రవిశాస్త్రినే బాధ్యత వహించాలి: గంగూలీ

Ravi Shastri needs to be held accountable for Indias results, says Ganguly - Sakshi

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను ఇంకా మ్యాచ్‌ ఉండగానే కోల్పోవడంపై భారత క్రికెట్‌ జట్టు ప్రదర్శనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే భారత బ్యాటింగ్‌ లైనప్‌పై సునీల్‌ గావస‍్కర్‌ సందేహం వ్యక్తం చేయగా, తాజాగా సౌరవ్‌ గంగూలీ పెదవి విప్పాడు. అసలు ఈ సిరీస్‌ ఓటమికి బాధ్యత ఎవరిదంటూ ప్రశ్నను లేవనెత్తిన గంగూలీ.. టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రినే పూర్తిస్థాయి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందన్నాడు. ఆటగాళ్లలో ఆత్మస్థైర్యం పూర్తిగా సన్నగిల్లడంతోనే వారి బ్యాటింగ్‌ తీసికట్టుగా మారిందన్న గంగూలీ.. వారిలో ఆత్మవిశ్వాసం నింపాల్సిన బాధ్యత కోచ్‌దేనన్నాడు. ఈ క్రమంలోనే రవిశాస్త్రితో పాటు బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నాడు.

‘ఇంగ్లండ్ గడ్డపై విరాట్ కోహ్లి మాత్రమే రాణిస్తున్నాడు. జట్టులో మిగిలిన వాళ్ల పరిస్థితి ఏంటి..? వాళ్లు ఎందుకు బ్యాటింగ్‌లో వరుసగా విఫలమవుతున్నారు..? ఈ ప్రశ్నకి సరైన సమాధానం దొరక్కపోతే.. భారత్ జట్టు ఎప్పటికీ దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌లను గెలవలేదు. 2011 నుంచి చూస్తే ఈ మూడు దేశాల్లో భారత్‌ జట్టు వరుసగా సిరీస్‌లను చేజార్చుకుంటూనే వస్తోంది. విరాట్ కోహ్లి చక్కగా ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొంటున్నాడు. కానీ.. మిగతా వాళ్లు తడబడుతున్నారు. వారిలో ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిల్లినట్లు కనిపిస్తోంది. గతంలో చతేశ్వర పుజారా, అజింక్యా రహానె బాగా ఆడారు. కానీ.. ఈ సిరీస్‌లో వాళ్లు కూడా ఒత్తిడిలోనే కనిపిస్తున్నారు. ఆటగాళ్లలో ఆత్మస్థైర్యం నింపాల్సిన బాధ్యత కోచ్‌లది. కానీ.. వారు విఫలమయ్యారు. కాబట్టి.. తాజా టెస్టు సిరీస్‌ లో ఓటమికి కోచ్‌ రవిశాస్త్రితో పాటు సంజయ్‌ బంగర్‌లు బాధ్యత వహించాలి’ అని సౌరవ్ గంగూలీ వెల్లడించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top