కార్వార కప్ప గోవాలో కూర | Frogs Smuggling From Karnataka to Goa | Sakshi
Sakshi News home page

కార్వార కప్ప గోవాలో కూర

Jun 25 2019 7:28 AM | Updated on Jun 25 2019 7:28 AM

Frogs Smuggling From Karnataka to Goa - Sakshi

జపాన్, ఫ్రాన్స్‌ వంటి దేశాల్లో కప్పలను ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు. ఈ సంస్కృతి కన్నడనాడుకు ఆనుకునే ఉన్న గోవాలో కూడా వ్యాపించింది. అంతవరకూ బాగానే ఉన్నా, గోవా హోటళ్లకు కప్పలు ఎక్కడి నుంచి స్మగ్లింగ్‌ అవుతున్నాయో తెలుసా... కార్వార (ఉత్తర కన్నడ) జిల్లా నుంచి. దీంతో నిత్యం వేల సంఖ్యలో కప్పలు హరీమంటున్నాయి. స్మగ్లర్లు బైక్‌లు, ఆటోలు, పెద్ద వాహనాల్లో కప్పల్ని దొంగచాటుకు గోవాకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.   

యశవంతపుర: రాష్ట్రంలో తీరప్రాంత జిల్లా కార్వారలో జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో కప్పల సంచారం పెరిగింది, దాంతో పాటే కప్పల దొంగల సమస్య కూడా. కార్వార జిల్లాలో ఉన్న కప్పులకు పొరుగునే ఉన్న గోవాలో మంచి డిమాండ్‌ ఉంది. వానాకాలంలో వచ్చే కప్పలను  అక్కడ ‘జంపింగ్‌ చికెన్‌’గా వర్ణిస్తూ ఇష్టంగా ఆరగిస్తారు. ఈ కప్పల వంటకాలకు గోవాలోని అనేక హోటల్స్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ప్రముఖ హోటల్స్‌లో జంపింగ్‌ చికెన్‌ ధరలు సాధారణ మటన్, చికెన్‌ వంటకాల కంటే ఎంతో ఎక్కువ కూడా. తీరాన సరిహద్దుల్లో కార్వార నుంచి భట్కళ వరకు కప్పలను పట్టి గోవాకు సాగిస్తున్నారు. కొందరికి ఇదే మంచి ఆదాయ వనరైంది.   

ఇండియన్‌ బుల్‌ ఫ్రాగ్‌కు డిమాండ్‌  
ఇండియన్‌ బుల్‌ ఫ్రాగ్‌ రకం కప్ప మాంసానికి గోవాలో గిరాకీ ఉంది. విదేశాల నుండి గోవాకు వచ్చేవారు ఎక్కువగా జంపింగ్‌ చికెన్‌ అంటే మహాప్రీతి. దీనితో ముంగారు వానలు ప్రారంభం నుండి స్థానికులు కప్పలను పట్టి గోవాకు తరలించి అక్కడ దళారులకు, హోటళ్ల యజమానులకు విక్రయిస్తుంటారు. కొందరు వ్యాపారులు పనివాళ్లను పంపి కప్పలను పెద్దసంఖ్యలో సేకరిస్తున్నారు. దీని మాంసం కేజీ రూ.2  వందల నుండి 3 వందల వరకు పలుకుతుంది. వంటకాల ధర ఇంకా ఎక్కువే.  

కోట్లాది రూపాయల వ్యాపారం
కార్వార ప్రాంతంలో కప్పులను పెద్దసంఖ్యలో పట్టుకెళ్తున్నారని వైల్డ్‌లైఫ్‌ వెల్పేర్‌ సొసైటీ పరిశోధకుడు మంజునాథ నాయక ఆందోళన వెలిబుచ్చారు. జిల్లా అధికారులకు తెలిసీ తెలియకుండా కోట్లాది రూపాయల కప్పల వ్యాపారం సాగుతుంది. గతంలో అనేకసార్లు కప్పలను రావాణా చేస్తున్న ముఠాను అధికారులు పట్టుకొని విచారించి బిత్తరపోయారు. కార్వార కప్పల మాంసం గోవాలో మంచి డిమాండ్‌ ఉన్నట్లు అధికారులకు తెలిసింది నుండి జిల్లాలో వర్షాలు లేక కప్పల సంతతి బాగా క్షీణించింది.

ప్రకృతికి పెనుముప్పు 
ప్రస్తుతం ముంగారు వానలతో బావులు, చెరువులు, కుంటలలోకి నీరు చేరటంతో కప్పలు వచ్చాయి. బెకబెకలను బట్టి బుల్‌ఫ్రాగ్‌ ఏదో వేటగాళ్లు గుర్తిస్తారు. మాంసం కోసం కప్పలను చంపటంవల్ల సంతతి క్షీణిస్తుందని పరిసంరక్షకులు ఆవేదన చెందుతున్నారు. పర్యావరణానికీ ప్రమాదమే అవుతుంది. కప్పలు దోమలు, దోమల గుడ్లను తినేస్తాయి. దీంతో దోమల బెడద తగ్గడానికి సాయపడతాయి. పంటలకు సోకే అనేక రోగాలకు కారణమైన కీటకాలను కప్పలు తింటాయి. దీంతో పర్యావరణం సమతుల్యతకు కప్పలు ఎంతో దోహదపడతాయి. అవే కప్పలను పాములు తింటూ ఆకలి తీర్చుకుంటాయి. 

చెక్‌పోస్టుల్లో తనిఖీలు
కప్పలను పట్టడం, రవాణా చేయడం తప్పు, గోవాకు వెళ్లే మార్గంలో చెక్‌పోస్ట్‌ల్లో తనిఖీలకు ఆదేశించాం అని కార్వార డిప్యూటీ డీఎఫ్‌ఓ వసంతరెడ్డి తెలిపారు. రాత్రి సమయంలో అటవీ సిబ్బంది ప్రత్యేక నిఘా పెట్టిన్నట్లు ఆయన తెలిపారు. అనుమానం ఉన్న వాహనాలను తనిఖీ చేయటంతో పాలు ఎక్కువగా కప్పలను పట్టే ప్రాంతాలను గుర్తించి నిఘా పెంచినట్లు చెప్పారు.   – అటవీ అధికారి వసంతరెడ్డి  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement