
జాబితా సరిదిద్దాల్సిందే!
శ్రీరంగం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం జోరందుకుంది. అన్ని పార్టీల నాయకులు నియోజకవర్గంలో తిష్ట వేసి గెలుపు కోసం ఓటర్ల ప్రసన్నంలో దూసుకు వెళ్తున్నారు.
సాక్షి, చెన్నై: శ్రీరంగం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం జోరందుకుంది. అన్ని పార్టీల నాయకులు నియోజకవర్గంలో తిష్ట వేసి గెలుపు కోసం ఓటర్ల ప్రసన్నంలో దూసుకు వెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ నియోజకవర్గం ఓటర్ల జాబితాలో తీవ్ర గందరగోళం ఉందని, అధికార పక్షం కనుసన్నల్లో దొంగ ఓటర్లను ఆ జాబితాలో ఇరికించారని డీఎంకే అభ్యర్థి ఆనంద్ ఆరోపించారు. మద్రాసు హైకోర్టును ఆయన ఆశ్రయించారు. ఎన్నికల యంత్రాంగం గత నెల 5, 26 తేదీల్లో ఓటర్ల జాబితాను ప్రకటించిందని గుర్తు చేశారు. ఐదో తేదీ విడుదల చేసిన జాబితాకు, మలి జాబితాకు మధ్య తీవ్ర గందరగోళం నెలకొందని వివరించారు. ఒకే చిరునామాలో వేర్వేరు వ్యక్తుల పేర్లను చేర్పించారని, ఆ వ్యక్తులెవ్వరూ నియోజకవర్గంలో ఆ చిరునామాల్లో నివసించడం లేదని ఆరోపించారు. కేవలం ఎన్నికల్లో గెలుపొందాలన్న లక్ష్యంతో అధికార పక్షం అధికారుల్ని బెదిరించి దొంగ ఓటర్లను చేర్పించినట్టుగా అనుమానం కలుగుతోందన్నారు. ఈ ఓటర్ల జాబితాను సరిదిద్ది, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేని రీతిలో కొత్తగా ఓటర్ల జాబితాను ప్రకటించే విధంగా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని విన్నవించారు.
సరిదిద్దాల్సిందే : ఆనంద్ పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్‌కిషన్‌కౌల్, న్యాయమూర్తి సుందరేషన్ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. పిటిషనర్ తరపున న్యాయవాది విల్సన్ హాజరై ఓటర్ల జాబితాలోని గందరగోళం, అవకతవకలను ఆధారాలతో సహా తన వాదనలో బెంచ్ దృష్టికి తెచ్చారు. ఇది వరకు పిటిషనర్‌ఎన్నికల కమిషన్ ముందు వీటిని సమర్పించారని, వారు ఖాతరు చేయని దృష్ట్యా, కోర్టును ఆశ్రయించామని సూచించారు. వాటిని పరిశీలించినానంతరం ఎన్నికల కమిషన్ తరపున హాజరైన న్యాయవాది నిరంజన్ వాదనను బెంచ్ విన్నది. పిటిషనర్ విజ్ఞప్తి మేరకు ఓటర్ల జాబితా పునఃపరిశీలనకు సిద్ధంగా ఉన్నామని సూచించారు. దీంతో ఓటర్ల జాబితాను పునః పరిశీలించడం కాదని, సరిదిద్దాల్సిందేనని బెంచ్ ఆదేశించింది. ఎన్నికలకు రెండు రోజుల ముందుగా కొత్త జాబితాను ప్రకటించాలని, త్వరితగతిన అన్ని తప్పుల్ని సరిదిద్దాలని ఉత్తర్వులు జారీ చేసింది.
నేరుగా రాలేకున్నా : శ్రీరంగంలో ఉప సమరం వేడెక్కడంతో గెలుపు తమదంటే తమదన్న ధీమాతో అన్నాడీఎంకే, డీఎంకే వర్గాలు పరుగులు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీరంగం ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ, తన ఆవేదనను వెళ్లగక్కుతూ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత లేఖ రాశారు. గత ఎన్నికల్లో తనను అఖండ మెజారిటీతో గెలిపించి మూడో సారిగా సీఎం పగ్గాలు అందేలా చేశారని గుర్తు చేశారు. మీ ఆశీసులతో శ్రీరంగం నుంచి గెలుపొందిన తాను సీఎం అయ్యాక, రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్ని వేగవంతం చేశానని వివరించారు. ఈ సమయంలో శ్రీరంగం నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడాన్ని తమరు జీర్ణించుకోలేకున్నారన్న విషయం తనకు తెలుసునని ఆవేదన వ్యక్తం చేశారు. కుట్ర, విధి ఆడిన చదరంగంలో ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడి ఉందని పేర్కొన్నారు. తన ప్రతినిధిగా, తమ అభ్యర్థి వలర్మతి ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నారని, ఆమెకు మద్దతుగా ప్రచారానికి తాను రావాల్సిన అవసరం ఉందన్నారు. అయితే తాను నేరుగా నియోజకవర్గంలోకి రాలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాస్తున్న ఈ లేఖను ఓటర్లు తన విజ్ఞప్తిగా పరిగణించాలని, తమ అభ్యర్థి వలర్మతిని అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.