ఎప్పుడో?

Ration Cards Issued Delayed in Hyderabad - Sakshi

కొత్త రేషన్‌ కార్డుల జారీపై సందిగ్ధం  

ఇప్పటికే పెండింగ్‌లో 1.61 లక్షల దరఖాస్తులు

సాక్షి, సిటీబ్యూరో: నగరంలోనిఆసిఫ్‌నగర్‌కు చెందిన చింతకుంట్ల కల్యాణి 2016 సెప్టెంబర్‌ 3న రేషన్‌ కార్డు (ఆహార భద్రత కార్డు) కోసం మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. సంబంధిత సర్కిల్‌ కార్యాలయంలో దరఖాస్తు ప్రతులను అందజేశారు. కానీ ఇప్పటి వరకు క్షేత్రస్థాయి విచారణకు నోచుకోలేదు. అదే ప్రాంతానికి చెందిన బాజీ షేక్‌ కూడా అదే రోజు సర్కిల్‌ కార్యాలయంలో దరఖాస్తు అందజేసింది. కానీ ఇప్పటికీ విచారణ పూర్తవ్వలేదు. అదే విధంగా ఈ ఏడాది జనవరి 31న అంబర్‌పేటకు చెందిన మైలా అనురాధ సర్కిల్‌ కార్యాలయంలో దరఖాస్తు అందజేశారు. నాలుగు నెలలైనా క్షేత్రస్థాయి విచారణ జరగలేదు. వీరందరూ సర్కిల్‌ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నారు. అయినా ఫలితం దక్కడం లేదు. నగరంలో ఇలాంటి వారెందరో ఉన్నారు. కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న పేదలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. దాదాపు 1.61 లక్షల దరఖాస్తులు విచారణకు నోచుకోక పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియను జూన్‌ 1 నుంచి జూలై 1 వరకు పూర్తి చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ తాజాగా ఆదేశాలిచ్చారు. అయితే ఇది అమలు సాధ్యమేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం,  క్షేత్రస్థాయి సిబ్బంది కొరత.. వెరసి ఇప్పటికే కార్యాలయాల్లో దరఖాస్తుల కుప్పలు పేరుకుపోయాయి. వాటిలో ఎన్నో ఏళ్ల దరఖాస్తులూ లేకపోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే సగానికి పైగా పెండింగ్‌ దరఖాస్తులు నగరంలోనే ఉన్నాయి. కనీసం మీ సేవ ద్వారా వచ్చిన దరఖాస్తులపై సిటిజన్‌ చార్టర్‌ కూడా అమలుకు నోచుకోకుండా పోయింది. కొత్త కార్డులు, రద్దయిన కార్డుల పునరుద్ధరణ, కార్డుల్లో మార్పుచేర్పులు తదితరాల కోసం మీసేవ ద్వారా ప్రతిరోజు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నా... పరిష్కారానికి కాలపరిమితి లేకుండా పోయింది. నెలల తరబడి కనీసం క్షేత్రస్థాయి విచారణకు కూడా నోచుకోవడం లేదు. వాస్తవానికి క్షేత్రస్థాయి విచారణ తప్ప మిగిలిన ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే చేయాల్సి ఉంది. పెండింగ్‌ దరఖాస్తులు పెరిగిపోతున్న నేపథ్యంలో తాజాగా ఆ శాఖ కమిషనర్‌ అధికారులకు రోజువారీ టార్గెట్లు విధిస్తున్నారు. పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన ఎలా క్లియర్‌ చేయాలనే దానిపై రెండు కమిటీలను సైతం ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఆ దరఖాస్తులు ఏసీఎస్‌ఓ, డీసీఎస్‌ఓల లాగిన్‌కు వచ్చిన 7రోజుల్లో కార్డుల జారీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. దరఖాస్తులు అధికంగా ఉన్న రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో చీఫ్‌ రేషనింగ్‌ కార్యాలయం నుంచి సీనియర్‌ చెక్కింగ్‌ ఆఫీసర్లు, ఎంక్వైరీ ఆఫీసర్లను నియమించి త్వరితగతిన రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియను పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టారు. దరఖాస్తులు అధికంగా ఉన్నందున ప్రతి ఏసీఎస్‌ఓ ఆఫీస్‌కు అదనంగా ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను నియమిస్తున్నట్లు కమిషనర్‌ ప్రకటించారు. 

విచారణపై నిర్లక్ష్యం...  
ఆహార భద్రత కార్డుల మంజూరుకు సంబంధించి దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణ చేపట్టేందుకు సిబ్బంది కొరత వెంటాడుతోంది. ఫలితంగా విచారణ నత్తనడకన సాగుతోంది. దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. క్షేత్రస్థాయి విచారణ పూర్తయితేనే తప్ప మిగతా ప్రక్రియ ముందుకు సాగదు. కొత్త కార్డు కోసం మీ సేవ, ఈ సేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే సంబంధిత పౌరసరఫరాల శాఖ ఇన్‌స్పెక్టర్‌  క్షేత్రస్థాయి విచారణ జరిపి ఏసీఎస్‌ఓకు నివేదిక అందించడంతో పాటు ఆన్‌లైన్‌లో సిఫార్సు చేస్తారు. దరఖాస్తుదారుడి కుటుంబం ఆహార భద్రత కార్డుకు అర్హులైతే సంబంధిత ఇన్‌స్పెక్టర్‌ సిఫార్సు ఆధారంగా ఏసీఎస్‌ఓ కార్డు ఆమోదానికి డీసీఎస్వోకు సిఫార్సు చేస్తారు. డీసీఎస్వో పరిశీలించి ఆమోద ముద్ర వేసి కార్డు మంజూరు చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియలో అడుగడుగునా నిర్లక్ష్యమే కనిపిస్తోంది.  

ఇదీ పరిస్థితి...  
గ్రేటర్‌ పరిధిలో సుమారు 16,02,134 కుటుంబాలు మాత్రమే ఆహార భద్రత కార్డులు కలిగి ఉన్నాయి. అందులో హైదరాబాద్‌ పౌరసరఫరాల విభాగం పరిధిలో 5,85,039 కార్డులు ఉండగా 21,85,668 యూనిట్లు ఉన్నాయి. రంగారెడ్డి పరిధిలో 5,23,089 కార్డులు ఉండగా 17,46,078 యూనిట్లు, మేడ్చల్‌ మల్కాజిగిరి పరిధిలో 4,94,006 కార్డులు ఉండగా 16,47,263 యూనిట్లు ఉన్నాయి. సగటున మరో మూడు లక్షల కుటుంబాలకు పైగా కార్డులు లేవు. కాగా గత ఆరు నెలల వ్యవధిలో మీ సేవ అధికార లెక్కల ప్రకారం కొత్త కార్డుల కోసం సుమారు 2,68,963 కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. అందులో 74,096 దరఖాస్తులను ఆమోదించి కార్డులు మంజూరు చేశారు. మరో 33,769 తిరస్కరించారు. మిగిలిన 1,61,098 దరఖాస్తులపై కనీసం క్షేత్రస్థాయి విచారణ జరపకుండా పెండింగ్‌లో పడేశారు. దీంతో దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top