.. ఇవాళ ఉండవల్లి నివాసం వద్ద చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ను కదిరి టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. చాంద్భాషాకి టికెట్ ఇస్తే టీడీపీ తప్పక గెలుస్తుందని లోకేష్‌తో కార్యకర్తలు చెప్పగా.. ఎవరు గెలుస్తారో.. ఎవరు ఏం చేశారో మాకు తెలుసు. గొడవలొద్దు. అక్కడ టికెట్ గెలవాలి మీరు వెళ్లి పని చేయండని లోకేష్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో కార్యకర్తలు తమ ఆందోళన కొనసాగిస్తున్నట్లు సమాచారం. -
మళ్లీ బీఆర్ఎస్లోకి క్యూ కట్టాల్సిందే..
గజ్వేల్/సాక్షి, హైదరాబాద్: అధికారం కోల్పోగానే పార్టీ నుంచి వెళ్ళిపోతున్న వారి గురించి ఆలోచించబో మని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌పై ప్రజా వ్యతి రేకత పెరిగి, నాలుగేళ్ల తర్వాత తిరుగుబాటుగా మారి, బీఆర్ఎస్ వంద సీట్లతో మళ్లీ అధికారాన్ని చేపట్టడం ఖాయమని అన్నారు. ప్రస్తుతం పార్టీ మారిన నేతలే తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చేందుకు క్యూ కట్టాల్సిన పరిస్థితి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాంటి వాళ్లను చేర్చుకోవద్దని కొందరు సూచించగా స్పందించిన కేసీఆర్.. మీరంతా నాయకులుగా ఎదిగితే పార్టీ మారిన వ్యక్తులను తిరిగి చేర్చుకునే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తన అనుచరులతో కలిసి సోమవారం రాత్రి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. చంద్రబాబు రైతుల్ని ఇబ్బంది పెట్టారు ‘వంద రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత ప్రారంభమైంది. నేను అకుంఠిత దీక్షతో మిషన్ భగీరథ పథకాన్ని తీసుకువచ్చి ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నల్లా నీటిని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. కానీ ప్రస్తుతం మిషన్ భగీరథ నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో అర్థం కావడం లేదు. కరెంటు సరఫరా పరిస్థితి కూడా అలాగే ఉంది. నాటి ఉమ్మడి పాలనలో తెలంగాణపై కరెంటు సహా అన్ని రంగాల్లో వివక్ష కొనసాగింది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రపంచ బ్యాంకు పిచ్చితో ఆర్థిక సంస్కరణల పేరిట రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేసే చర్యలకు పాల్పడ్డారు. చంద్రబాబుకు ఏమీ తెలియదు. అన్నీ తెలిసినట్లు నటించే వారు. విద్యుత్ కష్టాల నేపథ్యంలో చంద్రబాబును సైతం ఎదిరించా. తెలంగాణ ఉద్యమంలో నేను తిన్న తిట్లు ఎవరూ తినలేదు. నాపై దండకాలు రాసి పత్రికల్లో వేశారు. మరోవైపు రూ.5 వేల కోట్లు, కేంద్ర మంత్రి పదవి ఆఫర్ ఇచ్చి ఉద్యమం నుంచి తప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారు. అయినా ఏనాడూ తెలంగాణ ఉద్యమాన్ని వీడలేదు..’ అని కేసీఆర్ వెల్లడించారు. ఓటమి పార్టీకి మంచిదే.. ‘అగాథంలో ఉన్న తెలంగాణకు బీఆర్ఎస్ పాలనలో ధైర్యం వచ్చింది. ఇప్పుడిప్పుడే గాడిన పడిన ఈ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీ హామీలను నమ్మి అధికారాన్ని అప్పగించారు. కానీ కొద్ది రోజుల్లోనే ప్రజలకు కాంగ్రెస్ పాలన అర్థమైంది. బీఆర్ఎస్ ఒక్కసారి ఓడిపోవాలని నేను కూడా భావించా. ఈ ఓటమి పార్టీకి మంచే చేస్తుంది. ఒక్కసారి ఓడితే నష్టమేమీలేదు. గాడిద వెంబడి పోతేనే కదా... గుర్రం విలువ తెలిసేది. దళితశక్తితో పాటు బహుజన శక్తి కలిసి నడవాలి దళితబంధు వల్ల ఓడిపోయామనే భావన ఎన్నికల ఫలితాల సమీక్ష తర్వాత బయటకు వచ్చింది. దళిత వర్గాలకు ఎలాంటి బ్యాంకు ష్యూరిటీలు లేకుండా రూ.10 లక్షల చొప్పున అందజేసి ఆ కుటుంబాల్లో వెలుగులు నింపడం తప్పా? దళిత సమాజం దీనిని సానుకూలంగా ఎందుకు తీసుకోలేకపోయిందో విశ్లేషించాల్సిన అవసరముంది. దళితశక్తితో పాటు బహుజన శక్తి కలిసి నడవాలి. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా సచివాలయానికి అంబేడ్కర్ పేరును పెట్టడమేగాకుండా భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం..’ అని కేసీఆర్ తెలిపారు. ప్రవీణ్‌కుమార్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటిస్తాం ‘ప్రవీణ్‌కుమార్ నిబద్ధత కలిగిన నాయకుడు. ఆయనను బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా త్వరలోనే ప్రకటిస్తాం. భవిష్యత్‌లోనూ ప్రవీణ్‌కుమార్ ఉన్నత స్థానంలో ఉంటారు. ప్రవీణ్‌తో కలిసి దళిత శక్తిని ఏకం చేసేందుకు, బలహీన వర్గాలను ఏకతాటి మీదకు తెచేందుకు ఎజెండా తయారు చేయాల్సిన అవసరముంది. ఈ విధానం దేశానికే టార్చ్ బేరర్‌గా మారాలి..’ అని బీఆర్ఎస్ అధినేత పేర్కొన్నారు. అలాగైతే ప్రతిపక్ష పార్టీలో ఎందుకు చేరతా: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలంగాణ వాదం, బహుజన వాదం వేర్వేరు కాదని ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ చెప్పారు. వివక్షకు, అణిచివేతకు వ్యతిరేకంగా ఈ రెండు ఉద్యమాలు పుట్టుకొచ్చాయని తెలిపారు. తాను ప్యాకేజీ తీసుకుని బీఆర్ఎస్లో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్యాకేజీ తీసుకునే వ్యక్తినే అయితే ప్రతిపక్ష పార్టీలో ఎందుకు చేరతానని ప్రశ్నించారు. రేవంత్ బెదిరింపులు మానుకోండి ‘సీఎం రేవంత్‌రెడ్డి నన్ను పొగుడుతూనే సుతిమెత్తగా వార్నింగ్‌లు ఇస్తున్నారు. నేనూ పాలమూరు బిడ్డనే, నడిగడ్డ తిండి తిన్నవాడినే. మీ దారికి రాని వారికి బెదిరింపులు మానుకోండి. వార్నింగులు ఇచ్చి మీ హోదాను తగ్గించుకోవద్దు..’ అని ప్రవీణ్ కుమార్ సూచించారు. ఫామ్‌హౌస్‌కు వెళ్లేముందు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి చేపట్టాల్సిందిగా నన్ను సీఎం రేవంత్ ఆహ్వానిస్తే నేను తిరస్కరించిన మాట నిజమే. ప్రజాక్షేత్రంలో ఉండాలనుకుని ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించా. అయితే నేను బీఆర్ఎస్లోకి వెళ్తే సమాధానం చెప్పాలని రేవంత్ అంటున్నారు. అయితే ఏ వేదిక మీద పనిచేయాలో చెప్పే స్వేఛ్చ తెలంగాణ ప్రజలకు లేదా. మీరు గేట్లు తెరిస్తే పిరికిపందలు, అసమర్థులు, స్వార్ధపరులు గొర్రెల మందలా వస్తున్నారు. కానీ నిజాయితీ కలిగిన నేను ఆ గొర్రెల మందలో ఒకడిని కాలేను. నేను ప్యాకేజీ తీసుకునే వాడినే అయితే రేవంత్ గేటు వద్ద ఉండే వాడిని. నేను దొంగ ఆస్తులు రక్షించుకునేందుకు వచ్చే పిరికిపందను కాను. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవ కోసం వచ్చా’ అని ప్రవీణ్‌కుమార్ చెప్పారు. కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారు ‘తరతరాల అణచివేతకు గురైన తెలంగాణకు విముక్తి కల్పించి వెలుగు వైపు నడిపించింది కేసీఆర్. ఆయన దురదృష్టవశాత్తూ అధికారంలో లేకున్నా ప్రజల గుండెల్లో ఉన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు అయ్యేందుకు బహుజన వాదులు కేసీఆర్ వెంట నడవాలని అనుకుంటున్నారు..’ అని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. చిన్నారికి శ్రీయా ఫూలేగా నామకరణం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకురాలు అకినేపల్లి శిరీష–ప్రవీణ్ దంపతుల ద్వితీయ కుమార్తెకు శ్రీయా ఫూలేగా కేసీఆర్ నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
దోపిడీ దొంగల్ని వదలం: ప్రధాని మోదీ
సాక్షి ప్రతినిధి ,కరీంనగర్: ‘తెలంగాణను దోచుకున్న వారెవరైనా సరే వదిలేది లేదు. ఇది నరేంద్ర మోదీ ఇస్తున్న గ్యారంటీ. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ అవినీతి పార్టీలే. ఇద్దరూ తోడు దొంగలే. కాబట్టి తెరవెనుక స్నేహాలతో పరస్పరం సహకరించుకుంటున్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌కు ఏటీఎంలా మారింది. ఇక్కడి డబ్బును ఢిల్లీ పెద్దలకు పంపుతున్నారు. కుంభకోణాల కోసం పనిచేసే కుటుంబ పార్టీల్లా కాకుండా, దేశ ప్రయోజనాల కోసమే పనిచేసే బీజేపీని ఆశీర్వదించండి. అబ్కీ బార్.. 400 పార్. తెలంగాణ కోసం అనేక పనులు చేశాం, వచ్చే సర్కారులో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తాం..’ అని ప్రధాని మోదీ చెప్పారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయం మైదానంలో నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. శక్తి ఆశీర్వాదం ఎవరికో జూన్ 4న తెలుస్తుంది ‘మే 13న తెలంగాణ ఓటర్లు సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ను బీజేపీ చిత్తు చేస్తుంది. తెలంగాణలో బీజేపీకి రోజురోజుకూ ఆదరణ పెరిగిపోతోంది. రాష్ట్రంలో ఇటీవల రూ.56 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించాం. జూన్ 4న 400 ఎంపీ సీట్లు దాటేస్తాం అని దేశమంతా అంటోంది. వికసిత్ తెలంగాణ, వికసిత్ భారత్ కోసం, పేదల అభ్యున్నతి, రైతుల సంక్షేమం, యువతకు అవకాశాలు, మహిళా అభివృద్ధి, ఆత్మ నిర్భర్ భారత్ కోసం, దేశం మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా అవతరించేందుకు.. ‘‘400 ఎంపీ సీట్లు దాటాలి.. బీజేపీకి ఓటు వేయాలి’’ (అని తెలుగులో పిలుపునిచ్చారు). తెలంగాణ ప్రజలు ‘‘అబ్ కీ బార్.. చార్ సౌ పార్’’ అని నినదిస్తున్నారు. శక్తిని వినాశనం చేసేవాళ్లకు.. శక్తిని పూజించే వాళ్లకు మధ్య పోరాటం జరుగుతోంది. శక్తిని ఖతమ్ చేస్తానన్న రాహుల్ గాంధీ ఛాలెంజ్‌ను నేను స్వీకరిస్తున్నా. శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ 4 న తెలుస్తుంది..’ అని ప్రధాని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ తెరవెనుక స్నేహితులే ‘తెలంగాణ.. ఆంగ్లేయులు, రజాకార్లతో పోరాడిన నేల. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను దోచుకుంది. ఒక దోపిడీదారు.. మరో దోపిడీదారుపై పోరాడలేరు. అందుకే బీఆర్ఎస్ దోపిడీపై కాంగ్రెస్ మౌనం వహిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరూ తెరవెనుక స్నేహితులే. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ పని అయిపోతుంది. తెలంగాణ కలలను కాంగ్రెస్, బీఆర్ఎస్లు నాశనం చేశాయి. ముఖ్యంగా ప్రజల భావోద్వేగాలతో బీఆర్ఎస్ చెలగాటమాడింది. ఇక అధికారంలోకి రాకముందు అనేక మాటలు మాట్లాడిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం సహా దేనిపైనా విచారణ చేయడం లేదు. హామీలు అమలు చేయని కాంగ్రెస్‌ను బీఆర్ఎస్ పార్టీ నిలదీయడం లేదు. వీరిద్దరి అవినీతిపై విచారణ చేపడదామనుకుంటే.. రెండు పార్టీలు రాత్రీ పగలు మోదీని నిందించడమే పనిగా పెట్టుకుంటున్నాయి. మా పాలనలో దేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. తెలంగాణ అభివృద్ధి కోసం రూ.6,400 కోట్లతో రామగుండం ఎరువులు ఫ్యాక్టరీని పునరుద్ధరించాం. జాతీయ రహదారులిచ్చాం. పసుపు ధరను క్వింటాల్‌కు రూ.6 వేల నుంచి రూ.30 వేలకు పెంచాం. ఇక్కడి గత ప్రభుత్వాలు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేకపోయాయి. మేం మళ్లీ అధికారంలోకి రాగానే వచ్చే పదేళ్లలో తెలంగాణలో రైలు, రోడ్డు తదితర మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేస్తాం..’ అని మోదీ హామీ ఇచ్చారు. 17 సీట్లు గెలిపించాలి: కిషన్‌రెడ్డి కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. మోదీ ప్రజలకు సుస్థిరమైన, నీతివంతమైన పరిపాలన అందిస్తున్నారని చెప్పారు. తొమ్మిదిన్నరేళ్లలో దేశం అన్ని రంగాల్లో పురోగమించిందని, మన రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్లు నిధులు ఇచ్చారని అన్నారు. పదేళ్లలో కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుందని, ఆయన కూతురు కవిత లిక్కర్ దందా చేశారని, తెలంగాణ సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా మోసం చేసిందని విమర్శించారు. మోదీ తాను తెలుగు నేర్చుకోవడమే కాకుండా తెలుగు భాషను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. మోదీ ప్రసంగాలను తెలుగులో వినేలా ట్విట్టర్లో ‘నమో ఇన్ తెలుగు’ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో 17కు 17 సీట్లు గెలిపించాలని కోరారు. ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి స్కాం వెనుక కుటుంబ పార్టీలు.. ‘దేశంలో ఎక్కడ కుంభకోణం జరిగినా దాని వెనుక కుటుంబ పార్టీలే ఉన్నాయి. 2జీ స్పెక్ట్రమ్ (డీఎంకే), నేషనల్ హెరాల్డ్ (కాంగ్రెస్), బోఫోర్స్ (కాంగ్రెస్), కొలువుల స్కాం (ఆర్జేడీ) తదితరాలు ఇందుకు నిదర్శనం. తాజాగా ఆ జాబి తాలో బీఆర్ఎస్ కూడా చేరింది. కుటుంబ పార్టీ బీఆర్ఎస్ కాళేశ్వరంలో అవినీతికి పాల్పడింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలోనూ బీఆర్ఎస్ నేతల పాత్ర ఉంది. కుటుంబ పార్టీలు దేశాన్ని దోచుకోవాలని చూస్తాయి. కానీ బీజేపీకి ప్రజా ప్రయోజనాలే ముఖ్యం. అందుకే, జూన్ 4న ఎన్డీయేకు 400 సీట్లు దాటాలి. బండి సంజయ్, ధర్మపురి అరవింద్, గోమాస శ్రీనివాస్‌లను గెలిపించాలి..’ అని ప్రధాని విజ్ఞప్తి చేశారు. -
కాంగ్రెస్‌లోకి జితేందర్ రెడ్డి.. రఘునందన్‌రావు సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కాంగ్రెస్ పార్టీలోని చేరిన జితేందర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి కంపెనీల బాగోతం బయటపెడుతామని బీజేపీ నేత, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందర్రావు అన్నారు. బీజేపీకి సిద్ధాంతం లేదని కొందరు పార్టీ మారినవారు అంటున్నారని, ఆయన కొడుక్కి సీటు ఇస్తే సిద్ధాంతం ఉన్నట్లు.. లేదంటే లేనట్లా? అని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘పార్టీలోకి రాగానే జాతీయ కార్యవర్గ సభ్యుడి సీటిచ్చి కూర్చోబెడితే బీజేపీ సిద్ధాంతం మంచింది.. లేకుంటే మంచిది కాదు. ఎంపీ సీటు దక్కకుంటే సిద్ధాంతాలు లేని పార్టీనా?. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పార్టీకి క్షమాపణలు చెప్పాలి. బీజేపీ తప్ప.. ఏ పార్టీకి సిద్ధాంతం లేదు. మీరు సిద్ధాంతాల గురించి మాట్లాడటం బాధాకరం. ఏ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు ఆశించి, ఏ కంపెనీ, ఏ కన్స్ట్రక్షన్ కంపెనీలో మీ బంధువుల ప్రయోజనాల కోసం పార్టీ మారి పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారేందుకు రంగం సిద్ధం చేశారు. బీజేపీపై ఈ వ్యాఖ్యలు పొరపాటున వ్యాఖ్యానించారని భావిస్తున్నా. చేవెళ్ల ఎంపీతో ఉన్న వ్యాపార లావాదేదీలేంటి?. మీరిద్దరూ కలిసి కాంగ్రెస్‌లో చేరి మల్కాజ్ గిరి, చేవెళ్ల, మెదక్, జహీరాబాద్ పార్లమెంట్లకు ఎంత ఖర్చు పెడాతారని చెప్పారు. మా పార్టీలో చాలారోజులు మాతో కలిసి పనిచేశారు కాబట్టి నేను వ్యక్తిగత దూషణలకు దిగడంలేదు. ఈస్ట్రన్, వెస్ట్రన్, సదరన్ కన్స్ట్రక్షన్, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలేవి?. సర్వే నంబర్ 343లో ఉన్న ప్రభుత్వ భూమిఎంత? ఎన్నిఫ్లోర్లు ఇవ్వాలి? ఎన్ని ఇచ్చారు?. కడితే ఎంత ఖర్చవుతుంది.. అమ్మితే ఎంత వస్తుంది?. గత ప్రభత్వ హయాంలో ఏం చేశారు.. ఈ ప్రభుత్వంలో డబ్బులు ఎలా చేతులు మారుతున్నాయి. అసలు ఏరకంగా మీరిద్దరూ కలసి ఎన్నికలకు కమర్షియల్ చేయాలనుకున్నారు. బీఆర్ఎస్ ఎంపీలుగా గెలిచిన ఎంపీలందరిలో ఎక్కువ లబ్ధి పొందింది వారే. భూమికి భూమి ఎక్కడా ఇవ్వలేదు.. కానీ ఆయనకు మాత్రం ఇచ్చారు. 25 ఫ్లోర్లకు అనుమతులిస్తే.. 33 ఫ్లోర్లు అయ్యాయి. పీసీసీ హోదాలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గతంలో గుట్టలు కొడతారా? గుడులు మింగుతారా? ఏఐసీసీకి లేఖ రాస్తామని? చర్యలు తీసుకుంటామని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇలా జరిగేది కాదని అన్నారు. మరి ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేస్తున్నట్లు? జితేందర్ రెడ్డి,రంజిత్ రెడ్డి పార్టీ మారడం వెనుక జరిగిన ఆర్థిక ప్రయోజనాలు ఏంటి? కంపెనీల ప్రయోజనాలు ఏంటి?. ఎన్నికలకు మీరు పంపిచే డబ్బుకు సంబంధించి పూర్తి సమాచారం మాకు వచ్చింది. ఏ కంపెనీ నుంచి ఎంత వస్తోందనే వివరాలు ప్రజల ముందు ఉంచుతాం. అసెంబ్లీ ఎన్నికల్లో రెండో జాబితాలో కేవలం జితేందర్ రెడ్డి కుమారుడి ఒక్కరి పేరే వచ్చింది. అప్పుడు పార్టీకి సిద్ధాంతం ఉంది.. ఇప్పుడు లేదా?. షేక్‌పేటలోని సర్వే నంబర్ 403ఒక సంచలనం. అందులో ఎలా బ్లాస్టింగ్స్ అవుతున్నాయి.. వందల కోట్ల రూపాయలు ఎలా చేతులు మారాయనే అంశాలపై విచారణ జరగాలి. వారు చేసే అడ్డగోలు దందాపై ఈడీ, ఐటీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాను. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా జితేందర్‌రెడ్డి వెంట్రుక కూడా కొనలేరని వ్యాఖ్యానించారు. మరి ఇప్పుడు వందల కోట్లు చేతులు మారుతున్నాయి. ఇప్పుడున్న స్పీకర్ గతంలో ప్రెస్‌మీట్ పెట్టి బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి రూ.500 కోట్ల స్కామ్‌లో ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపణలు చేశారు. ఈ ఇద్దరి ఆర్థిక నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వారు పంపించే డబ్బు సంచులతోనూ అప్రమత్తంగా ఉండాలి’ అని రఘునందన్ రావు అన్నారు. -
ఢిల్లీలో సీఎం రేవంత్.. సోనియా గాంధీతో భేటీ.. కీలక చర్చ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో రేవంత్ భేటీ అయ్యారు. రేవంత్ వెంట రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ దీపా మున్షి కూడా ఉన్నారు. తెలంగాణలోని రాజకీయ పరిణామాలపై సోనియాకు రేవంత్ వివరించినట్లు తెలుస్తోంది. లోక్‌సభ అభ్యర్ధుల ఎంపికపైనా చర్చించినట్లు సమాచారం. ఎన్నికల వ్యూహాలు, పార్టీ ప్రచార సభలపై చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సోనియా, రాహుల్, ప్రియాంక ప్రచార సభలపై చర్చించిన రేవంత్.. తెలంగాణలో వందరోజుల పాలనపై అధిష్టానానికి వివరించినట్లు తెలుస్తోంది. టీవల కాంగ్రెస్‌లో చేరిన వారికి టికెట్లు ఖరారు అంశంపై చర్చించినట్లు వినికిడి. రేపు(మంగళవారం) కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది. ఈ సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనున్నీ సమాఏశంలో ఎన్నికల మేనిఫెస్టోతో పాటు..దేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. కాంగ్రెస్ తరపున పోటీ చేయనున్న లోక్ సభ అభ్యర్ధులను ఖరారు.. వివిధ రాష్ట్రాల్లో భాగస్వామ్య పార్టీలతో సీట్ల సర్దుబాటుపై కుదిరిన ఒప్పందాలకు ఆమోద ముద్ర వేసే అవకాశముంది. ఇక రేపు కాంగ్రెస్ జాబితా రానుండటంతో రేవంత్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. చదవండి: -
బీఆర్ఎస్లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఎర్రవల్లిలో ఉన్న ఫామ్‌హౌస్‌లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు సమక్షంలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఆర్ఎస్లో చేరారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి కేసీఅర్ పార్టీలోకి ఆహ్వానించారు. అంతకు ముందు.. తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. గజ్వేల్‌లోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌కు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో తెలంగాణ విశాల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్లో చేరుతున్నానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ గేట్లు తెరిస్తే వెళ్లిన గొర్రెల్లాగా వచ్చిన వ్యక్తిని కాదని ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గజ్వేల్‌లోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌కు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ‘నిజాయితీకి కట్టుబడి ఉన్నా. ఓ వైపు మంచివాడు అంటూ నన్ను రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. స్వార్దం కోసం ఎన్ని కోట్లు తీసుకొని వెళ్తున్నావు అంటూ సోషల్ మీడియాలో అడుగుతున్నారు.డబ్బు కోసం ఆశపడిన వాడిని అయితే కాంగ్రెస్‌లో చేరుతా. బీఆర్ఎస్ కాదు. టీఎస్పీఎస్సీ చైర్మర్ ఆఫర్ ఇస్తే.. తిరస్కరించా. నా గుండెల్లో ఎప్పుడూ బహుజన వాదం ఉంటుంది. నేనెప్పుడూ బహుజనులు సంక్షేమం కోసమే పోరాడుతా. రేవంత్ రెడ్డే కాదు నేను కూడా పాలమూరు బిడ్డనే’ అని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇక.. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌కు బయలుదేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇతర టీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుచరులు అభిమానులు ఉన్నారు. -
తెలంగాణకు కొత్త గవర్నర్.. నేటి సాయంత్రానికి ప్రకటన?
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరారాజన్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం కొత్త గవర్నర్‌ను నియమించనుంది. ఈరోజు సాయంత్రంలోగా కొత్త గవర్నర్ పేరును ప్రకటించే అవకాశం ఉంది. కాగా, గవర్నర్ తమిళిసై రాజీనామాతో రాష్ట్రానికి కేంద్రం కొత్త గవర్నర్‌ను నియమించనుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు సాయంత్రంలోగా రాష్ట్రానికి కొత్త గవర్నర్ పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఇక, తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టనున్నారు. తమిళనాడులోని ఏదో ఒక పార్లమెంట్ నియోజవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేయనున్నారు. -
జగిత్యాల గడ్డ మీద ప్రధాని మోదీ
సాక్షి, జగిత్యాల: తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పని అయిపోతుందన్నారు ప్రధాని మోదీ. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోందని చెప్పుకొచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. కాగా, జగిత్యాలలో బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ..‘మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. వికసిత్ భారత్ కోసం తెలంగాణ ప్రజలు ఓటు వేయబోతున్నారు. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోంది. మాల్కాజ్గిరిలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ ప్రజలు అబ్ కీ బార్.. 400 పార్ అంటున్నారు. మొన్ననే లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. గడిచిన మూడు రోజుల్లో రెండు సార్లు తెలంగాణకు వచ్చాను. దేశంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం. భారత్ అభివృద్ధి చెందితే తెలంగాణలో కూడా అభివృద్ధి జరుగుతుంది. బీఆర్ఎస్పై ప్రజలకు ఉన్న ఆగ్రహం అసెంబ్లీ ఎన్నికల్లో బయటపడింది. తెలంగాణను దోచుకున్న వాళ్లను మేము వదిలిపెట్టం. మాకు అధికారం కంటే ప్రజా సంక్షేమం ముఖ్యం. తెలంగాణలో ఎన్నో వేల కోట్ల రూపాయాలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. తెలంగాణలో బీజేపీ అధికారంలో ఉంటే.. రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు ఎక్కువ వస్తే.. నాకు అంత శక్తి వస్తుంది. పసుపు రైతులను బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎప్పుడూ పట్టించుకోలేదు. బీజేపీ ప్రభుత్వం పసుపు రైతులకు ఎంతో మేలు చేసింది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ పని అయిపోతుంది. పదేళ్లపాటు బీఆర్ఎస్ తెలంగాణను దోచుకుంది. తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో బీఆర్ఎస్ ఆడుకుంటోంది. ఇప్పుడు కాంగ్రెస్.. తెలంగాణను ఏటీఎంలా మార్చుకుంటోంది. బీఆర్ఎస్పై అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు ఆ ఫైల్స్‌ను పక్కన పెడుతోంది. కాళేశ్వరం అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మకయ్యాయి. లిక్కర్ స్కామ్‌లోనూ బీఆర్ఎస్ కమీషన్లు తీసుకుంది. బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ దర్యాప్తు చేయడం లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు నన్ను దూషించడమే పనిగా పెట్టుకున్నాయి. కాళేశ్వరంలో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడింది. ఇక్కడ దోచిన డబ్బును కుట్రలకు వాడుతున్నారు. తెలంగాణ నుంచి డబ్బులు ఢిల్లీలో కుటుంబ పార్టీ పెద్దలకు వెళ్తున్నాయి. దేశంలో జరిగిన స్కామ్‌లన్నింటికీ కుటుంబ పార్టీలే కారణం. శివాజీ మైదానంలో రాహుల్ గాంధీ.. తన పోరాటం శక్తికి వ్యతిరేకం అని చెప్పారు. శక్తిని వినాశనం చేసేవాళ్లకు.. శక్తికి పూజ చేసే వాళ్లకు మధ్య పోరాటం జరగబోతుంది. నాకు ప్రతీ మహిళా.. ఒక శక్తి స్వరూపంలా కనిపిస్తుంది. శక్తిని ఖతమ్ చేస్తామన్న రాహుల్ గాంధీ ఛాలెంజ్‌ను నేను స్వీకరిస్తున్నాను. చంద్రయాన్ విజయవంతమైన ప్రాంతానికి కూడా శివశక్తి అని పేరు పెట్టాను. శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో.. జూన్ నాలుగో తేదీన తెలుస్తుంది. నేను భారతమాతకు పూజారిని’ అంటూ కామెంట్స్ చేశారు. ప్రధాని మోడీ @ జగిత్యాల సభ నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య పండుగ మొదలైంది తెలంగాణ ప్రజలు కొత్త ఇతిహాసాన్ని లిఖించేందుకు సిద్ధమయ్యారు వికసిత భారత్ లో భాగంగా దేశం అభివృద్ధి చెందితే.. తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుంది నేను గత మూడ్రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణకు మరోసారి వచ్చాను ఆదిలాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాం తెలంగాణలోని ప్రతి మారుమూల ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో అభివృద్ధి పనులు చేపట్టాం తెలంగాణలో బీజేపీని గెలిపించి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ను సాఫ్ చేయండి 4 జూన్ కో.. 400 పార్.. బీజేపీకి ఓటు వేయాలని తెలుగులో కోరిన ప్రధాని నా ముందు శక్తి స్వరూపులైన వేషధారణలో ఉన్న చిన్నారి ఉంది.. ఆమెతో పాటు ఇంతమంది శక్తి స్వరూపులైన మహిళలు నన్ను ఆశీర్వదించేందుకు వచ్చారు నిన్న ముంబైలో ఇండి అలయన్స్ ర్యాలీ జరిగింది ఆ ర్యాలీలో మేనిఫెస్టో రిలీజ్ చేశారు వారు శక్తిని ఖతం చేయడానికి యుద్ధం చేస్తున్నారు కానీ నాకు శక్తి స్వరూపులైన మహిళలంతా అండగా ఉన్నారు నేను శక్తి స్వరూపులైన మిమ్మల్ని పూజిస్తాను భారత మాతకు, శక్తి స్వరూపులైన మహిళలకు పూజారిని ఈ ఎన్నికల్లో ఇండి అలయన్స్ శక్తిపై చేస్తున్న యుద్ధాన్ని స్వీకరిస్తున్నాను ఈ యుద్ధంలో నేను మీకోసం ప్రాణాలర్పించేందుకైనా సిద్ధమే.. భారత గడ్డపై శక్తిని వినాశనం చేస్తానని మాట్లాడుతున్నారు యావత్ దేశం శక్తిని పూజిస్తాం శివశక్తి పేరుతో చంద్రయాన్ సక్సెస్ చేసుకున్నాం శక్తిని వినాశనం చేసే అవకాశం వారికిద్దామా? శక్తిని విచ్ఛిన్నం చేసే వారు విచ్ఛిన్నం కావాలా? వద్దా? ఈ యుద్ధంలో శక్తిని పూజ చేసే వారు ఒక వైపు.. శక్తిని విచ్ఛిన్నం చేసేవారు ఒకవైపు ఈ యుద్ధంలో గెలుపెవరిదో జూన్ 4వ తేదీన తేలనుంది తెలంగాణ పుడమి సాధారణమైనది కాదు ఆంగ్లేయులు, రజాకార్ల అత్యాచారాలపై పోరాడిన గడ్డ తెలంగాణ కలలను కల్లలు చేసింది కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది బీఆర్ఎస్.. రాష్ట్రాన్ని దోచుకుంది ఇప్పుడు కాంగ్రెస్.. తెలంగాణను ఏటీఎంలా మార్చుకుంది ఇక్కడి ప్రజలు డబ్బులు ఢిల్లీకి చేరుతున్నాయి కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలకు చేరుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పై అవినీతి ఆరోపణలు చేసింది.. కానీ ఇప్పుడు అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ నోరు మెదపడం లేదు కాళేశ్వరం అవినీతిపై ఎవరూ ప్రశ్నించడంలేదు ఎన్నో గ్యారెంటీలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వాటిని అమలుచేయడం లేదు దీనిపై బీఆర్ఎస్ కూడా నోరుమెదపడం లేదు ఈరెండు పార్టీలు ఒకరినొకరు కాపాడుకుంటున్నాయి ఈ రెండు పార్టీలకు మోడీని తిట్టడం తప్పితే వేరే పనిలేదు ఈ పార్టీల నాయకులు ఎన్నడైనా భారత్ మాతా కీ జై అనడం వినిపించిందా? ఈ రెండు పార్టీలు ఎన్ని కవర్ ఫైర్లు చేసినా మేం బయటకుతీస్తాం తెలంగాణను దోచుకున్న వారిని విడిచిపెట్టం.. ఇది మోడీ గ్యారెంటీ కుటుంబ పార్టీలు కేవలం దేశాన్ని దోచుకునేందుకు రాజకీయం చేస్తాయి, అభివృద్ధి కోసం పనిచేయవు దేశంలో అవినీతి ఎక్కడ జరిగినా దాని వెనుక కుటుంబ పార్టీ హస్తం ఉంటుంది నేను దీనిపై మీడియా వారికి కూడా హోంవర్క్ ఇస్తున్నా.. కావాలంటే చూసుకోవచ్చు 2జీ స్కామ్, బోఫోర్స్, నేషనల్ హెరాల్డ్ కేసులో ఎవరి పేర్లొచ్చాయి? ఇలాంటి అవినీతే.. తెలంగాణలోనూ జరిగింది కాళేశ్వరం అవినీతితో పాటు లిక్కర్ స్కామ్ తో ఢిల్లీ వరకు వచ్చి కమీషన్లు తిన్నారు కాంగ్రెస్.. అయినా.. బీఆర్ఎస్ అయినా.. వారికి దూరంగా ఉండటమే మనకు మెడిసిన్. అందుకే బీజేపీని గెలిపించాలి శక్తిని వచ్ఛిన్నం చేసే వారిని విచ్ఛిన్నం చేసేందుకు నాకు మీ ఆశీర్వాదాలతో శక్తినివ్వండి కుర్చీతో సంబంధం లేకుండా మీ బాగు కోసం నేనుంటా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పై కోపంతో ఎలాగైనా ఆ పార్టీని ఓడించాలనుకున్నారు.. ఓడించారు కానీ ఈసారి జరిగేవి కేంద్రంలో మరోసారి మోడీ సర్కారును తెచ్చేది అందుకే బీజేపీకి ఓటు వేయండి 2014కు ముదు వరకు ఇతర పార్టీలు చేసిన అభివృద్ధి చూడండి 2014 తర్వాత నుంచి కేవలం పదేండ్లలో జరిగిన అభివృద్ధి చూడండి జూన్ లో మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది.. మరింత అభివృద్ధి చేపడుతాం.. బండి సంజయ్, అర్వింద్, గోమాస శ్రీనివాస్ ను తమ్ముళ్లుగా పిలిచి.. మరీ అభ్యర్థులను పరిచయం చేసిన మోడీ నేను టెక్నాలజీ వినియోగించి మీతో తెలుగులో మాట్లాడుతాను ట్విట్టర్(ఎక్స్) వేదికగా ‘నమో ఇన్ తెలుగు’ డౌన్ లోడ్ చేసుకోండి వందకు వంద శాతం కాకపోయినా.. 80 నుంచి 90 శాతం వరకు ఇది సక్సెస్ అవుతుంది అందులో ఏమైనా తప్పులు ఉంటే నాకు చెప్పండి మీరు నా టీచర్లు.. నాకు తెలుగు నేర్పిస్తారు కదా.. ఎవరైనా ఏమైనా అంటే.. గడ్ బడ్.. చేయకు.. మోడీ నా జేబులో ఉన్నాడని చెప్పండి తెలంగాణలోని ప్రతి మొబైల్ లో మోడీ ఉండాలి మీ మొబైల్ ఫ్లాష్ లైట్లు ఆన్ చేసి నాకు అండగా ఉంటానని గ్యారెంటీ ఇవ్వండి -
జగిత్యాల విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ
ప్రధాని మోదీ జగిత్యాల పర్యటన.. బహిరంగ సభ అప్డేట్స్ ప్రధాని మోదీ కామెంట్స్.. భారత్ వికాసంతో తెలంగాణా వికాసం కూడా సులభమైతుంది. మూడురోజుల్లో మూడుసార్లు తెలంగాణా వచ్చాను. వందల కోట్ల రూపాయలు తెలంగాణా వికాసం కోసం కేంద్రం కేటాయిస్తున్నాం. తెలంగాణాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఊసే లేదిప్పుడు. తెలంగాణాతో పాటు, దేశం మొత్తం మళ్ళీ బీజేపీ కావాలని కోరుతోంది. సమృద్ధ భారత్ కోసం 400 సీట్లు దాటాలి. అందుకే బీజేపీకే ఓటు వేయాలి. శక్తి స్వరూపిణిలైన ఇంతమంది స్త్రీలు, యువత ఆశీర్వచనం ఇచ్చేందుకు వచ్చారంటే.. నేనెంత అదృష్టవంతుణ్ని!. నేను భారతమాత పూజారిని. ఇండియన్ అలయెన్స్‌కు నామారూపాల్లేకుండా చిత్తు చేసేందుకు ఈ నారీశక్తి అంతా ఒక్క తాటిపైకి రావాలి. చంద్రయాన్ సఫలీకృతం కావడంలో కూడా ఈ నారీశక్తిది కీలకపాత్ర. శక్తి వినాశనాన్ని కోరుకునే వారికి ఇక్కడ స్థానం లేదు, వారిని తుదముట్టించాలి. తెలంగాణా ప్రజల కలలను నిర్వీర్యం చేసిన ప్రజా ఘాతకులు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కు తెలంగాణా ఏటీఎం కార్డులా మారింది. తెలంగాణాను మోసం చేయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూదొందే. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటే. అందుకే కాళేశ్వరంకు సంబంధించి ఎలాంటి చర్యల్లేవ్. ఆ రెండు పార్టీలు మోదీని తిట్టడం, మోదీ జపం చేయడం మాత్రమే చేస్తున్నాయి. మోదీ తెలంగాణా ప్రజలకు గ్యారంటీ ఇస్తున్నాడు.. తెలంగాణాను దోచుకునే వారినెవరినీ వదిలిపెట్టడని. కాంగ్రెస్ కాదది స్కాంగ్రెస్. ఢిల్లీలో లిక్కర్ స్కాంతో ఇక్కడి బీఆర్ఎస్ ఏం చేసిందో చూశారు. కాబట్టి ఆ రెండు పార్టీలను గెలిపిస్తే అంతే సంగతులు. మీరెన్ని సీట్లలో తెలంగాణాలో బీజేపీని గెలిపిస్తే తెలంగాణాలో అంత అభివృద్ధి జరుగుతుంది. వికసత్ తెలంగాణా కావాలంటే బీజేపీని అత్యంత మెజారిటీతో అన్ని సీట్లలో గెలిపించాలి కిషన్‌రెడ్డి ప్రసంగం.. మోదీ పాలనలో భారత్ అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతోంది 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు రూ.6 వేలు రైతుల ఖాతాల్లో వేస్తున్నారు ఆర్టికల్ 370 నుంచి మొదలుపెడితే.. రామమందిర నిర్మాణం వరకు సుస్థిర పాలన రామగుండం ఎరువుల పరిశ్రమ, జాతీయ రహదారులు, పసుపు బోర్డు, గ్రామపంచాయతీ నిధులివ్వడం.. వీటన్నిటినీ మోడీ ప్రభుత్వం ఎంత అంకితభావంతో చేస్తుందో చూస్తున్నాం సమ్మక్క సారక్క పేరుతో ట్రైబల్ యూనివర్సిటీని ఇచ్చింది మోదీనే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసింది కాళేశ్వరం, లిక్కర్, దళితబంధు, భూ కేటాయింపుల పేరిట దోపిడీలకు పాల్పడింది కేసీఆర్ కుటుంబం లిక్కర్ స్కాంతో తెలంగాణా రాష్ట్రాన్ని తలదించుకునేలా చేసింది కుక్క తోక వంకర అన్నట్టు కాంగ్రెస్ పార్టీ తీరుతుంది ఆరు గ్యారంటీలని చెప్పి వాటిని అమలు చేయని కాంగ్రెస్ ఇక్కడవసరమా..? అందుకే మళ్లీ మోదీని మూడోసారి ప్రధానిని చేసుకోవాల్సిన అవసరముంది. జగిత్యాల: అర్వింద్ కామెంట్స్ ప్రపంచంలోనే పవర్ ఫుల్ లీడర్ మోదీ భారత దేశం సురక్షింతంగా ఉండాలంటే మోదీ మూడోసారి ప్రధాని కావాలి జగిత్యాలలో ప్రారంభమైన బీజేపీ విజయ సంకల్ప సభ హాజరైన ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్‌రెడ్డి జగిత్యాల బీజేపీ సభకు వర్షం ముప్పు? సభకు వర్షం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన బీజేపీ నేతలు ప్రధాని మోదీ సభకు భారీ జనసమీకరణ ప్లాన్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి జగిత్యాల బయల్దేరిన ప్రధాని మోదీ జగిత్యాలలో కాసేపట్లో బీజేపీ విజయ సంకల్ప సభ సభలో పాల్గొని ప్రసంగించనున్న ప్రధాని మోదీ పాల్గొననున్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థులు ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ప్రధాని మోదీ. రాష్ట్రంలోని 17 లోక్ సభ సీట్లలో బీజేపీని గెలిపించాలంటూ ప్రజలను కోరుతున్న ప్రధాని. ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయసంకల్ప సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ ఉదయం రాజ్‌భవన్ నుంచి బయలుదేరి బేగంపేట్ఎయిర్పోర్ట్కు చేరుకుని.. ప్రత్యేక హెలికాఫ్టర్‌లో జగిత్యాల వెళ్తారు. నిన్నసాయంత్రం ఏపీ చిలకలూరిపేట జనగళం సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. రాత్రికి హైదరాబాద్ చేరుకుని రాజ్‌భవన్‌లో బసచేశారు. -
నేడు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. తాజాగా బీఎస్పీకి రాజీనామా చేసిన ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ గూటికి చేరనున్నారు. సోమవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా..‘నా రాజకీయ భవితవ్యంపై హైదరాబాద్‌లో ఆదివారం వందలాది మంది అభిమానులు, శ్రేయోభిలాషులతో మేధోమధనం జరిపాను. ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటే నడుస్తానని మాట ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ విశాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని, దేశంలో లౌకికత్వం, రాజ్యాంగ రక్షణ, బహుజనుల అభ్యున్నతి కోసం సోమవారం కేసీఆర్ సమక్షంలో ఆపార్టీలో చేరబోతున్నా. ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెల్లో పదిలంగా దాచుకుంటా. వాళ్ల కలలను నిజం చేసే దిశగా పయనిస్తా’ అంటూ పోస్టు పెట్టారు. ఇదిలా ఉండగా.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రవీణ్ కుమార్ బీఎస్పీ తరఫున సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ ప్రజలకు నమస్కారం🙏 నేను నా రాజకీయ భవితవ్యం పై ఈ రోజు హైదరాబాదులో వందలాది శ్రేయోభిలాషులు, ఆప్తులు, అభిమానులందరితో మేధోమధనం జరిపాను. అట్టి సభలో రకరకాల అభిప్రాయాలు వచ్చాయి. కానీ నా మీద నమ్మకంతో నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటనే నడుస్తామని మాట ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక… — Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 17, 2024 -
కేసీఆర్ ఎక్కడున్నా ‘రజాకార్’ చూడాలి
కరీంనగర్ టౌన్: నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు పడ్డ బాధలు, గోసను కళ్లకు కట్టినట్లు చూపిన సినిమా ‘రజాకార్’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్‌లోని మమత థియేటర్లో రజాకార్ చిత్ర యూనిట్, బీజేపీ కార్యకర్తలతో కలిసి సినిమా చూసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నియంత నిజాం, రజాకార్ల రాక్షస పాలనపై తెలంగాణ ప్రజ లు చేసిన పోరాటాల చరిత్రను అద్భుతంగా తెరపై చూపించారని కొనియాడారు. ఈ వాస్తవాలను నేటి తెలంగాణ ప్రజలకు తెలియజేయాలని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సినిమాను ప్రజలకు అందించిన దర్శక, నిర్మాతలు యాట సత్యనారాయణ, గూడూరు నారాయణరెడ్డిని అభినందించారు. కేసీఆర్ ఎక్కడున్నా రజాకార్ సినిమా చూడాలన్నారు. ఆ సినిమా చూసిన తర్వాత కూడా నిజాం గొప్పోడు, రజాకార్లు మంచోళ్లని అనిపిస్తే నిరభ్యంతరంగా కేసీఆర్ ‘ట్వీట్’చేయొచ్చు అని సూచించారు. అవసరమైతే ఆనాడు నిజాం సమాధి ఎదుట మోకరిల్లిన కేసీఆర్ ఫొటోను కూడా ఈ సినిమా చూసిన తర్వాత ట్వీట్ చేయవచ్చని పేర్కొన్నారు. -
గ్యారంటీల అమలుకు ‘డిజిటల్ క్యాంపెయిన్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలను ఎన్నోరకాలుగా మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గ్యారంటీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచి్చన ప్రతి హామీ అమలు చేయాల్సిందేనని, ఈ దిశగా ఒత్తిడి చేసేందుకు బీజేపీ రాష్ట్ర పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ మొదలు పెట్టిందన్నారు. ఆదివారం బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రశి్నస్తున్న తెలంగాణ పోస్టర్, వెబ్‌సైట్‌ను రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అహంకారం, నియంతృత్వం, నిరంకుశత్వంతో కేసీఆర్ ఓడిపోయినా తెలంగాణ ప్రజలు మాత్రం గెలవలేదన్నారు. అనేక తప్పుడు ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. పథకాల అమలులో చేతులెత్తేసిందని విమర్శించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని, రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఏటా రూ.15 వేలు ఇవ్వాలని, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనేక రకాల గ్యారంటీలంటూ మభ్యపెట్టి ప్రజలను వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. -
జంపింగ్‌లు షురూ
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు నగారా మోగిన మరుసటి రోజే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి నాలుగు నెలలు గడవకుండానే ఎమ్మెల్యేలు పార్టీ మారడం ప్రారంభమైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ పక్షాన గెలిచిన మాజీ మంత్రి దానం నాగేందర్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీకి గానీ, శాసనసభ్యత్వానికి గానీ రాజీనామా చేయకుండానే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం, ఇక నుంచి తన రాజకీయం ఏంటో చూపిస్తానంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. బీఆర్ఎస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వక భేటీ పేరిట కలిసినప్పటికీ ఇప్పటివరకు ఎవరూ పార్టీ మారలేదు. కానీ గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రాతినిధ్యం లేని కాంగ్రెస్ పార్టీలోకి, నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే రావడంతో రాజకీయం రసకందాయంలో పడిందని అంటున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏ క్షణమైనా, ఏమైనా జరగవచ్చనే ఆలోచనతోనే ఎమ్మెల్యేలను అధికారికంగా పార్టీలో చేర్చుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందని, ఆపరేషన్ ఆకర్‡్షకు ఇక మరింత పదును పెట్టే క్రమంలో గేమ్ స్టార్ట్ చేసిందని చెబుతున్నారు. టచ్‌లో 26 మంది? ఇటీవల ఎన్నికల్లో బీఆర్ఎస్ పక్షాన మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో ఆ సంఖ్య 38 అయ్యింది. అయితే వీరిలో మూడింట రెండొంతుల మంది అంటే 26 మంది కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే మెదక్ జిల్లాకు చెందిన నలుగురు, రంగారెడ్డి నుంచి ఇద్దరు, మేడ్చల్ నుంచి ఇద్దరు, కొత్తగూడెం జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. వీరంతా కాంగ్రెస్‌లో చేరతారా లేక మర్యాదపూర్వకంగానే కలిశారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అదే సమయంలో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తే తాము అండగా నిలుస్తామని తనను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హామీ ఇస్తున్నారని రేవంత్‌రెడ్డి స్వయంగా చెప్పడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు ఈ రోజే గేట్లు తెరిచానని, అవతలివైపు ఎంతమంది ఉంటారో తనకు తెలియదంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠకు తావిస్తున్నాయి. నాటి బీఆర్ఎస్ తరహాలోనే! ఓటుకు కోట్లు వ్యవహారం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్రమత్తమై భవిష్యత్తులో ప్రభుత్వానికి ప్రమాదం లేకుండా ఉండేందుకు అనే కారణం చూపుతూ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. అయితే అప్పటి నుంచీ ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతూనే ఉంది. ఒక పార్టీలో గెలిచిన వారిని మరో పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కూడా గతంలో పలుమార్లు నిలదీశారు. పార్టీ మారిన వారిని ఉరి తీయాలంటూ ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ ఇప్పుడు ఆయనే స్వయంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వంలో కీలక హోదాలో ఉన్న ఓ నాయకుడు మాట్లాడుతూ ‘నాడు కేసీఆర్ సూత్రాన్నే మేం పాటిస్తున్నాం. మా కోట గోడలను పదిలం చేసుకుంటున్నాం. బలంగా చుట్టూ కంచె వేసుకుంటున్నాం. పార్లమెంటు ఎన్నికల తర్వాత డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని కొందరు, మూడు నెలల తర్వాత ప్రభుత్వం ఉంటుందో ఉండదో అని మరికొందరు చేస్తున్న వ్యాఖ్య ల వెనుక ఆంతర్యం ఏంటో అందరికీ తెలిసిందే. అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్లకు ఫిరాయింపుల రాజకీయం అలవాటే. మా జాగ్రత్తలో మేం ఉండకపోతే తప్పు చేసిన వాళ్లమవుతాం. అందుకే సీఎం రేవంత్‌రెడ్డి దూకుడు రాజకీయం చేస్తున్నారు. వాళ్ల శాసనసభాపక్షం మా పార్టీలో విలీనం అవు తుందేమో?’అని వ్యాఖ్యానించడం గమనార్హం. సీఎం, మున్షీ సమక్షంలో చేరికలు బీఆర్ఎస్కు చెందిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డిలు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేశ్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో, రంజిత్‌రెడ్డితో కలిసి మొత్తం ముగ్గురు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్టయింది. కేసీఆర్, కేటీఆర్‌కు కృతజ్ఞతలు: రంజిత్‌రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రంజిత్‌రెడ్డి తన రాజీనామా లేఖను పంపారు. కాగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రంజిత్‌రెడ్డి ‘ఎక్స్’లో తెలిపారు. ఇన్ని రోజులు చేవెళ్ల ఎంపీగా తనకు సేవలు చేసే అవకాశం కల్పించిన ప్రజలకు, కేసీఆర్, కేటీఆర్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కేసీఆర్‌ను కోరారు. -
వేడెక్కిన రాజకీయం
సాక్షి, మేడ్చల్ జిల్లా: పార్లమెంటు ఎన్నికలకు నగారా మోగడంతో రాజకీయం వేడెక్కింది. పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చి మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంపై జెండా ఎగురవేసేందుకు మూడు ప్రధాన పార్టీలు పోటీపడుతున్నాయి. దేశంలోనే అతి పెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా గుర్తింపు పొందిన మల్కాజిగిరి స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. మూడు జిల్లాలు.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు నగరంతోపాటు శివారు జిల్లాలైన మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కలిగి ఉన్న మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండటంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ స్థానంలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ(బీజేపీ), భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)అభ్యర్థులను ప్రకటించగా... కాంగ్రెస్ గెలుపు గుర్రం కోసం అన్వేషిస్తోంది. శాసనసభ ఎన్నికల తర్వాత రాష్ట్రంతో పాటు నగర శివారు జిల్లాల్లోనూ రాజకీయ సమీకరణాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుండటంతో ఓటర్ల ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న మల్కాజిగిరి ఎంపీ పరిధిలో ప్రస్తుతానికి 37,28,519 ఓటర్లు ఉన్నారు. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 6,58,190 మంది ఓటర్లు ఉండగా, మల్కాజిగిరిలో 4,99,538, కుత్బుల్లాపూర్‌లో 7,12,756, కూకట్‌పల్లిలో4,71,878, ఉప్పల్‌లో 5,33,544, ఎల్బీనగర్లో 6,00,552, కంట్మోనెంట్లో 2,52,060 మంది ఓటర్లు ఉన్నారు. ఎంపీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు వరకు కూడా అర్హులైన వారు కొత్తగా ఓటుహక్కు నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. పార్టీలు అప్రమత్తం మల్కాజిగిరి నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు కావటంతో ... కాంగ్రెస్ వైఖరి ఎలా ఉంటుందనే దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, బీఆర్ఎస్ తరపున రాగిడి లక్ష్మారెడ్డి అభ్యర్థిత్వాలను ఆయా పార్టీలు ప్రకటించటంతో వారు ప్రచారంలోకి దిగారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రచార పర్వంలో ముందున్నారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించిన ఆయన బస్తీలు ,పురపాలక సంఘాలు ,డివిజన్లు, గ్రామాల వారీగా ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించారు. ఈటల విజయం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కంట్మోనెంట్ అసెంబ్లీ నియోజవర్గ పరిధిలో పార్టీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో పాల్గొని ఎన్నికల శంఖారాన్ని పూరించగా, శుక్రవారం భారత ప్రధాని మోదీ మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రోడ్ షో కార్యక్రమాన్ని చేపట్టి బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపారు. కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ నెలకొనడంతో అభ్యర్థుల ఎంపిక కీలకంగా మారింది. కాంగ్రెస్ అధిష్టానం తాజాగా పట్నం సునీతా మహేందర్ రెడ్డి పేరు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె పేరును అధికారికంగా నేడో ,రేపో ప్రకటించవచ్చునని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. బీజేపీలో అసమ్మతిపై దృష్టి బీజేపీలో టికెట్ కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించిన కొందరు నేతలు పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ ఆశించిన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అర్బన్ అధ్యక్షుడు పి.హరీష్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీ పెద్దలు అసంతృప్తి నేతలను బుజ్జగించటంతో పాటు అభ్యర్థి ఈటల గెలుపు కోసం పని చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
వంద రోజుల్లో.. వంద తప్పులు..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో వంద తప్పులు చేసిందని.. నాలుగు కోట్ల మంది ప్రజలను నమ్మించి మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు మండిపడ్డారు. రాష్ట్ర రైతాంగం పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో మళ్లీ తిప్పలు పడుతోందని.. సాగునీరు, విద్యుత్ సమస్యలతో సతమతం అవుతోందని ఆరోపించారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. హామీల అమలు ఏది? కాంగ్రెస్ ఇచ్చి న హామీలు అమలు చేయకపోగా.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో జరిగిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకుంటోందని కేటీఆర్ మండిపడ్డారు. ‘‘రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా కింద రూ.15 వేలు, వరికి రూ.500 బోనస్, ప్రతి మహిళకు రూ.2,500 సాయం వంటి హామీల అమలు ఎప్పుడు? రైతుబంధును సీరియల్లా ఎంతకాలం సాగదీస్తారు. మూడు నెలలైనా పెన్షన్లను రూ.4000కు ఎందుకు పెంచలేదు. ఒకటో తేదీనే ఇస్తామన్న జీతాలు అందరికి ఎందుకు అందడం లేదు. 200 యూనిట్ల వినియోగం దాటితే మొత్తం కరెంట్ బిల్లు ఎందు కు కట్టాలి? గృహజ్యోతికి ఏటా రూ.8 వేలకోట్లు అవసరమైతే బడ్జెట్లో రూ.2,400 కోట్లే ఎందుకు పెట్టారు? దళితబంధు పథకాన్ని అర్ధాంతరంగా ఎందుకు నిలిపివేశారు? అంబేడ్కర్ అభయహస్తం పథకాన్ని అడ్రస్ లేకుండా ఎందుకు చేశారు? ఒకే ఒక్కరోజు ప్రజాభవన్‌కు వెళ్లి ఆ తర్వాత ఎందుకు ముఖం చాటేశారు? చిన్న లోపాన్ని భూతద్దంలో చూపెట్టి మేడిగడ్డ బ్యారేజీపై ఎందుకు కుట్ర చేస్తున్నారు? కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టేశారు? భూగర్భ జలాలు అడుగంటుతున్నా చెరువులు ఎందుకు నింపడం లేదు?’’ అని ప్రశ్నించారు. పంట చేతికొచ్చే సమయంలో రైతులకు సాగునీరు ఇవ్వకపోవడం ఘోరమన్నారు. పదేళ్ల తర్వాత మళ్లీ రైతుల ఆత్మహత్యలు జరిగే పరిస్థితికి తెరలేపుతున్నారని ఆరోపించారు. వేళాపాళా లేని కరెంటు కోతలేంటి? యాసంగి సాగు గణనీయంగా తగ్గినా ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటని కేటీఆర్ నిలదీశారు. ట్యాంకర్లతో నీళ్లు పోస్తూ పంటలను కాపాడుకునే దుస్థితి ఎందుకు వచ్చి ందని ప్రశ్నించారు. ‘‘వేళాపాళా లేని కరెంటు కోతలేమిటి? పల్లెలు, పట్టణాల్లో నిరంతర విద్యుత్ సరఫరాకు ఎందుకు పాతరేశారు? నాణ్యత లేని కరెంట్ వల్ల మోటార్లు కాలిపోవడానికి బాధ్యులెవరు? యూరియా కోసం మళ్లీ క్యూలైన్లలో నిలబడే దుస్థితి ఎందుకు తెచ్చారు? సాగునీటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అప్పగించారు? మిషన్ భగీరథను మూలన పడేసి.. మళ్లీ ట్యాంకర్ల రాజ్యం తేవడమేంటి? ఉచిత బస్సు ప్రయాణమని ఆశపెట్టి మహిళలను ఇబ్బందులకు గురిచేస్తారా? ఆటోడ్రైవర్ల పొట్టగొట్టి.. ఏటా ఇస్తామన్న రూ.12 వేలు ఎగ్గొడతారా? పదేళ్లు సంతోషంగా ఉన్న నేతన్నల జీవితాలను ఎందుకు ఆగం చేశారు? ఆర్డర్లు ఇవ్వకుండా సాంచాల సంక్షోభాన్ని ఎందుకు సృష్టించారు?’’ అని ప్రశ్నించారు. -
నా రాజకీయం చూపిస్తా! : సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్ మొదలుకొని కడియం శ్రీహరి వంటి వారి దాకా ఈ ప్రభుత్వం మూడు నెలలు కూడా ఉండదంటూ మాట్లాడుతున్నారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఎన్నికల తర్వాత ఆపరేషన్ మొదలుపెడతామని అంటున్నారు. ఇది దేనికి సంకేతం? వందరోజుల్లో ఎక్కడైనా, ఎప్పుడైనా ఫిరాయింపుల జోలికి వెళ్లానా? కానీ ఈ రోజు వాళ్లిద్దరూ ఒకే లైన్లో మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారు. పడగొడుతుంటే చూస్తూ ఊరుకుంటమా? కుక్క కాటుకు చెప్పుదెబ్బ అంటారు. కొట్టకుంట ఊర్కుంటమా? కొడతం కదా.. అందుకే వందో రోజు మొదలుపెట్టిన. ఓ గేట్ ఓపెన్ చేసిన. ఈరోజు ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్యే వచ్చా రు. ఎన్నికల నగారా మోగింది కాబట్టి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా కూడా పని మొదలు పెట్టిన. నిన్న కోడ్ రానంత వరకు ముఖ్యమంత్రిగా చాలా నిబద్ధతతో ప్రతిరోజూ 18 గంటలు ప్రజల కోసం పనిచేసిన. చిన్న తప్పిదానికి కూడా అవకాశం ఇవ్వకుండా పనిచేసిన. నిన్న 3 గంటలకు ఎన్నికల ప్రధానాధికారి నగారా ఊదిండు. ఇక ఎన్నికల రూపం చూపిస్తా. నా రాజకీయం ఏంటో చూపిస్తా..’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ముఖ్య మంత్రిగా 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ఆదివారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌లోని సురవరం ప్రతాప్‌రెడ్డి ఆడిటోరియంలో నిర్వహించిన ‘మీట్ ది మీడియా’ కార్య క్రమంలో ఆయన పాల్గొన్నారు. వందరోజుల్లో అమలు చేసిన కార్యక్రమాలను వివరించారు. అనంతరం విలేకరుల ప్రశ్నలకు సీఎం సమాధానమిచ్చారు. నిజాం నకలునే కేసీఆర్ చూపించారు ‘వారసత్వాన్ని తమపై రుద్దాలని చూసినప్పుడు తెలంగాణ సమాజం ఏకమైంది. ప్రజలు దానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. కేసీఆర్ కుటుంబాన్ని అధికారం నుంచి దించారు. ప్రజాస్వామ్యంపై ఆయనకు నమ్మకం లేదు. ఏనాడూ ప్రజల స్వేచ్ఛను గౌరవించ లేదు. నిజాం నకలునే కేసీఆర్ చూపించారు. ఖాసిం రజ్వీ ద్వారా నిజాం తన ఆధిపత్యం, అధికారంపై తిరుగుబాటు చేసిన వారిని అణిచివేసే ప్రయత్నం చేసినట్లు,ప్రభాకర్‌రావు ద్వారా కేసీఆర్ చేశారు. ప్రజల స్వేచ్ఛను హరించాలని భావించారు. అందుకే తెలంగాణ ప్రజలు కేసీఆర్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడారు. 2023 డిసెంబర్ 3న స్వేచ్ఛను తెచ్చుకున్నారు. 1948 సెపె్టంబర్ 17న ఎలాగో అలాగే స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు..’ అని రేవంత్ అన్నారు. ఆరు గ్యారెంటీలతో సంక్షేమ పాలన ‘వంద రోజుల ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛను అందించాం. మేము పాలకులం కాదు.. సేవకులం అని తెలిపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకెళ్తున్నాం. ఉద్యమ సమయంలో వాహనాలపై రాసుకున్న ‘టీజీ’ని అమల్లోకి తీసుకొచ్చాం. ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నాం. తెలంగాణ తల్లి, ప్రభుత్వ చిహ్నాల్లో రాజ దర్పాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. సచివాలయంలోకి అందరికీ ప్రవేశం కల్పించాం. 2004 నుంచి అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేస్తూ ముందుకెళ్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని 26 కోట్ల మంది వినియోగించుకున్నారు. ఇప్పటివరకు 8 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించాం. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో మరిన్ని వ్యాధులను చేర్చడమే కాకుండా పరిమితి రూ.10 లక్షలకు పెంచాం. 32 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల వరకు ఉచిత్ విద్యుత్ పథకాన్ని అందుకున్నాయి..’ అని సీఎం వివరించారు. కేంద్రం, గవర్నర్‌తో సామరస్యంగా ముందుకు.. ‘కేంద్ర ప్రభుత్వంతో, తెలంగాణ గవర్నర్ తమిళిసైతో సామరస్య పూర్వకంగా ముందుకెళ్తున్నాం. వైబ్రంట్ తెలంగాణ మా లక్ష్యం. తెలంగాణ విజన్ –2050 ద్వారా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నాం. మా ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండడం ఖాయం. ప్రజలు ఆశీర్వదిస్తే మరో పదేళ్లు ఉంటాం. కానీ అభివృద్ధిని 2050 లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. సామాజిక న్యాయానికి మారు పేరుగా ‘వందరోజుల్లో సామాజిక న్యాయానికి మారుపేరుగా పాలన సాగించాం. నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు, నలుగురు ప్రభుత్వ విప్‌లను నియమిస్తే అన్ని వర్గాలకు అవకాశం కల్పించాం. మంత్రుల్లో కూడా అన్ని వర్గాల వాళ్లు ఉన్నారు. – త్వరలోనే సమాచార హక్కు కమిషనర్లను నియమిస్తా. గతంలో ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన వారిపై మేం చర్యలు తీసుకుంటున్నాం. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సామాజిక స్పృహ కలిగిన మంచి మిత్రుడు. టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి ఆయనకే ఇద్దామనుకుంటే తిరస్కరించారు. బీఆర్ఎస్తో కలిసేంత తప్పు చేయరు. కలిస్తే ఆయనే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అనర్హులకు రైతుభరోసా ఇవ్వం రైతుబంధు పథకాన్ని 5 ఎకరాల లోపు 62 లక్షల రైతులకు అందించాం. రైతుభరోసాను పకడ్బందీగా అమలు చేస్తాం. కొండలు, గుట్టలు, రోడ్లకు, కోటీశ్వరులకు, అనర్హులకు ఇవ్వం. అధికారులపై వ్యక్తిగత కక్ష సాధింపులు ఉండవు. హైదరాబాద్‌లోని జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో చర్చించి జర్నలిస్టులందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కార నిర్ణయంతో వస్తే సంతకం చేస్తా..’ అని రేవంత్ చెప్పారు. టీయూడబ్లు్యజే ప్రధానకార్యదర్శి విరాహత్ అలీ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎం సీపీఆర్వో బోరెడ్డి అయోధ్యరెడ్డి పాల్గొన్నారు. తన్నీరు.. నువ్వు పన్నీరు కాదు ‘200 యూనిట్ల ఉచిత కరెంటును అమలు చేస్తుంటే కొన్ని గంజాయి మొక్కలు మళ్లీ తమ పరిమళాలను వెదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఉచిత కరెంటుకు సబ్సిడీని ముందు చెల్లించిన తరువాతే వినియోగదారులకు జీరో బిల్లులు జారీ చేయాలని ఈఆర్సీ ఆదేశించింది. ఇంటి పేరులో తన్నీరు (తన్నీరు రంగారావు) ఉన్నంత మాత్రాన ఆయన పన్నీరు కాదు. ఈ గంజాయి మొక్కను కూడా పీకుతం. ఎక్కువ రోజులు ఆ కుర్చీలో ఉండవు. విద్యుత్ సరఫరా విషయంలో కొన్నిచోట్ల కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి వందల కోట్లు కాదు, వేల కోట్లకు చేరింది. అవినీతిపై రాజ్యాంగబద్ధంగా విచారణ జరిపించి చర్యలు తీసుకుంటాం. బతుకమ్మను కొందరు ప్లాస్టిక్ బతుకమ్మను చేశారు. ఎవరు ఉన్నా లేకున్నా బతుకమ్మ, బోనాల పండుగలు ఘనంగా జరుగుతాయి. ప్రైవేట్ చేతిలో ఉన్న ధరణిని ప్రభుత్వ సంస్థకు అప్పగించాం. ధరణి పోర్టల్‌ను ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే తప్ప అవినీతి జరిగిందా లేదా అనే విషయం బయటపడదు. తప్పులకు కారణమైన వారిని ఉపేక్షించం..’ అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. -
ఖబడ్దార్ రేవంత్.. నోరు, ఒళ్లు దగ్గరపెట్టుకో: ఈటల వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి, మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్. రేవంత్ రెడ్డి ఖబడ్దార్.. నోరు, ఓళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడలంటూ హెచ్చరించారు. ఫోన్ ట్యాంపింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. వ్యాపారస్తులను బ్లాక్ మెయిల్ చేస్తున్న వసూళ్ల చిట్టా రికార్డ్ అవుందని అన్నారు. నడమంత్రపు సిరిలాగా ముఖ్యమంత్రి పదవి వచ్చిన రేవంత్ రెడ్డి.. రెండు నాల్కలధోరణితో మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమకు పెద్దన్న అని.. ఆయన ఆశీర్వాదం ఉంటేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని ఇటీవల రేవంత్ మాట్లాడిన ఈటల చెప్పుకొచ్చారు. ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న కొంపల్లి, అల్వాల్ ఫ్లై ఓవర్ కోసం 175 ఎకరాల రక్షణ రంగ భూమిని మోదీ కేటాయించారని చెప్పిన సీఎం .. మళ్లీ అదే నోటితో ప్రధానిని తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ కూడా అలానే మాట్లాడారని, ఆయనకు పట్టిన గతే రేవంత్ రెడ్డికి కూడా పడుతుందంటూ హెచ్చరించారు. నోరు, ఒళ్లు దగ్గర పెట్టుకోని జాగ్రత్తగా మాట్లాడాలని రేవంత్ రెడ్డికి ఈటల రాజేందర్ హితవు పలికారు. అధికారం ఉందని ఏది పడితే అది మాట్లాడితే సహించడానికి ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశారని విమర్శించిన రేవంత్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు తెలుస్తోందన్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ఖబడ్దార్ అని వార్నింగ్ ఇచ్చారు. చదవండి: ఇక నా రాజకీయం చూపిస్తా: సీఎం రేవంత్ పిల్లి కళ్లు మూసుకొని పాలుతాగినట్టు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీకి ఫండ్స్ పంపించడానికి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులను ఎంత వేదిస్తున్నది, ఎంత బ్లాక్ మెయిల్ చేస్తున్నది రికార్డ్ అవుతుందన్నారు. "ఒక్క రాష్ట్రంలో ఉండి నేనే అన్నీ అనుకుంటున్నావని. నిన్ను వీక్షించే వారు కూడా ఉన్నారు అని మర్చిపోకు." అంటూ వార్నింగ్ ఇచ్చారు. మల్కాజ్‌గిరిలో ఎవరు వచ్చినా.. ఎన్ని డబ్బులు ఖర్చుపెట్టినా.. గెలిచేది బీజేపీనే అని.. ఈటల రాజేందర్ దీమా వ్యక్తం చేశారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలుతాగినట్టు సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారని ఈటల మండిపడ్డారు. రాహుల్ గాంధీకి ఫండ్స్ పంపించడానికి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులను ఎంత వేధిస్తున్నది, ఎంత బ్లాక్ మెయిల్ చేస్తున్నందంతా రికార్డ్ అవుతుందన్నారు. మల్కాజిగిరిలో ఎవరు వచ్చినా, ఎన్ని డబ్బులు ఖర్చుపెట్టినా గెలిచేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు.