అమర వీరుడు | I am proud my son died for the country, father of Major Mukund Vardarajan says | Sakshi
Sakshi News home page

అమర వీరుడు

Apr 28 2014 12:06 AM | Updated on Sep 28 2018 3:39 PM

అమర వీరుడు - Sakshi

అమర వీరుడు

జమ్ము కాశ్మీర్ రాష్ట్రం సోఫియాలోని ఓ ఇంట్లో నక్కి ఉన్న తీవ్రవాదులను పట్టుకునే క్రమంలో జరిగిన కాల్పుల్లో మేజర్ ముకుంద్ వరదరాజన్ వీర మరణం పొందారు.

 సాక్షి, చెన్నై: జమ్ము కాశ్మీర్ రాష్ట్రం సోఫియాలోని ఓ ఇంట్లో నక్కి ఉన్న తీవ్రవాదులను పట్టుకునే క్రమంలో జరిగిన కాల్పుల్లో మేజర్ ముకుంద్ వరదరాజన్ వీర మరణం పొందారు. ఈ సమాచారాన్ని  చెన్నైలోని తండ్రి వరదరాజన్ దృష్టికి ఆర్మీ వర్గాలు తీసుకెళ్లాయి. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. వారు నివాసం ఉంటున్న ప్రొఫెసర్ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. మేజర్ కడచూపు కోసం ఆప్తులు, బంధువులు ఆదివారం ప్రొఫెసర్ కాలనీకి చేరుకున్నారు. జమ్ముకాశ్మీర్ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి చెన్నైకి మృతదేహాన్ని తరలించారు. అర్ధరాత్రి చెన్నై చేరుకున్న మేజర్ మృత దేహానికి సోమవారం అంత్య క్రియలు జరగనున్నాయి. బెసెంట్‌నగర్ శ్మశాన వాటికలో ఉదయం 11.45 గంటలకు ఆర్మీ లాంఛనాలతో నిర్వహించనున్న అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
 
 ఒకే కొడుకు: ఆవడికి చెందిన వరదరాజన్ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్. సతీమణి గీతతో కలిసి ప్రస్తుతం ప్రొఫెసర్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు కొడుకు ముకుంద్, కుమార్తెలు స్నేహ, నిత్య ఉన్నారు. వీరికి పెళ్లిళ్లుఅయ్యాయి. బీకాం పూర్తి చేసిన ముకుంద్‌ను ఎంబీఏ చదవించాలని వరదరాజన్ ప్రయత్నించారు. అయితే, తన మామయ్యలు ఆర్మీలో ఉండడంతో తాను సైతం వారి బాటలోనే నడుస్తానని ఇంట్లో పట్టుబట్టి మరి ముకుంద్ విజయం సాధించాడు. చెన్నై ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసి 44వ రాష్ట్రీయ రైఫిల్స్ విభాగంలో పనిచేశారు. 2012 నుంచి లెబనాన్ సరిహద్దుల్లో పనిచేసి, ఇటీవలే జమ్ము కాశ్మీర్‌కు బదిలీ అయ్యారు. మేజర్‌గా అవతరించిన ముకుంద్‌కు 2009లో వివాహం జరిగింది. భార్య ఇందు, కుమార్తె హర్షిత(3) బెంగళూరులోని ఆర్మీ క్వార్టర్స్‌లో ఉన్నారు.
 
 వద్దన్నా వినలేదు: ఒక్కగానొక కొడుకుని ఆర్మీకి పంపడం తనకు తొలుత ఏ మాత్రం ఇష్టం లేదని ముకుంద్ తండ్రి వరదరాజన్ కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. తొలుత వ్యతిరేకించిన తాను, చివరకు అతడి లక్ష్యం, ఆశయం ముందు తలవంచక తప్పలేదన్నారు. ఆర్మీలో ముకుంద్ సేవలను, ఎదుగుదలను చూసి ఎంతో గర్వ పడ్డానని పేర్కొన్నారు. ఈనెల 12వ తేదీ ముకుంద్ జన్మదినం అని, ఆ రోజే చివరి సారిగా అతడితో మాట్లాడామని విలపించారు. ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నానని, ఎన్నికలయ్యాక మాట్లాడతానని చెప్పి, ఇప్పుడు శాశ్వతంగా తమ నుంచి దూరం అయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కగానొక్క కొడుకు దూరం అయినా, దేశం కోసం అతడు మరణించడం ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు.
 రూ.పది లక్షలు: చెన్నైకు చెందిన ముకుంద్ అమరుడయ్యూరన్న సమాచారంతో సీఎం జయలలిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతడి సేవలను కొనియాడారు. ముకుంద్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఆయన కుటుంబానికి తన సానుభూతి, సంతాపం తెలియజేశారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియాను ఆదివారం ప్రకటించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement