ఈ విజయంతో ఆగిపోను

Olympics Medal is the goal of life - Sakshi

ఈ ఏడాది కామన్వెల్త్, ఆసియా క్రీడలపై దృష్టి

ఇప్పుడు తగిన గుర్తింపు దక్కింది

 ‘సాక్షి’తో జిమ్నాస్ట్‌ బుద్దా అరుణ రెడ్డి  

పుష్కర కాలానికి పైగా ఆ అమ్మాయి తాను ఎంచుకున్న ఆటలో తీవ్రంగా శ్రమించింది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తన పోరాటాన్ని ఆపలేదు. తనను నడిపించిన నాన్న దూరమైనా ఆయన కోరుకున్న లక్ష్యాన్ని  చేరుకునేందుకు మరింత కష్టపడింది. ఫ్లోర్‌పై, అన్‌ ఈవెన్‌ బార్స్‌పై కెరీర్‌ ‘బ్యాలెన్స్‌’ చేసుకుంటూ వెళ్లింది. కామన్వెల్త్‌ నుంచి ఆసియా క్రీడల వరకు, ఆసియా చాంపియన్‌షిప్‌ నుంచి ప్రపంచ చాంపియన్‌షిప్‌ వరకు పాల్గొనడమే తప్ప పతకానికి చేరువ కాలేకపోయిన సమయంలోనూ పట్టు వదల్లేదు. ఎట్టకేలకు ఇప్పుడు ప్రపంచ కప్‌లో పతకంతో మెరిసిన బుద్దా అరుణ రెడ్డి విజయగాథ ఇది.    

సాక్షి సిటీ బ్యూరో, హైదరాబాద్‌  :ఆత్మరక్షణ కోసం నేర్చుకున్న క్రీడ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన అమ్మాయి 22 ఏళ్ల బుద్దా అరుణ. ఇటీవల జిమ్నాస్టిక్స్‌ ప్రపంచ కప్‌లో కాంస్య పతకం సాధించిన ఆమె ఈ ఘనత సాధిం చిన తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందింది. ఇంతటితో ఆగిపోకుండా భవిష్యత్తులో మరిన్ని విజ యాలు సాధిస్తానని ఆమె ఆత్మవిశ్వాసంతో చెబుతోం ది. అయితే తన కెరీర్‌ తుది లక్ష్యం మాత్రం ఒలింపిక్‌ పతకం మాత్రమే అని చెప్పింది. శుక్రవారం స్వస్థలం హైదరాబాద్‌కు చేరుకున్న 22 ఏళ్ల అరుణ తాజా విజయం, తన కెరీర్‌కు సంబంధించిన విశేషాల గురించి ‘సాక్షి’తో చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే... 

కెరీర్‌ ఆరంభంపై... 
చార్టెడ్‌ అకౌంటెంట్‌ అయిన నాన్న నారాయణ రెడ్డికి ఆటలంటే కూడా ఆసక్తి. అయితే ముందుగా అమ్మాయికి ఆత్మరక్షణ కోసమంటూ నన్ను కరాటేలో చేర్పించారు. అయితే ఆ తర్వాత కరాటే మాస్టర్‌ బాలసుబ్రమణ్యం సూచనపై నేను జిమ్నాస్టిక్స్‌ వైపు మళ్లాను. ఎల్బీ స్టేడియంలో కోచ్‌లు స్వర్ణలత, రవీందర్, ఇప్పుడు బ్రిజ్‌ కిశోర్‌ మార్గ నిర్దేశనంలో నేను చాలా నేర్చుకున్నాను. ప్రాథమికాంశాల నుంచి వివిధ ఈవెంట్లలో పోటీ పడే వరకు అన్ని రకాలుగా శ్రమించాను. నేను మంచి ఫలితాలు సాధిస్తూ పోయాను. సబ్‌ జూనియర్‌ స్థాయి మొదలు ఇంటర్‌ యూనివర్సిటీ, సీనియర్‌ నేషనల్స్‌ వరకు వరుసగా పతకాలు సాధించాను. అయితే అంతర్జాతీయ స్థాయిలో చెప్పుకోదగ్గ ఫలితాలు రాకపోవడంతో నాకు పెద్దగా గుర్తింపు లభించలేదు.  

నాన్న మరణం తర్వాత... 
నేను ఇంకా కెరీర్‌లో నిలదొక్కుకోక ముందే నాన్న 2010లో అకస్మాత్తుగా చనిపోవడం నన్ను కలచివేసింది. ఇక ఆటను కొనసాగించడం కష్టమనిపించింది. నాన్న ఉన్నంత వరకు నేను చాలా ధైర్యంగా ఉన్నాను. నాన్న అండ, ప్రేమ, ఆప్యాయతతో ధైర్యంగా అన్ని ఆటలు ఆడాను. ఆ క్షణాన నేను ఓ బలమైన శక్తిని కోల్పోయాను అనిపించింది. అప్పటి నుంచి నాకు కష్టాలు చాలా ఎదురయ్యాయి. నాన్న ఉన్నప్పుడు ప్రాక్టీస్‌కి, గేమ్స్‌కి, శిక్షణ శిబిరాలకు తనే స్వయంగా తీసుకెళ్లేవారు. నాన్న చనిపోయాక నేను ఒక్కదానినే ట్రావెల్‌ చేస్తుంటే చాలా కష్టంగా ఉండేది. నా శిక్షణ, సాధన విషయాల్లో ఎన్ని డబ్బులు ఖర్చు అయ్యాయనే విషయాలు కూడా నాకు తెలీదు, నాన్న  ఎప్పుడూ చెప్పలేదు. నాన్న మరణానంతరం ఆర్థిక సమస్యలు తలెత్తడంతో  మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాను. నేను విజయం సాధించిన ప్రతిసారీ నాన్న ఉండి ఉంటే ఎంత సంతోషించేవారో అని మా అమ్మ సుభద్ర గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నాన్న మరణించాక అక్క పావని, బావ జనార్ధన్‌ రెడ్డి నిరంతరం ప్రోత్సహించి నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. కుటుంబసభ్యుల అండతో ఎన్ని సమస్యలు వచ్చినా ఆట నుంచి వెనక్కి వెళ్లాలనే ఆలోచన మాత్రం ఎప్పుడూ రాలేదు. 

సీనియర్‌ స్థాయిలో ఫలితాలపై... 
జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తూ  అనేక పతకాలు గెలుచుకున్నాను. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) కూడా నాకు అండగా నిలిచింది. దాంతో అంతర్జాతీయ టోర్నీలలో వరుసగా పాల్గొన్నాను. ముఖ్యంగా 2014లో జరిగిన కామన్వెల్త్, ఆసియా క్రీడలు, 2013లో ప్రపంచ చాంపియన్‌షిప్, గత ఏడాది ఆసియా చాంపియన్‌షిప్‌ వాటిలో ముఖ్యమైనవి. దురదృష్టవశాత్తూ వీటిలో పతకానికి చేరువగా రాలేకపోయాను. అయితే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలలో పాల్గొనడం వల్ల నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. నా స్థాయి గురించి తెలుసుకొని తప్పులు దిద్దుకునేందుకు ఎంతో ఉపయోగపడింది.  

ప్రపంచ కప్‌ పతకంపై... 
నేను ఈ టోర్నీ కోసం ప్రత్యేకంగా తాష్కెంట్‌లో సిద్ధమయ్యాను. ఈ శిక్షణ కోసం గ్రీన్‌కో గ్రూప్‌తో పాటు వ్యాపారవేత్త, మాజీ క్రికెటర్‌ చాముండేశ్వరీనాథ్‌ కూడా ఆర్థికంగా చాలా సహాయ పడ్డారు. టోర్నీలో నేను ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదు. వాల్ట్‌ ఈవెంట్‌లో నా సహజ శైలిలోనే ఆడాను. కొన్ని విన్యాసాలు కష్టంగా ఉన్నా... సుదీర్ఘ కాలంగా అదే సాధన కాబట్టి కొత్తగా అనిపించలేదు. పతకం గెలుచుకున్న క్షణాన ఎంతో గర్వ పడ్డాను. చాలా ఉద్వేగానికి లోనయ్యాను. తర్వాతి రోజు ఫ్లోర్‌ విభాగంలో కూడా బాగానే రాణించినా చివరకు పతకం మాత్రం దక్కలేదు.  జిమ్నాస్టిక్స్‌కు ఉత్తర భారతంలో చాలా ప్రాధాన్యత ఉంది. మన దక్షిణాదిలో దీనికి పెద్దగా గుర్తింపు లేదనే చెప్పాలి. రియో ఒలింపిక్స్‌లో దీపా కర్మాకర్‌ తన ప్రతిభను కనబరచడంతో అందరి దృష్టి ఆమెపై పడింది. నేను కూడా అలాంటి గుర్తింపునే కోరుకున్నాను. ఈ పతకంతో నేను ఏంటో అందరికీ తెలిసింది. మున్ముం దు కూడా ఇలాంటి ఫలితాలు సాధించా లని కోరుకుంటున్నా. ప్రభుత్వం నుంచి  జిమ్నాస్టిక్స్‌కు ప్రోత్సాహం ఉంటే పెద్ద సంఖ్యలో ఆటగాళ్లు రావడంతో పాటు మంచి ఫలితాలు సాధించవచ్చు.  

తర్వాతి లక్ష్యాలపై... 
వచ్చే నెలలో కామన్వెల్త్‌ క్రీడలు, ఆ తర్వాత ఇదే ఏడాది ఆసియా క్రీడలు కూడా ఉన్నాయి. వీటిలో పతకాలు గెలుచుకోవడంపైనే ప్రస్తుతం నా దృష్టి. ఆదివారమే తిరిగి తాష్కెంట్‌ వెళ్లిపోతున్నాను. మరోసారి మంచి ఫలితం రాబడతాననే నమ్మకముంది. అయితే ఏ క్రీడాకారిణికైనా అంతిమ లక్ష్యం ఒలింపిక్స్‌ పతకం సాధించడమే. నేను కూడా దాని గురించే కలలుగంటున్నాను. టోక్యో ఒలింపిక్స్‌లో పతకం నెగ్గాలనే లక్ష్యంతో ఉన్నాను. అందుకోసం ఎంతయినా కష్టపడతా. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పథకం ‘టాప్‌’లో ఉండటంతో ఆర్థికపరంగా కూడా పరిస్థితి కొంత మెరుగైంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top