అగ్ని ప్రమాదాల బారిన పడిన వారికి తగిన వైద్యం అందించేందుకు ముంబైలోని ఆస్పత్రుల్లో సరైన సంఖ్యలో పడకలు అందుబాటులో లేవు.
సాక్షి, ముంబై: అగ్ని ప్రమాదాల బారిన పడిన వారికి తగిన వైద్యం అందించేందుకు ముంబైలోని ఆస్పత్రుల్లో సరైన సంఖ్యలో పడకలు అందుబాటులో లేవు. దీంతో వారిని గత్యంతరం లేక కాలిన గాయాలతోనే నేషన్ బర్న్ సెంటర్‌కు తరలించాల్సి వస్తోంది. ఇటీవల జరిగిన కాల్బాదేవి అగ్నిప్రమాదం జరిగినపుడు ఈ పరిస్థితి నెలకొంది. వారికి తగిన చికిత్స అందించలేక నేషనల్ బర్న్ సెంటర్‌కు తరలించారు. ఆ ప్రమాదంలో గాయపడిన ఆరుగురు అగ్నిమాపక సిబ్బంది ఇప్పటికీ అక్కడే చికిత్స పొందుతున్నారు.
ముంబైతో పాటు శివారు ప్రాంతాల్లో ఉన్న వివిధ ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదం బారిన పడిన వారికి చికిత్స చేసేందుకు దాదాపు 200 నుంచి 250 వరకు పడకలు ఉన్నాయి. ఈ పడకలు ఎప్పుడూ ఖాళీగా ఉండవు. దీంతో పరిస్థితి విషమంగా ఉన్న వారికి నవీముంబైకి తరలించాల్సి వస్తోంది. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై లాంటి నగరంలో ప్రత్యేకంగా కాలిన గాయాలకోసం చికిత్స చేసే ఆస్పత్రి లేకపోవడం శోచనీయమని పలువురు పేర్కొంటున్నారు. కేన్సర్ రోగులకు ప్రత్యేకంగా టాటా ఆస్పత్రి, ఆర్థోపెడిక్, ఇతర వ్యాధులకు ప్రత్యేక ఆస్పత్రులు ఉన్నాయి. కానీ అగ్నిప్రమాదాల బారిన పడి తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స చేసేందుకు మాత్రం ప్రత్యేక ఆస్పత్రి లేకపోవడంతో తీవ్ర ప్రాణ నష్టం జరుగుతోంది.
భాయ్‌కళలో మసినా ఆస్పత్రి ఉన్నప్పటికీ అక్కడ కేవలం 12, జేజే ఆస్పత్రికి 15, కస్తూర్బా ఆస్పత్రికి 25 పడకలు మాత్రమే కేటాయించారు. ఇక్కడ 50 శాతం లోపు గాయపడిన వారికి మాత్రమే చికిత్స చేయడం సాధ్యపడుతుంది. దీంతో ఇవి ఎప్పుడూ కాలిన గాయాల బాధితులతో బిజీగా కనిపిస్తాయి. తీవ్రంగా గాయపడిన వారు, మిగిలిన ఆస్పత్రుల్లో సౌకర్యం లేకపోవడంవల్ల నవీ ముంబైకి తీసుకెళ్లాల్సి ఉంటుంది.
అయితే అత్యవసరమైతే ముందుగా ముంబైలోని ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి ఆ తరువాత బీఎంసీ, ప్రభుత్వ ఆస్పత్రులకు లేదా నేషనల్ బర్న్ ఆస్పత్రికి తరలిస్తారు. కాలిన గాయాలతో చికిత్స పొంతున్న వారిని విచారించేందుకు తరచూ పోలీసులు వస్తుంటారు. దీంతో వీరిని ప్రత్యేక ఆస్పత్రులకు తరలించాల్సి వస్తోంది.