టెస్టుల్లో పోటీ రెట్టింపైంది

Players Competition in Test cricket has gone up - Sakshi

‘చాంపియన్‌షిప్‌’పై ఉత్సుకతతో ఉన్నా

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి

నార్త్‌సౌండ్‌: సంప్రదాయ టెస్టు క్రికెట్‌పై టీమిండియా కెప్టె న్‌ విరాట్‌ కోహ్లి తన అభిమానాన్ని మరోసారి చాటాడు. మూడు ఫార్మాట్లలోకెల్లా టెస్టులే తనకెంతో ఇష్టమని పదేపదే చెప్పే అతడు... ప్రజలంతా టెస్టుల మనుగడ ప్రశ్నార్ధకమైందని మాట్లాడుతున్నారని, తన దృష్టిలో మాత్రం గత రెండేళ్లలో వాటిలో పోటీ రెట్టింపైందని చెప్పుకొచ్చాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ పట్ల ఉత్సుకతతో ఉన్నట్లు వివరించాడు. ‘మ్యాచ్‌లు పోటాపోటీగా సాగుతూ టెస్టులను అర్థవంతంగా మారుస్తున్నాయి.

ఈ సవాల్‌ను స్వీకరించి విజయాలకు ప్రయత్నించడం అనేది ఆటగాళ్లచేతిలో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చాంపియన్‌షిప్‌ నిర్వహణ సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయం’ అని కోహ్లి విశ్లేషించాడు. సోమవారం రాత్రి వెస్టిండీస్‌ క్రికెట్‌ ఆటగాళ్ల సంఘం అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న కోహ్లి ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘చాంపియన్‌షిప్‌లో అదనపు పాయింట్ల కోసం జట్లు ఆలోచిస్తాయి. దీంతో బోర్‌ కొట్టే ‘డ్రా’ల కంటే ఆసక్తి రేపే ‘డ్రా’లు ఉంటాయి. టెస్టుల్లో బ్యాట్స్‌మెన్‌కు కష్టాలు ఎక్కువ. చాంపియన్‌షిప్‌ ద్వారా మరింత క్లిష్ట పరిస్థితులు ఎదురవుతా’యని వివరించాడు.

‘నెక్‌ గార్డ్స్‌’ ధరించడం ఆటగాళ్ల ఇష్టం...
యాషెస్‌ టెస్టులో స్మిత్‌–ఆర్చర్‌ ఉదంతం తర్వాత బ్యాట్స్‌మెన్‌కు మెడ భాగంలో రక్షణ కల్పించేలా ప్రత్యేక ఏర్పాట్లున్న హెల్మెట్లు ధరించడంపై చర్చ సాగుతోంది. ఇప్పటికే ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ ట్రావిస్‌ హెడ్‌ ఈ రకమైన హెల్మెట్‌తో బరిలో దిగనున్నట్లు ప్రకటించాడు. భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) మాత్రం ఈ విషయాన్ని టీమిండియా సభ్యుల విచక్షణకే వదిలేసింది. ఇది క్రికెటర్లు ముఖ్యంగా బ్యాట్స్‌మెన్‌ సౌకర్యానికి సంబంధించినది కావడంతో తాము ఒత్తిడి చేయదల్చుకోలేదని బోర్డు అధికారి ఒకరు తెలిపారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top